కంటెంట్‌కు వెళ్లు

దేవుడు నన్ను క్షమిస్తాడా?

దేవుడు నన్ను క్షమిస్తాడా?

బైబిలు ఇచ్చే జవాబు

క్షమిస్తాడు, మీరు సరైన చర్యలు తీసుకుంటే దేవుడు మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తాడు. దేవుడు “క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడు,” “ఆయన బహుగా క్షమించును” అని బైబిలు చెప్తుంది. (నెహెమ్యా 9:17; కీర్తన 86:5; యెషయా 55:7) ఆయన మనల్ని క్షమించినప్పుడు, పూర్తిగా క్షమిస్తాడు. అంటే, మన పాపాలను ‘తుడిచేస్తాడు’ లేదా చెరిపేస్తాడు. (అపొస్తలుల కార్యములు 3:20) అంతేకాదు “వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను” అని అంటున్నాడు కాబట్టి ఆయన శాశ్వతంగా క్షమిస్తాడు. (యిర్మీయా 31:34) ఒక్కసారి క్షమించాక, మనల్ని పదేపదే నిందించడానికో లేదా శిక్షించడానికో ఆయన మన పాపాలను మళ్లీమళ్లీ తవ్వడు.

అలాగని, దేవుడు తన బలహీనత వల్లో, సెంటిమెంట్‌కి లొంగిపోవడం వల్లో క్షమించట్లేదు. ఆయన తన నీతియుక్త ప్రమాణాలను ఎప్పటికీ మార్చడు. అందుకే ఆయన కొన్ని పాపాలను క్షమించడానికి ఒప్పుకోడు.—యెహోషువ 24:19, 20.

దేవుని క్షమాపణ పొందడానికి తీసుకోవాల్సిన చర్యలు

  1. మీ పాపం దేవుని ప్రమాణాలకు వ్యతిరేకమని గుర్తించండి. మీరు చేసిన పాపం వల్ల వేరేవాళ్లు కూడా బాధపడివుండొచ్చు, కానీ దానివల్ల మీరు దేవుణ్ణి బాధపెట్టారని ముందుగా గుర్తించాలి.—కీర్తన 51:1, 4; అపొస్తలుల కార్యములు 24:16.

  2. దేవునికి ప్రార్థన చేసి మీ తప్పు ఒప్పుకోండి.—కీర్తన 32:5; 1 యోహాను 1:9.

  3. మీరు చేసిన పాపానికి తీవ్రంగా దుఃఖించండి. ఈ “దైవచిత్తానుసారమైన దుఃఖము” పశ్చాత్తాపాన్ని లేదా మారు మనస్సును కలిగిస్తుంది. (2 కొరింథీయులు 7:10) పాపం చేయడానికి నడిపించిన తప్పుడు పనుల విషయంలో కూడా మీరు బాధపడాలి.—మత్తయి 5:27, 28.

  4. మీ ప్రవర్తనను మార్చుకోండి, అంటే దేవునివైపు “తిరగండి.” (అపొస్తలుల కార్యములు 3:20) దీనికోసం బహుశా, మీరు చేస్తున్న తప్పుడు పనిని లేదా అలవాటును మానుకోవాల్సి ఉంటుంది, లేదా మీరు మొత్తం మీ ఆలోచనా విధానాన్ని, ప్రవర్తించే తీరును మార్చుకోవాల్సి ఉంటుంది.—ఎఫెసీయులు 4:23, 24.

  5. చేసిన తప్పును సరిచేసుకోవడానికి, జరిగిన నష్టాన్ని పూరించడానికి చర్యలు తీసుకోండి. (మత్తయి 5:23, 24; 2 కొరింథీయులు 7:11) మీరు ఏదైనా చేయడం వల్ల, లేదా చేయాల్సింది ఏదైనా చేయకపోవడం వల్ల బాధపడిన వాళ్లకు క్షమాపణ చెప్పి, పరిస్థితిని చక్కబరచడానికి శాయశక్తులా కృషి చేయండి.—లూకా 19:7-10.

  6. దేవునికి ప్రార్థన చేసి, యేసు విమోచన క్రయధన బలి ఆధారంగా మిమ్మల్ని క్షమించమని వేడుకోండి. (ఎఫెసీయులు 1:7) అయితే దేవుడు మీ ప్రార్థనకు జవాబివ్వాలంటే, మీరు కూడా మీ పట్ల పాపం చేసినవాళ్లను క్షమించాలి.—మత్తయి 6:14, 15.

  7. మీరు చేసింది పెద్ద పాపమైతే, మీకు అవసరమైన ఆధ్యాత్మిక సహాయాన్ని ఇవ్వగల, మీ తరఫున ప్రార్థన చేయగల పరిణతి ఉన్న వ్యక్తితో మాట్లాడండి.—యాకోబు 5:14-16.

దేవుని క్షమాపణ పొందడం గురించిన అపోహలు

“నా పాపాలకు క్షమాపణ లేదు.”

వ్యభిచారం, హత్య చేసిన దావీదును దేవుడు క్షమించాడు

బైబిల్లో దేవుడు చెప్పిన చర్యల్ని తీసుకుంటే, ఆయన మనల్ని క్షమిస్తాడు. ఎందుకంటే దేవునికున్న క్షమించే సామర్థ్యం మన పాపాల కంటే గొప్పది. ఆయన పెద్దపెద్ద పాపాల్ని, మళ్లీమళ్లీ చేసే తప్పుల్ని కూడా క్షమించగలడు.—సామెతలు 24:16; యెషయా 1:18.

ఉదాహరణకు, వ్యభిచారం, హత్య చేసిన ఇశ్రాయేలు రాజు దావీదు క్షమాపణ పొందాడు. (2 సమూయేలు 12:7-13) ఈ లోకంలో అందరికంటే పెద్ద పాపినని భావించిన అపొస్తలుడైన పౌలు కూడా క్షమాపణ పొందాడు. (1 తిమోతి 1:15, 16) అంతెందుకు, మొదటి శతాబ్దంలోని యూదులు, మెస్సీయ అయిన యేసు చావుకు బాధ్యులని దేవుడు భావించాడు. అయినా వాళ్లకు కూడా దేవుని వైపు తిరిగి, క్షమాపణ పొందే అవకాశం ఉంది.—అపొస్తలుల కార్యములు 3:15, 18-20.

“ఒక ఫాదర్‌ ముందు లేదా మతగురువు ముందు ఒప్పుకుంటే నా పాపాలు పోతాయి.”

దేవునికి విరుద్ధంగా చేసిన పాపాలను క్షమించే అధికారం ఇప్పుడు ఏ మనిషికీ లేదు. ఒక పాపి తను చేసిన పాపాల్ని వేరే వ్యక్తికి చెప్పడం వల్ల అతని మనసు తేలికపడవచ్చు కానీ, పాపాల్ని క్షమించగలిగేది మాత్రం దేవుడే.—ఎఫెసీయులు 4:32; 1 యోహాను 1:7, 9.

అది నిజమైతే, మరి యేసు తన అపొస్తలులతో చెప్పిన ఈ మాటకు అర్థం ఏమిటి? “మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును; ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండును.” (యోహాను 20:23) యేసు శిష్యులు పవిత్రశక్తిని పొందినప్పుడు, ఆయన వాళ్లకు ఇచ్చే ప్రత్యేకమైన అధికారం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు.—యోహాను 20:22.

ఆయన వాగ్దానం చేసినట్లే, సా.శ. 33లో పవిత్రశక్తి కుమ్మరించబడినప్పుడు అపొస్తలులు ఈ వరాన్ని పొందారు. (అపొస్తలుల కార్యములు 2:1-4) శిష్యులైన అననీయ, సప్పీరాలకు తీర్పు తీర్చినప్పుడు పేతురు ఈ అధికారాన్ని ఉపయోగించాడు. వాళ్ల మోసాన్ని పేతురు అద్భుతరీతిలో తెలుసుకున్నాడు, అంతేకాదు అతను ఇచ్చిన తీర్పు, వాళ్ల పాపానికి క్షమాపణ లేదని సూచించింది.—అపొస్తలుల కార్యములు 5:1-11.

పవిత్రశక్తి వల్ల వచ్చే ఈ వరం, అలాగే స్వస్థపర్చడం, భాషల్లో మాట్లాడడం వంటి మిగతా వరాలు అపొస్తలులు చనిపోయిన తర్వాత ఆగిపోయాయి. (1 కొరింథీయులు 13:8-10) కాబట్టి, ఈ రోజుల్లో ఏ మనిషీ వేరే మనిషి పాపాలను పోగొట్టలేడు.