కంటెంట్‌కు వెళ్లు

కాలానికి సంబంధించి బైబిల్లో ఉన్న వివరాలు 1914 గురించి ఏమి చెప్తున్నాయి?

కాలానికి సంబంధించి బైబిల్లో ఉన్న వివరాలు 1914 గురించి ఏమి చెప్తున్నాయి?

బైబిలు ఇచ్చే జవాబు

 కాలానికి సంబంధించి బైబిల్లో ఉన్న వివరాల ప్రకారం 1914లో పరలోకంలో దేవుని రాజ్య స్థాపన జరిగింది. ఆ విషయాన్ని బైబిల్లోని దానియేలు పుస్తకం, 4వ అధ్యాయంలో ఉన్న ప్రవచనం తెలియజేస్తుంది.

 ఆ ప్రవచనంలో ఏముంది? బబులోనును పాలించే నెబుకద్నెజరు రాజుకు, దేవుడు జరగబోయే దాని గురించి ఒక కల చూపించాడు. అందులో ఒక పెద్ద చెట్టు నరికేయబడడం ఆ రాజు చూశాడు. అయితే, దాని మొద్దు మళ్లీ చిగురించకుండా ‘ఏడు కాలములపాటు’ కట్టివేయబడుతుంది, ఆ తర్వాత అది మళ్లీ పెరుగుతుంది.—దానియేలు 4:1, 10-16.

 ఆ ప్రవచనానికి మొదటి నెరవేర్పు. ఆ పెద్ద చెట్టు లేదా మహా వృక్షం నెబుకద్నెజరు రాజును సూచిస్తుంది. (దానియేలు 4:20-22) అతను ఏడు సంవత్సరాలపాటు తాత్కాలికంగా మతిస్థిమితాన్ని, రాజ్యాధికారాన్ని కోల్పోయినప్పుడు ఒకరకంగా నరకబడ్డాడు. (దానియేలు 4:25) దేవుడు నెబుకద్నెజరుకు పిచ్చి తగ్గేలా చేసినప్పుడు, అతను మళ్లీ రాజ్యాధికారాన్ని పొంది దేవుని పరిపాలనను ఒప్పుకున్నాడు.—దానియేలు 4:34-36.

 ఆ ప్రవచనానికి మరింత గొప్ప నెరవేర్పు ఉందనడానికి రుజువు. “మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారియైయుండి, తానెవరికి అనుగ్రహింప నిచ్ఛయించునో వారికనుగ్రహించుననియు, ఆ యా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుష్యులందరు తెలిసికొనునట్లు ఈలాగు జరుగును” అన్నదే ఈ ప్రవచనం మొత్తం ఉద్దేశం. (దానియేలు 4:17) మరి అలాంటి రాజ్యాధికారాన్ని, గర్వంగల నెబుకద్నెజరుకే ఇవ్వాలని దేవుడు అనుకున్నాడా? లేదు, ఎందుకంటే దేవుడు అంతకుముందే నెబుకద్నెజరుకు చూపించిన వేరే కలలో, అతనుగానీ వేరే ఏ రాజకీయ పరిపాలకుడు గానీ ఆ రాజ్యాధికారానికి తగినవాళ్లు కాదని చూపించాడు. నిజానికి, దేవుడే ‘ఒక రాజ్యము స్థాపిస్తాడు. దానికి ఎప్పటికీ నాశనము కలుగదు.’—దానియేలు 2:31-44.

 అంతకుముందు, దేవుడు తన పరిపాలనకు ప్రాతినిధ్యం వహించే ఒక రాజ్యాన్ని భూమ్మీద స్థాపించాడు; అదే ప్రాచీన ఇశ్రాయేలు రాజ్యం. అయితే, దాని పాలకులు ఆయనకు నమ్మకంగా ఉండలేదు, అందువల్ల ఆ రాజ్యం నాశనమైపోయేలా దేవుడు దాన్ని వదిలేశాడు. కానీ ‘స్వాస్థ్యకర్తకు’ లేదా హక్కుదారునికి రాజ్యాధికారాన్ని ఇస్తానని ఆయన ముందే చెప్పాడు. (యెహెజ్కేలు 21:25-27) ఎప్పటికీ నాశనంకాని ఈ రాజ్యానికి స్వాస్థ్యకర్త లేదా దాన్ని పొందే హక్కు ఉన్నవాడు యేసే అని బైబిలు చెప్తుంది. (లూకా 1:30-33) యేసు నెబుకద్నెజరులాంటి వాడు కాదు, ఆయన “దీనమనస్సు” గలవాడని బైబిలు ముందే చెప్పింది.—మత్తయి 11:29.

 దానియేలు 4వ అధ్యాయంలోని చెట్టు దేన్ని సూచిస్తుంది? బైబిల్లో కొన్నిసార్లు చెట్లు రాజ్యాధికారాన్ని సూచిస్తాయి. (యెహెజ్కేలు 17:22-24; 31:2-5) దానియేలు 4వ అధ్యాయానికి ఉన్న గొప్ప నెరవేర్పులో ఆ పెద్ద చెట్టు దేవుని రాజ్యాధికారాన్ని సూచిస్తుంది.

 చెట్టు నరకబడడం దేనికి గుర్తు? చెట్టు నరకబడడం, నెబుకద్నెజరు పరిపాలన కొంతకాలం ఆగిపోవడాన్ని సూచించినట్లే దేవుని పరిపాలన కూడా భూమ్మీద కొంతకాలం ఆగిపోవడాన్ని సూచిస్తుంది. ఇశ్రాయేలు రాజులు, దేవుని ప్రతినిధులుగా యెరూషలేములో “యెహోవా సింహాసనమందు” కూర్చునేవాళ్లు. ఆ యెరూషలేమును నెబుకద్నెజరు నాశనం చేసినప్పుడు చెట్టు నరకబడడం జరిగింది, అంటే భూమ్మీద దేవుని పరిపాలన ఆగిపోయింది.—1 దినవృత్తాంతములు 29:23.

 “ఏడు కాలములు” దేనికి సూచనగా ఉన్నాయి? దేవుడు ఏమాత్రం జోక్యం చేసుకోకుండా, ఈ లోక పాలకులు భూమిని పరిపాలించడానికి ఆయన అనుమతించిన కాలాన్ని “ఏడు కాలములు” సూచిస్తున్నాయి. బైబిల్లోని కాల వివరాల ప్రకారం బబులోనీయులు యెరూషలేమును క్రీ.పూ. 607 అక్టోబరులో నాశనం చేశారు. అప్పుడే ఈ “ఏడు కాలములు” మొదలయ్యాయి. a2 రాజులు 25:1, 8-10.

 “ఏడు కాలములు” అంటే ఎంత కాలం? నెబుకద్నెజరు విషయంలోలాగా ఈ “ఏడు కాలములు” కేవలం ఏడు సంవత్సరాలు కాకపోవచ్చు. అయితే, ఆ జవాబు మనకు యేసు మాటల్లో దొరుకుతుంది, “అన్యజనముల కాలములు సంపూర్ణమగువరకు [దేవుని రాజ్యాధికారానికి గుర్తుగా ఉన్న] యెరూషలేము అన్యజనములచేత త్రొక్కబడును” అని ఆయన అన్నాడు. (లూకా 21:24) తన రాజ్యాధికారం ‘అన్యజనములచేత త్రొక్కబడడానికి’ దేవుడు అనుమతించిన ఆ “అన్యజనముల కాలములు,” దానియేలు 4వ అధ్యాయంలోని “ఏడు కాలములు” ఒకటే. అంటే, యేసు భూమ్మీదున్న సమయానికి ఆ “ఏడు కాలములు” పూర్తికాలేదన్నమాట.

 ప్రవచనంలోని “ఏడు కాలములు” అంటే ఎంత కాలమో తెలుసుకోవడానికి బైబిలు మనకు సహాయం చేస్తుంది. మూడున్నర “కాలములు” 1,260 రోజులకు సమానమని బైబిలు చెప్తుంది, కాబట్టి “ఏడు కాలములు” ఆ సంఖ్యకు రెట్టింపు, అంటే 2,520 రోజులకు సమానం అవుతుంది. (ప్రకటన 12:6, 14) దీనికి, “దినమునకు ఒక సంవత్సరము” అనే ప్రవచనం నియమాన్ని అన్వయిస్తే, 2,520 రోజులు 2,520 సంవత్సరాలను సూచిస్తాయి. కాబట్టి, “ఏడు కాలములు” లేదా 2,520 సంవత్సరాలు 1914 అక్టోబరుకి పూర్తవుతాయి.—సంఖ్యాకాండము 14:34; యెహెజ్కేలు 4:6.

a క్రీ.పూ. 607వ సంవత్సరం గురించి వివరంగా తెలుసుకోవడానికి, 2011 అక్టోబరు 1 కావలికోట సంచికలోని 26-31 పేజీల్లో ఉన్న “When Was Ancient Jerusalem Destroyed?—Part One” అనే ఆర్టికల్‌ను, 2011 నవంబరు 1 కావలికోట సంచికలోని 22-28 పేజీల్లో ఉన్న “When Was Ancient Jerusalem Destroyed?—Part Two” అనే ఆర్టికల్‌ను చదవండి.