కంటెంట్‌కు వెళ్లు

కన్య మరియ గురించి బైబిలు ఏం చెప్తుంది?

కన్య మరియ గురించి బైబిలు ఏం చెప్తుంది?

 బైబిలు ఇచ్చే జవాబు

కన్యగా ఉన్నప్పుడే యేసుకు తల్లయ్యే గొప్ప అవకాశం మరియకు దక్కిందని బైబిలు చెప్తుంది. ఈ అద్భుతం గురించి బైబిల్లోని యెషయా పుస్తకం ముందే చెప్పింది, అది నిజంగా జరిగిందని మత్తయి, లూకా సువార్తలు చెప్తున్నాయి.

మెస్సీయ పుట్టుక గురించి యెషయా ఒక ప్రవచనంలో ఇలా చెప్పాడు: ‘ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కంటుంది.’ (యెషయా 7:14) యేసు మరియ గర్భంలో ఉన్నప్పుడు యెషయా ప్రవచనం నెరవేరిందని సువార్త రచయిత మత్తయి దైవ ప్రేరేపణతో రాశాడు. మరియ అద్భుతరీతిలో గర్భం ధరించిందని చెప్పాక మత్తయి ఇలా రాశాడు: “నిజానికి, యెహోవా తన ప్రవక్త ద్వారా చెప్పిన ఈ మాటలు నెరవేరేందుకే అదంతా జరిగింది: ‘ఇదిగో! ఒక కన్య * గర్భవతియై కొడుకును కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు.’ ఆ పేరుకు, ‘దేవుడు మనతో ఉన్నాడు’ అని అర్థం.”—మత్తయి 1:22, 23.

మరియ అద్భుతరీతిలో గర్భం ధరించడం గురించి సువార్త రచయిత లూకా కూడా రాశాడు. దేవుడు గబ్రియేలు దూతను “దావీదు వంశంలో పుట్టిన యోసేపు అనే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైన ఒక కన్య దగ్గరకు ... పంపించాడు. ఆ కన్య పేరు మరియ” అని అతను రాశాడు. (లూకా 1:26, 27) మరియ కూడా తాను కన్యనని చెప్పింది. ఆమె మెస్సీయకు, అంటే యేసుకు తల్లి అవుతుందని విన్నప్పుడు, “ఇదెలా సాధ్యం? నేనింకా కన్యనే కదా?” అని అంది.—లూకా 1:34.

 కన్య ఎలా బిడ్డను కంటుంది?

మరియ పవిత్రశక్తి ద్వారా, అంటే దేవుని చురుకైన శక్తి ద్వారా గర్భం ధరించింది. (మత్తయి 1:​18) దేవదూత మరియకు ఇలా చెప్పాడు: “పవిత్రశక్తి నీ మీదికి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అందుకే, పుట్టబోయే బిడ్డ పవిత్రుడని, దేవుని కుమారుడని * పిలవబడతాడు.” (లూకా 1:35) దేవుడు యేసు జీవాన్ని అద్భుతరీతిలో మరియ గర్భంలోకి పంపించాడు, అలా ఆమె గర్భవతి అయ్యింది.

 కన్య బిడ్డను కనడం వెనుక ఉద్దేశమేంటి?

మానవజాతిని పాప మరణాల నుండి రక్షించాలంటే యేసు పరిపూర్ణ మానవ శరీరంతో పుట్టాలి, అందుకే యేసు ఒక కన్యకు పుట్టేలా దేవుడు చేశాడు. (యోహాను 3:16; హెబ్రీయులు 10:5) దేవుడు యేసు జీవాన్ని మరియ గర్భంలోకి పంపించాడు. తర్వాత, ఎదుగుతున్న పిండానికి ఎలాంటి అపరిపూర్ణత సంక్రమించకుండా దేవుని పవిత్రశక్తి ఒక రక్షణ కవచంలా పనిచేసి ఉంటుందని స్పష్టమౌతోంది.​—లూకా 1:​35.

ఆ విధంగా యేసు, ఆదాము పాపం చేయకముందు ఎలా ఉన్నాడో అలా ఒక పరిపూర్ణ మనిషిగా పుట్టాడు. యేసు గురించి బైబిలు ఇలా చెప్తోంది: “ఆయన ఏ పాపం చేయలేదు.” (1 పేతురు 2:22) యేసు పరిపూర్ణ మనిషి కాబట్టి, మనుషుల్ని పాప మరణాల నుండి విడిపించడానికి విమోచన క్రయధనం చెల్లించగలడు.​—1 కొరింథీయులు 15:21, 22; 1 తిమోతి 2:​5, 6.

 మరియ ఎప్పటికీ కన్యగానే ఉందా?

మరియ ఎప్పటికీ కన్యగానే ఉందని బైబిలు చెప్పట్లేదు. బదులుగా, మరియకు యేసు కాకుండా ఇంకా పిల్లలు ఉన్నారని అది చెప్తుంది.​—మత్తయి 12:46; మార్కు 6:3; లూకా 2:7; యోహాను 7:5.

యేసుకు తమ్ముళ్లూ చెల్లెళ్లూ ఉన్నారని బైబిలు చెప్తుంది

 యేసు, పాపంలేని కన్యకు పుట్టాడా?

లేదు. పాపంలేని కన్య సిద్ధాంతం గురించి మాట్లాడుతూ న్యూ క్యాథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా, ‘గర్భంలో పడినప్పటి నుండే, అంటే ఆమె జీవం మొదలైన దగ్గర నుండే కన్య మరియలో మొదటి పాపం లేదు. మిగతా మనుషులకు పాప స్వభావం వారసత్వంగా వచ్చింది ... కానీ మరియ విషయానికొస్తే, ప్రత్యేక దయ వల్ల మొదటి పాపం ఆమెకు అంటలేదు’ అని చెప్తుంది. *

కానీ మరియకు మొదటి పాపం అంటలేదని బైబిలు ఎక్కడా చెప్పట్లేదు. (కీర్తన 51:5; రోమీయులు 5:​12) నిజానికి, ప్రసవించిన స్త్రీలు అర్పించాలని మోషే ధర్మశాస్త్రం ఆజ్ఞాపించిన పాప పరిహారార్థ బలిని అర్పించడం ద్వారా మరియ తనలో కూడా పాపం ఉందని చూపించింది. (లేవీయకాండము 12:​2-8; లూకా 2:​21-​24) న్యూ క్యాథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా అంటుంది: ‘పాపంలేని కన్య సిద్ధాంతం గురించి బైబిలు ప్రత్యేకంగా బోధించట్లేదు . . . [అది] చర్చికి సంబంధించిన బోధ.’

 మరియను మనం ఎలా చూడాలి?

విశ్వాసం, విధేయత, వినయం, దేవుని మీద ప్రగాఢమైన ప్రేమ అనే లక్షణాలు చూపించే విషయంలో మరియ చక్కని ఆదర్శాన్ని ఉంచింది. మనం అనుకరించాల్సిన నమ్మకమైన వ్యక్తుల్లో ఆమె కూడా ఉంది.​—హెబ్రీయులు 6:​12.

యేసు తల్లిగా మరియ ప్రత్యేక పాత్ర పోషించినా, మనం ఆమెను ఆరాధించాలని లేదా ఆమెకు ప్రార్థించాలని బైబిలు బోధించట్లేదు. తన తల్లి ప్రత్యేక గౌరవానికి అర్హురాలని గానీ తన అనుచరులు ఆమెను అలా గౌరవించాలని గానీ యేసు చెప్పలేదు. నిజానికి కొత్త నిబంధన అని పిలిచే భాగాన్ని గమనిస్తే, సువార్తల్లో అలాగే అపొస్తలుల కార్యాల్లో తప్ప మిగతా 22 పుస్తకాల్లో మరియ ప్రస్తావన ఉండదు.​—అపొస్తలుల కార్యాలు 1:​14.

మరియ మీద భక్తి చూపించడం సంగతి పక్కనపెడితే, తొలి క్రైస్తవులు ఆమెను ప్రత్యేకంగా చూశారని చెప్పడానికి కూడా లేఖనాల్లో ఎలాంటి రుజువులూ లేవు. బదులుగా, క్రైస్తవులు దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలని బైబిలు బోధిస్తోంది.​—మత్తయి 4:​10.

^ పేరా 10 యెషయా ప్రవచనంలో కన్యక అని అనువదించిన హీబ్రూ మూలపదం ఆల్మా. అది కన్యను లేదా కన్యకాని స్త్రీని సూచించవచ్చు. అయితే మత్తయి దైవ ప్రేరేపణతో ఇంకా నిర్దిష్టమైన పార్థెనోస్‌ అనే గ్రీకు పదాన్ని ఉపయోగించాడు, దానికి “కన్య” అని అర్థం.

^ పేరా 13 “దేవుని కుమారుడు” అనే మాట, దేవుడు ఒక స్త్రీతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడనే అర్థాన్నిస్తుందని కొంతమంది ఆ మాటను తప్పుబడతారు. అయితే లేఖనాలు అలా చెప్పట్లేదు. బదులుగా యేసు, దేవుడు స్వయంగా చేసిన ఒకేఒక్క వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి కాబట్టి బైబిలు ఆయన్ని “దేవుని కుమారుడు,” “మొత్తం సృష్టిలో మొట్టమొదటి వ్యక్తి” అని పిలుస్తోంది. (కొలొస్సయులు 1:13-15) మొదటి మనిషైన ఆదామును కూడా బైబిలు దేవుని కుమారుడని అంటుంది. (లూకా 3:38) ఎందుకంటే ఆదాము దేవుని చేత సృష్టించబడ్డాడు.

^ పేరా 20 రెండవ ఎడిషన్‌, 7వ సంపుటి, 331వ పేజీ.