కంటెంట్‌కు వెళ్లు

క్రైస్తవులు వైద్య చికిత్సలు చేయించుకోవచ్చా?

క్రైస్తవులు వైద్య చికిత్సలు చేయించుకోవచ్చా?

బైబిలు ఇచ్చే జవాబు

తప్పకుండా చేయించుకోవచ్చు. “రోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు” అని చెప్పడం ద్వారా తనను అనుసరించేవాళ్లు వైద్య చికిత్సలు చేయించుకోవచ్చని యేసు సూచించాడు. (మత్తయి 9:12) బైబిలు వైద్యానికి సంబంధించిన పుస్తకం కాకపోయినప్పటికీ, దేవున్ని సంతోషపెట్టాలని కోరుకునేవాళ్లకు వైద్యానికి సంబంధించి చక్కని సూత్రాలను తెలియజేస్తూ సహాయపడుతుంది.

మీరిలా ప్రశ్నించుకోండి

1. నన్ను చేయించుకోమంటున్న చికిత్స ఏమిటో నాకు అర్థమైందా? “ప్రతి మాట” నమ్మేయకుండా, నమ్మకమైన సమాచారం కోసం వెతకాలని బైబిలు మనకు సలహా ఇస్తోంది.—సామెతలు 14:15.

2. నేను ఇద్దరు ముగ్గురు డాక్టర్లను కలిసి సలహా తీసుకోవాలా? ‘ఆలోచన చెప్పేవాళ్లు బహుమంది’ ఉండడం మంచిది. ముఖ్యంగా మీ పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లైతే అది చాలా అవసరం.—సామెతలు 15:22.

3. నా చికిత్సా విధానం, “రక్తమును . . . విసర్జింపవలెను” అని బైబిలిచ్చే ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉందా?—అపొస్తలుల కార్యములు 15:28.

4. నా వ్యాధి నిర్ధారించడానికి లేదా చికిత్స చేయడానికి మంత్రతంత్రాలను ఉపయోగిస్తున్నారా? ‘అభిచారాన్ని’ బైబిలు ఖండిస్తుంది. (గలతీయులు 5:19-21) మీ చికిత్సకు మంత్రతంత్రాలతో సంబంధం ఉందో లేదో తెలుసుకోవడానికి వీటి గురించి ఆలోచించండి:

  • చికిత్స చేసే వ్యక్తి మంత్రతంత్రాలను ఉపయోగిస్తున్నాడా?

  • దేవుళ్లకు కోపం రావడంవల్లో లేక చేతబడి కారణంగానో మీ ఆరోగ్యం పాడైందనే ఉద్దేశంతో మీకు చికిత్స చేస్తున్నారా?

  • మందు తయారీ లేదా వాడకంలో బలులు అర్పించడం, మంత్రాలు చదవడం, ఇతర అభిచార ఆచారాలు పాటించడం లేదా వాటికి సంబంధించిన వస్తువులు ఉపయోగించడం లాంటివి చేస్తున్నారా?

5. నా ఆరోగ్యం గురించి అతిగా ఆలోచిస్తున్నానా? బైబిలు ఇలా సలహా ఇస్తోంది, “మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యుడి.” (ఫిలిప్పీయులు 4:5) సహనం చూపిస్తే మీరు “శ్రేష్ఠమైన కార్యముల” మీద అంటే ఆధ్యాత్మిక విషయాల మీద మనసు పెట్టగలుగుతారు.—ఫిలిప్పీయులు 1:9-11; మత్తయి 5:3.