కంటెంట్‌కు వెళ్లు

క్షమించరాని పాపం అంటే ఏమిటి?

క్షమించరాని పాపం అంటే ఏమిటి?

బైబిలు ఇచ్చే జవాబు

ఒక పాపి, దేవుని క్షమాపణను ఎప్పటికీ పొందనివ్వని వైఖరిని ప్రదర్శిస్తూ చేసే పనులు క్షమించరాని పాపం అవుతాయి. అసలు అలాంటి పరిస్థితి ఎలా వస్తుంది?

చేసిన పాపాలకు పశ్చాత్తాపపడి, దేవుని ప్రమాణాల ప్రకారం జీవిస్తూ, యేసుక్రీస్తు మీద విశ్వాసం చూపించే వాళ్లను దేవుడు క్షమిస్తాడు. (అపొస్తలుల కార్యములు 3:19, 20) అయినా, ఒక వ్యక్తి తన వైఖరిని లేదా ప్రవర్తనను ఎప్పటికీ మార్చుకోనంతగా పాపపు మార్గానికి అలవాటుపడే అవకాశం ఉంది. అలాంటి వ్యక్తిని బైబిలు, “పాపమువలన కలుగు భ్రమచేత” కఠినమైపోయిన ‘దుష్ట హృదయం’ గల వ్యక్తి అని వర్ణిస్తుంది. (హెబ్రీయులు 3:12, 13) మట్టి పెంకును బట్టీలో కాల్చేసిన తర్వాత దాని ఆకారాన్ని మళ్లీ మార్చలేము. అలాగే, ఆ వ్యక్తి హృదయం కూడా శాశ్వతంగా దేవునికి వ్యతిరేకంగా మారిపోయింది. (యెషయా 45:9) అలాంటి వ్యక్తిని క్షమించడానికి ఏ ఆధారం ఉండదు, కాబట్టి అతను క్షమించరాని, మన్నించలేని పాపం చేసినవాడు.—హెబ్రీయులు 10:26, 27.

యేసు కాలంలోని కొంతమంది యూదా మత పెద్దలు క్షమించరాని పాపం చేశారు. యేసు చేసిన అద్భుతాల వెనక దేవుని పవిత్రశక్తి ఉందని వాళ్లకు తెలుసు, అయినా వాళ్లు చెడు ఉద్దేశంతో, యేసుకున్న శక్తి సాతాను నుండే వచ్చిందని అన్నారు.—మార్కు 3:22, 28-30.

క్షమాపణ ఉన్న పాపాలకు ఉదాహరణలు

  • తెలియక చేసే దైవదూషణ. అపొస్తలుడైన పౌలు ఒకప్పుడు దైవదూషకుడు, కానీ తర్వాత ఆయన “తెలియక అవిశ్వాసమువలన చేసితిని గనుక కనికరింపబడితిని” అని అన్నాడు.—1 తిమోతి 1:12, 13.

    వ్యభిచారం. ఒక సమయంలో వ్యభిచారం చేసి తర్వాత తమ ప్రవర్తన మార్చుకుని దేవుని క్షమాపణ పొందిన కొంతమంది గురించి బైబిలు ప్రస్తావిస్తుంది.—1 కొరింథీయులు 6:9-11.

  • వ్యభిచారం. ఒక సమయంలో వ్యభిచారం చేసి తర్వాత తమ ప్రవర్తన మార్చుకుని దేవుని క్షమాపణ పొందిన కొంతమంది గురించి బైబిలు ప్రస్తావిస్తుంది.—1 కొరింథీయులు 6:9-11.

“నేను క్షమించరాని పాపం చేశానా?”

మీరు గతంలో చేసిన పాపాన్ని నిజంగా ద్వేషిస్తుంటే, మీరు నిజంగా మారాలని అనుకుంటుంటే మీరు క్షమించరాని పాపం చేయనట్లే. దేవుని ప్రమాణాలకు వ్యతిరేకంగా మీ హృదయాన్ని శాశ్వతంగా కఠినపరచుకోకుండా ఉన్నంత కాలం, మీరు ఏదైనా పాపపు ఉచ్చులో మళ్లీమళ్లీ పడిపోతున్నా ఆయన మిమ్మల్ని క్షమించగలడు.—యెషయా 1:18.

కొంతమందిని అపరాధ భావాలు వేధించడంతో తాము క్షమించరాని పాపం చేశామేమోనని అనుకుంటారు. కానీ, మన భావాలను ప్రతీసారీ నమ్మకూడదని బైబిలు చెప్తోంది. (యిర్మీయా 17:9) ఎవరికీ తీర్పుతీర్చే అధికారం దేవుడు మనకివ్వలేదు, అంటే మనం, మనకు కూడా తీర్పుతీర్చుకోకూడదు. (రోమీయులు 14:4, 11, 12) మన స్వంత హృదయమే మనల్ని నిందిస్తున్నా సరే, ఆయన మనల్ని క్షమించగలడు.—1 యోహాను 3:19, 20.

ఇస్కరియోతు యూదా క్షమించరాని పాపం చేశాడా?

అవును, చేశాడు. అతను పేరాశతో, పవిత్రమైన సేవకోసం వచ్చిన విరాళాలను దొంగిలించాడు. పైగా, ఎక్కువ డబ్బు వస్తే ఎక్కువ దొంగిలించవచ్చనే చెడు ఉద్దేశాన్ని మనసులో పెట్టుకుని, బీదల మీద శ్రద్ధ ఉన్నట్టు నటించాడు. (యోహాను 12:4-8) ఒకసారి యూదా హృదయం తప్పుడు పని చేయడానికి శాశ్వతంగా నిర్ణయించేసుకోవడంతో, అతను 30 వెండి నాణాల కోసం యేసుకు ద్రోహం చేశాడు. తను చేసిన తప్పుకు యూదా నిజమైన పశ్చాత్తాపాన్ని ఎప్పటికీ చూపించడని యేసుకు తెలుసు, అందుకే అతనిని “నాశన పుత్రుడు” అన్నాడు. (యోహాను 17:12) అంటే యూదా చనిపోయినప్పుడు పునరుత్థాన నిరీక్షణ లేని శాశ్వత మరణం పొందుతాడని అర్థం.—మార్కు 14:21.

యూదా, తను చేసిన పాపానికి నిజమైన పశ్చాత్తాపం చూపించలేదు. అతను తన పాపాన్ని దేవుని ముందు ఒప్పుకోకుండా, ఆ కుట్రకు మూలమైన మతనాయకుల దగ్గర ఒప్పుకున్నాడు.—మత్తయి 27:3-5; 2 కొరింథీయులు 7:10.