కంటెంట్‌కు వెళ్లు

క్షమించడం అంటే ఏమిటి?

క్షమించడం అంటే ఏమిటి?

బైబిలు ఇచ్చే జవాబు

 క్షమించడం అంటే తప్పుచేసిన వ్యక్తిని మన్నించడం. బైబిల్లో, “క్షమించడం” అని అనువదించిన గ్రీకు పదానికి “వదిలేయడం” లేదా “పోనివ్వడం” అని అర్థం. ఇది అప్పు ఇచ్చిన వ్యక్తి, తనకు రావాల్సిన డబ్బును వదిలేయడం లాంటిది. యేసు తన అనుచరులకు ప్రార్థించడం నేర్పించినప్పుడు ఈ పోలికనే ఉపయోగించాడు. “మేము మాకచ్చియున్న (లేదా మాకు అప్పువున్న) ప్రతివానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము.” (లూకా 11:4) అలాగే, కరుణలేని దాసుని గురించిన ఉపమానంలో కూడా క్షమించడం అప్పును రద్దు చేయడంతో సమానమని యేసు చూపించాడు.—మత్తయి 18:23-35.

 మనం కోపాన్ని వదిలేసి, మనకు కలిగిన బాధకు లేదా నష్టానికి పరిహారం అడగకపోవడమే ఇతరులను క్షమించడం. నిజంగా క్షమించాలంటే, నిస్వార్థమైన ప్రేమ ఉండాలని బైబిలు చెప్తోంది. ఎందుకంటే, ప్రేమ “అపకారమును మనస్సులో ఉంచుకొనదు.”—1 కొరింథీయులు 13:4, 5.

క్షమించడమంటే ఏమి చేయకూడదు?

  •   తప్పును చూసీచూడనట్లు ఉండకూడదు. చెడుపనులు హానికరం కాదని, వాటిలో తప్పులేదని అనుకునేవాళ్లను బైబిలు ఖండిస్తోంది.—యెషయా 5:20.

  •   అసలు తప్పే జరగలేదన్నట్లు ఉండకూడదు. దావీదు ఒక పెద్ద పాపం చేసినప్పుడు, దేవుడు క్షమించాడు. కానీ దాని వల్ల వచ్చే చెడు ఫలితాల నుండి ఆయన దావీదును కాపాడలేదు. అంతేకాదు, నేడు మనం గుర్తుచేసుకోవడానికి వీలుగా దావీదు చేసిన పాపాలను దేవుడు బైబిల్లో రాయించాడు.—2 సమూయేలు 12:9-13.

  •   ఎదుటివాళ్లు మిమ్మల్ని అలుసుగా తీసుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఉదాహరణకు, మీరు ఒక వ్యక్తికి అప్పు ఇచ్చారనుకుందాం. అతను ఆ డబ్బును వృథా చేసేసి, చెప్పిన సమయానికి అప్పు తీర్చలేకపోయాడు. అతను చాలా బాధపడ్డాడు, మీకు క్షమాపణ కూడా చెప్పాడు. అయితే, మీరు అతని మీద కోపం పెట్టుకోకుండా, జరిగినదానికి మళ్లీమళ్లీ దెప్పిపొడవకుండా, బహుశా మొత్తం అప్పును రద్దు చేసేసి అతన్ని క్షమించేయవచ్చు. కానీ, అతనికి ఇంకెప్పుడూ అప్పు ఇవ్వకూడదనే నిర్ణయం కూడా మీరు తీసుకోవచ్చు.—కీర్తన 37:21; సామెతలు 14:15; 22:3; గలతీయులు 6:7.

  •   సరైన ఆధారం లేకుండా క్షమించకూడదు. చెడు ఉద్దేశంతో, కావాలని పాపం చేసినవాళ్లను దేవుడు క్షమించడు. అలాగే తమ తప్పులను ఒప్పుకోకుండా, మనసు మార్చుకోకుండా, తాము బాధపెట్టిన వాళ్లకు క్షమాపణ చెప్పకుండా ఉన్నవాళ్లను దేవుడు క్షమించడు. (సామెతలు 28:13; అపొస్తలుల కార్యములు 26:20; హెబ్రీయులు 10:26) పశ్చాత్తాపం లేని అలాంటి వాళ్లు దేవునికి శత్రువులౌతారు, దేవుడు క్షమించని వాళ్లను మనం క్షమించాలని ఆయన కోరుకోడు.—కీర్తన 139:21, 22.

     మీ విషయంలో ఎవరైనా దారుణంగా ప్రవర్తించి క్షమాపణ చెప్పకపోతే, కనీసం చేసినదాన్ని ఒప్పుకోకపోతే మీరేం చేయాలి? బైబిలు ఇలా సలహా ఇస్తోంది: “కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము.” (కీర్తన 37:8) మీరు తప్పును క్షమించకపోవచ్చు, అలాగని కోపాన్ని పెంచుకోనవసరం లేదు. దేవుడే ఆ వ్యక్తికి తీర్పు తీరుస్తాడని నమ్మండి. (హెబ్రీయులు 10:30, 31) అంతేకాదు, ఇప్పుడు మనం భరించే బాధ, వేదన ఇంకెప్పుడూ ఉండని కాలాన్ని దేవుడు తీసుకొస్తాడని గుర్తుంచుకొని మీరు ఓదార్పు పొందవచ్చు.—యెషయా 65:17; ప్రకటన 21:4.

  •   ప్రతీ చిన్నదానికీ బాధపడిపోకూడదు. కొన్నిసార్లు, ఒక వ్యక్తి మనల్ని అవమానించారని మనకు అనిపించవచ్చు, ఆ వ్యక్తిని క్షమించే మాట పక్కనపెడితే, అసలు మనకు అవమానం జరిగిందనడానికి సరైన కారణమే లేకపోవచ్చు. దాన్ని మనం ఒప్పుకోవాలి. బైబిలు ఇలా చెప్తోంది: ‘ప్రతీ చిన్న విషయానికి బాధపడిపోవద్దు. అలా బాధపడిపోవడం మూర్ఖత్వానికి గుర్తు.’—ప్రసంగి 7:9, NW.

క్షమించాలంటే ఏమి చేయాలి?

  1.   క్షమించడం అంటే ఏంటో గుర్తుపెట్టుకోవాలి. మీరు తప్పును చూసీచూడనట్లు ఉండరు లేదా అదసలు జరగలేదన్నట్లు ప్రవర్తించరు, దాన్ని వదిలేస్తారు అంతే.

  2.   క్షమించడం వల్ల వచ్చే ప్రయోజనాలను గుర్తించాలి. కోపాన్ని, ఆగ్రహాన్ని వదిలేస్తే మీరు ప్రశాంతంగా ఉంటారు, మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, సంతోషం రెట్టింపవుతుంది. (సామెతలు 14:30; మత్తయి 5:9) మరింత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇతరుల్ని క్షమిస్తేనే దేవుడు మీ పాపాలను క్షమిస్తాడు.—మత్తయి 6:14, 15.

  3.   తదనుభూతి చూపించాలి. మనందరం అపరిపూర్ణులమే. (యాకోబు 3:2) మనం చేసిన తప్పుల్ని ఎదుటివాళ్లు క్షమించాలని కోరుకుంటాం, అలాగే మనం కూడా ఎదుటివాళ్ల తప్పుల్ని క్షమించాలి.—మత్తయి 7:12.

  4.   సహేతుకంగా ఉండాలి. మన ఫిర్యాదుకు కారణం చిన్నదైనప్పుడు, ఈ బైబిలు సలహాను పాటించవచ్చు: ‘ఒకరినొకరు సహించండి.’—కొలొస్సయులు 3:13.

  5.   వెంటనే చర్య తీసుకోవాలి. మీ కోపం పెరిగే వరకు ఆగకుండా, వెంటనే క్షమించడానికి ప్రయత్నాలు చేయండి.—ఎఫెసీయులు 4:26, 27.