కంటెంట్‌కు వెళ్లు

కొత్త యెరూషలేము అంటే ఏమిటి?

కొత్త యెరూషలేము అంటే ఏమిటి?

బైబిలు ఇచ్చే జవాబు

“కొత్త యెరూషలేము” అనే పదబంధం బైబిల్లో రెండు చోట్ల కనిపిస్తుంది. ఈ సూచనార్థక నగరం, దేవుని రాజ్యంలో యేసుతోపాటు పరిపాలించడానికి పరలోకానికి వెళ్లే యేసు అనుచరుల గుంపును సూచిస్తుంది. (ప్రకటన 3:12; 21:2) బైబిలు ఈ గుంపును క్రీస్తు పెళ్లికూతురు అని కూడా పిలుస్తుంది.

కొత్త యెరూషలేము అంటే ఏమిటో అర్థంచేసుకోవడానికి సహాయం చేసే అంశాలు

  1. కొత్త యెరూషలేము పరలోకంలో ఉంది. బైబిలు కొత్త యెరూషలేము గురించి ప్రస్తావించినప్పుడు, అది పరలోకం నుండి దిగి వస్తున్నట్లు, ఆ నగర గుమ్మాల్ని దేవదూతలు కాపలా కాస్తున్నట్లు వర్ణిస్తోంది. (ప్రకటన 3:12; 21:2, 10, 12) అంతేకాదు ఆ నగరం కొలతల్ని బట్టి, అది భూమ్మీద ఉండేది కాదని చెప్పవచ్చు. ఘనాకారంలో ఉండే ఆ నగరం దాదాపు 2,200 కిలోమీటర్లు ఉంటుంది. (ప్రకటన 21:16) దాని గోడలు దాదాపు 560 కిలోమీటర్ల ఎత్తుతో అంతరిక్షం వరకు ఉంటాయి.

  2. కొత్త యెరూషలేము అనేది క్రీస్తు పెళ్లికూతురిగా ఉండే యేసు అనుచరుల గుంపు. ‘గొర్రెపిల్లకు భార్య కాబోయే పెళ్లికూతురినే’ కొత్త యెరూషలేము అంటాం. (ప్రకటన 21:9, 10) ఈ సూచనార్థక వర్ణనలోని గొర్రెపిల్ల యేసును సూచిస్తోంది. (యోహాను 1:29; ప్రకటన 5:12) ‘గొర్రెపిల్లకు భార్య కాబోయే పెళ్లికూతురు,’ పరలోకంలో యేసుతోపాటు పరిపాలించే క్రైస్తవుల్ని సూచిస్తోంది. ఈ క్రైస్తవులకు యేసుతో ఉండే సంబంధాన్ని, భార్యాభర్తల సంబంధంతో బైబిలు పోలుస్తోంది. (2 కొరింథీయులు 11:2; ఎఫెసీయులు 5:23-25) అంతేకాదు కొత్త యెరూషలేము నగర పునాదిరాళ్ల మీద “గొర్రెపిల్ల 12 మంది అపొస్తలుల 12 పేర్లు” ఉన్నాయి. (ప్రకటన 21:14) ఈ వివరణ బట్టి కొత్త యెరూషలేము ఎవరిని సూచిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే, పరలోకానికి వెళ్లే క్రైస్తవులు “అపొస్తలుల, ప్రవక్తల పునాది మీద” నిర్మించబడ్డారు.—ఎఫెసీయులు 2:20.

  3. కొత్త యెరూషలేము ఓ ప్రభుత్వంలో భాగం. ప్రాచీన యెరూషలేము ఇశ్రాయేలుకు రాజధానిగా ఉండేది. యెరూషలేము నుండే రాజైన దావీదు, ఆయన కుమారుడైన సొలొమోను, ఇంకా వాళ్ల వంశస్థులు “యెహోవా సింహాసనమందు” కూర్చుని పరిపాలించారు. (1 దినవృత్తాంతములు 29:23) కాబట్టి ‘పవిత్ర నగరం’ అని పిలువబడిన యెరూషలేము నుండి దావీదు వంశస్థులు చేసిన పరిపాలన, దేవుని పరిపాలనను సూచించింది. (నెహెమ్యా 11:1, NW) పవిత్ర నగరం అనే పేరు కొత్త యెరూషలేముకు కూడా ఉంది. అది, పరలోకంలో యేసుతోపాటు ‘రాజులుగా ఈ భూమిని పరిపాలించే’ గుంపును సూచిస్తోంది.—ప్రకటన 5:9, 10; 21:2.

  4. కొత్త యెరూషలేము భూమ్మీది ప్రజలకు దీవెనల్ని తెస్తుంది. బైబిలు కొత్త యెరూషలేమును ‘పరలోకంలోని దేవుని దగ్గర నుండి దిగి వస్తున్నట్లు’ వర్ణిస్తోంది. కాబట్టి భూమికి సంబంధించిన పనుల కోసం దేవుడు దాన్ని ఉపయోగించుకుంటాడని చెప్పవచ్చు. (ప్రకటన 21:2) ఈ మాటల్ని బట్టి కొత్త యెరూషలేముకు దేవుని రాజ్యంతో సంబంధం ఉందని అర్థమౌతుంది. దేవుని రాజ్యం, యెహోవా ఇష్టం “పరలోకంలో నెరవేరుతున్నట్టు భూమ్మీద కూడా” నెరవేరేలా చేస్తుంది. (మత్తయి 6:10) దేవుని సంకల్పం భూమ్మీది ప్రజలకు ఈ దీవెనల్ని తెస్తుంది:

    • పాపం నుండి విడుదల. కొత్త యెరూషలేము నుండి ప్రవహించే “జీవజలాల నది,” ‘దేశాల్ని స్వస్థపర్చే’ ‘జీవవృక్షాలకు’ నీటిని అందిస్తుంది. (ప్రకటన 22:1, 2) ఈ భౌతిక, ఆధ్యాత్మిక స్వస్థత వల్ల పాపం తీసేయబడుతుంది, దేవుని మొదటి సంకల్పం ప్రకారం మనుషులు పరిపూర్ణ జీవితం పొందుతారు.—రోమీయులు 8:21.

    • మనుషులకు దేవునితో మంచి సంబంధం. పాపం వల్ల మనుషులు దేవునికి దూరమైపోయారు. (యెషయా 59:2) అయితే మనుషులు పాపం నుండి విడుదల పొందడం వల్ల ఈ ప్రవచనం పూర్తిస్థాయిలో నెరవేరుతుంది: “దేవుని నివాసం మనుషులతో ఉంది. ఆయన వాళ్లతో పాటు నివసిస్తాడు. వాళ్లు ఆయన ప్రజలుగా ఉంటారు. దేవుడే స్వయంగా వాళ్లతోపాటు ఉంటాడు.”—ప్రకటన 21:3.

    • బాధ, మరణం ఇక ఉండవు. దేవుడు తన రాజ్యం ద్వారా, ప్రజల ‘కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును తుడిచేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు.’—ప్రకటన 21:4.