కంటెంట్‌కు వెళ్లు

నోవహు, జలప్రళయం కథ నిజమా? లేదా కట్టుకథా?

నోవహు, జలప్రళయం కథ నిజమా? లేదా కట్టుకథా?

బైబిలు ఇచ్చే జవాబు

 జలప్రళయం నిజంగా వచ్చింది. దుష్టుల్ని నాశనం చేయడానికి దేవుడే దాన్ని రప్పించాడు. అయితే మంచివాళ్లను, జంతువుల్ని కాపాడడానికి ఆయన నోవహుతో ఓడ కట్టమన్నాడు. (ఆదికాండము 6:11-20) జలప్రళయం నిజంగా వచ్చిందని మనం నమ్మవచ్చు, ఎందుకంటే ‘దేవుడు ప్రేరేపించి’ రాయించిన బైబిల్లో దాని గురించి ఉంది.—2 తిమోతి 3:16.

 వాస్తవమా, కట్టుకథా?

 నోవహు ఒక నిజమైన మనిషి అని, జలప్రళయం కట్టుకథ కాదు నిజమైన సంఘటన అని బైబిలు చెప్తుంది.

  •   బైబిలు రాసినవాళ్లు నోవహు నిజమైన మనిషని నమ్మారు. ఉదాహరణకు, బైబిల్లోని కొంతభాగం రాసిన ఎజ్రా, లూకా అనే నైపుణ్యంగల చరిత్రకారులు ఇశ్రాయేలీయుల వంశావళి పట్టికల్లో నోవహు పేరు రాశారు. (1 దినవృత్తాంతములు 1:4; లూకా 3:36) సువార్త రచయితలైన మత్తయి, లూకా కూడా నోవహు గురించి, జలప్రళయం గురించి యేసు చెప్పిన మాటల్ని రాశారు.—మత్తయి 24:37-39; లూకా 17:26, 27.

     యెహెజ్కేలు ప్రవక్త, అపొస్తలుడైన పౌలు కూడా విశ్వాసం విషయంలో, నీతి విషయంలో నోవహు మంచి ఆదర్శమని పేర్కొన్నారు. (యెహెజ్కేలు 14:14, 20; హెబ్రీయులు 11:7) నోవహు నిజమైన మనిషి కాకపోతే, ఆయన ఆదర్శాన్ని పాటించమని వాళ్లు రాసివుండేవాళ్లా? నోవహు, విశ్వాసం చూపించిన ఇతర స్త్రీపురుషులు నిజమైన మనుషులు కాబట్టే వాళ్లు మనకు ఆదర్శంగా ఉన్నారు.—హెబ్రీయులు 12:1; యాకోబు 5:17.

  •   జలప్రళయం గురించిన నిర్దిష్ట వివరాలు బైబిల్లో ఉన్నాయి. బైబిలు జలప్రళయం గురించి చెప్పేటప్పుడు, “అనగనగనగా” అంటూ కట్టుకథలా మొదలుపెట్టలేదు. బదులుగా, జలప్రళయానికి సంబంధించిన సంఘటనలు ఏ సంవత్సరం, ఏ నెల, ఏ తేదీన జరిగాయో బైబిలు చెప్తుంది. (ఆదికాండము 7:11; 8:4, 13, 14) అంతేకాదు, నోవహు కట్టిన ఓడ కొలతలు కూడా అందులో ఉన్నాయి. (ఆదికాండము 6:15) కాబట్టి, బైబిలు ప్రకారం జలప్రళయం ఒక కట్టుకథ కాదు వాస్తవ సంఘటన అని తెలుస్తోంది.

 జలప్రళయం ఎందుకు వచ్చింది?

 జలప్రళయానికి ముందు “నరుల చెడుతనము ... గొప్పది” అని బైబిలు చెప్తోంది. (ఆదికాండము 6:5) అంతేకాదు, భూమి హింసతో, లైంగిక పాపాలతో నిండిపోయి “దేవుని సన్నిధిని చెడిపోయియుండెను” అని అది చెప్తోంది.—ఆదికాండము 6:11; యూదా 6, 7.

 ఈ సమస్యకు ముఖ్య కారణం, చెడ్డదూతలు మానవ స్త్రీలతో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి పరలోకాన్ని విడిచిరావడమే అని బైబిలు చెప్తోంది. దానివల్ల వాళ్లకు నెఫీలీయులు అనే పిల్లలు పుట్టారు, వీళ్లు అప్పట్లో భూమ్మీద విధ్వంసం సృష్టించారు. (ఆదికాండము 6:1, 2, 4) కాబట్టి దేవుడు భూమ్మీది నుండి దుష్టత్వాన్ని తుడిచేసి, మంచివాళ్లు కొత్త జీవితం ఆరంభించేలా చేయాలనుకున్నాడు.—ఆదికాండము 6:6, 7, 17.

 జలప్రళయం వస్తుందని అప్పటి ప్రజలకు తెలుసా?

 తెలుసు. జలప్రళయం రాబోతుందని, తమ కుటుంబాన్నీ జంతువుల్నీ కాపాడడానికి ఒక ఓడ కట్టమని దేవుడు నోవహుకు చెప్పాడు. (ఆదికాండము 6:13, 14; 7:1-4) రాబోతున్న ఆ నాశనం గురించి నోవహు ప్రజల్ని హెచ్చరించాడు, కానీ వాళ్లు లెక్కచేయలేదు. (2 పేతురు 2:5) వాళ్ల గురించి బైబిలు ఇలా చెప్తోంది: “జలప్రళయం వచ్చి వాళ్లందర్నీ కొట్టుకొనిపోయే వరకు వాళ్లు ఏమీ పట్టించుకోలేదు.”—మత్తయి 24:37-39.

 నోవహు ఓడ ఎలా ఉండేది?

 ఓడ దీర్ఘచతురస్రాకారంలో పెద్ద పెట్టెలా ఉండేది. దాని పొడవు దాదాపు 133 మీటర్లు (437 అడుగులు), వెడల్పు 22 మీటర్లు (73 అడుగులు), ఎత్తు 13 మీటర్లు (44 అడుగులు). a దాన్ని చితిసారకపు మ్రానుతో చేసి లోపల, బయట కీలు పూశారు. అందులో మూడు అంతస్థులు, చాలా గదులు ఉండేవి. దానికి ఒకవైపు తలుపు ఉండేది; పైకప్పుకు దగ్గర్లో, దాని పొడవునా ఒక కిటికీ ఉండవచ్చు. ఓడ మీద పడే నీళ్లు కారిపోయేలా, ఆ పైకప్పు మధ్యలో కాస్త ఎత్తుగా, అంచుల వైపు ఏటవాలుగా ఉండివుండవచ్చు.—ఆదికాండము 6:14-16.

 ఓడ కట్టడానికి నోవహుకు ఎంతకాలం పట్టింది?

 ఓడ కట్టడానికి నోవహుకు ఎంతకాలం పట్టిందో బైబిలు చెప్పట్లేదు, అయితే దానికి కొన్ని దశాబ్దాలు పట్టివుండొచ్చు. నోవహుకు 500 ఏళ్లు దాటాక అతని మొదటి కొడుకు పుట్టాడు, జలప్రళయం వచ్చినప్పుడు నోవహు వయసు 600 ఏళ్లు. bఆదికాండము 5:32; 7:6.

 నోవహు ముగ్గురు కొడుకులు ఎదిగి, వాళ్లకు పెళ్లిళ్లు అయ్యాక, దేవుడు నోవహును ఓడ కట్టమన్నాడు; దానికి దాదాపు 50 లేదా 60 ఏళ్లు పట్టివుంటుంది. (ఆదికాండము 6:14, 18) అదే నిజమైతే, ఓడ కట్టడానికి 40 లేదా 50 ఏళ్లు పట్టివుంటుందనే ముగింపుకు రావచ్చు.

a బైబిలు ఓడ కొలతల్ని మూరల్లో చెప్తుంది. “ప్రామాణిక హీబ్రూ మూర 17.5 అంగుళాలు (44.45 సెంటీమీటర్లు) ఉండేది.”—ద ఇలస్ట్రేటెడ్‌ బైబిల్‌ డిక్షనరీ, రివైజ్డ్‌ ఎడిషన్‌, 3వ భాగం, 1635వ పేజీ.

b నోవహు లాంటి వాళ్ల ఆయుష్షు గురించి తెలుసుకోవడానికి, తేజరిల్లు! అక్టోబరు – డిసెంబరు 2007 సంచికలోని “వారు నిజంగా అంతకాలం జీవించారా?” అనే ఆర్టికల్‌ చూడండి.