కంటెంట్‌కు వెళ్లు

తల్లిదండ్రులు తమ పిల్లలకు సెక్స్‌ గురించి ఎలా బోధించవచ్చు?

తల్లిదండ్రులు తమ పిల్లలకు సెక్స్‌ గురించి ఎలా బోధించవచ్చు?

బైబిలు ఇచ్చే జవాబు

 పిల్లలకు సెక్స్‌ గురించి ఎవరు బోధించాలి? ఆ బాధ్యత తల్లిదండ్రులదే అని బైబిలు చెప్తుంది. కింద ఇచ్చిన ఈ సలహాలు చాలామంది తల్లిదండ్రులకు ఉపయోగపడ్డాయి:

  •   సిగ్గుపడకండి. సెక్స్‌ గురించి, జననాంగాల గురించి బైబిలు దాపరికం లేకుండా మాట్లాడుతుంది. అలాంటి విషయాల గురించి పిల్లలకు బోధించమని దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి చెప్పాడు. (ద్వితీయోపదేశకాండము 31:12; లేవీయకాండము 15:2, 16-19) మీరు మీ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్లు సెక్స్‌ గురించి లేదా శరీర అవయవాల గురించి సరిగ్గా అర్థం చేసుకునేలా, గౌరవపూర్వకమైన పదాలు ఉపయోగించండి.

  •   క్రమక్రమంగా బోధించండి. మీ పిల్లలు యుక్తవయసుకు వచ్చాక, ఒకేసారి సెక్స్‌ గురించి ఒక పెద్ద ప్రసంగం ఇచ్చే బదులు, వాళ్లు అర్థం చేసుకోగలిగేలా, విషయాల్ని చిన్నప్పటినుండే క్రమక్రమంగా బోధించండి.—1 కొరింథీయులు 13:11.

  •   నైతిక విలువలు నేర్పించండి. కొన్ని స్కూళ్లు సెక్స్‌ గురించి కొన్ని విషయాల్ని పిల్లలకు నేర్పించవచ్చు. అయితే తల్లిదండ్రులు, సెక్స్‌కు సంబంధించి ఏవో కొన్ని విషయాలు చెప్పి ఊరుకునే బదులు, సెక్స్‌ను సరైన దృష్టితో చూసే విషయంలో, సరిగ్గా ప్రవర్తించే విషయంలో కూడా తమ పిల్లలకు ఉపదేశించాలని బైబిలు చెప్తుంది.—సామెతలు 5:1-23.

  •   మీ పిల్లలు చెప్పేది వినండి. మీ పిల్లలు సెక్స్‌ గురించి ఏమైనా ప్రశ్నలు అడిగితే, అతిగా స్పందించకండి లేదా వాళ్లేదో తప్పు చేస్తున్నారనే అభిప్రాయానికి రాకండి. బదులుగా, ‘వినడానికి’ సిద్ధంగా ఉండండి, ‘మాట్లాడడానికి నిదానించండి.’—యాకోబు 1:19.

లైంగిక దాడిచేసే వ్యక్తుల నుండి మీ పిల్లల్ని ఎలా కాపాడుకోవచ్చు?

మీ పిల్లలతో ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తుంటే, దాన్ని ఎలా ఎదిరించాలో మీ పిల్లలకు నేర్పించండి

  •   మీరు తెలుసుకోండి. అసలు ఓ వ్యక్తి ఎలా పిల్లలమీద లైంగిక దాడి చేస్తాడో తెలుసుకోండి.—సామెతలు 18:15; యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మక సమాధానాలు, 1వ సంపుటి (ఇంగ్లీష్‌) పుస్తకంలో 32వ అధ్యాయం చూడండి.

  •   మీ పిల్లల గురించి శ్రద్ధ తీసుకోండి. నమ్మదగినవాళ్లో కాదో తెలియకుండా ఎవరుపడితే వాళ్ల దగ్గర మీ పిల్లల్ని వదిలేయకండి. మీ పిల్లల్ని మీ ‘అదుపులో’ ఉంచుకోండి.—సామెతలు 29:15.

  •   ఎవరి మాట వినాలో, ఎవరి మాట వినకూడదో మీ పిల్లలకు నేర్పించండి. పిల్లలు తమ తల్లిదండ్రుల మాట వినడం నేర్చుకోవాలి. (కొలొస్సయులు 3:20) పెద్దవాళ్ల మాట అన్ని సందర్భాల్లోనూ వినాలని మీరు మీ పిల్లలకు చెప్తే, వాళ్లు లైంగిక దాడికి గురయ్యే అవకాశముంది. అయితే, క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇలా చెప్పాలి, “దేవునికి ఇష్టంలేని పని చేయమని ఎవరైనా నీకు చెప్తే, దాన్ని చేయొద్దు.”—అపొస్తలుల కార్యములు 5:29.

  •   చిన్నచిన్న జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో ప్రాక్టీసు చేయించండి. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా తమతో తప్పుగా ప్రవర్తిస్తే ఏమి చేయాలో మీ పిల్లలకు నేర్పించండి. అలాంటి చిన్నచిన్న సన్నివేశాల్ని నటిస్తూ ప్రాక్టీసు చేయించడంవల్ల “ముట్టుకోవద్దు! అలా చేశావంటే నీ మీద చెప్తా!” అని పిల్లలు ధైర్యంగా చెప్పగలుగుతారు, అలాగే అక్కడినుండి వెంటనే వెళ్లిపోగలుగుతారు. పిల్లలు ఆ విషయాల్ని త్వరగా మర్చిపోవచ్చు, కాబట్టి మీరు వాటిని పదేపదే గుర్తుచేయాల్సి రావచ్చు.—ద్వితీయోపదేశకాండము 6:7.