కంటెంట్‌కు వెళ్లు

“ఏడు మరణకరమైన పాపాలు” అనేవి ఏమైనా ఉన్నాయా?

“ఏడు మరణకరమైన పాపాలు” అనేవి ఏమైనా ఉన్నాయా?

బైబిలు ఇచ్చే జవాబు

“ఏడు మరణకరమైన పాపాలు” అనే ప్రత్యేకమైన లిస్టు అంటూ బైబిల్లో ఏమీలేదు. అయితే, ఘోరమైన పాపాలు చేస్తూ ఉంటే రక్షణ పొందలేమని బైబిలు చెప్తోంది. ఉదాహరణకు లైంగిక పాపాలు, విగ్రహపూజ, మంత్రవిద్య, విపరీతమైన కోపం, తాగుబోతుతనం వంటి ఘోరమైన పాపాల్ని “పాపపు శరీరం చేసే పనులు” అని బైబిలు పిలుస్తూ, “అలాంటి పనులు చేసేవాళ్లు దేవుని రాజ్యంలో ఉండరు” అని కూడా చెప్తోంది.—గలతీయులు 5:19-21. *

యెహోవాకు అసహ్యములైన ఏడు విషయాలు ఏంటో బైబిలు చెప్పట్లేదా?

చెప్తోంది. కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌లో సామెతలు 6:16 ఇలా ఉంది, ‘ప్రభువుకు ఆరు విషయాలు హేయములు: అవును ఏడును ఆయనకు హేయములు.’ అయితే, సామెతలు 6:17-19 లో ప్రస్తావించబడిన పాపాల్లోనే అన్ని పాపాలు వస్తాయని కాదు. బదులుగా, అది అన్ని రకాల తప్పుడు పనులను సూచిస్తుంది. అంతేకాదు చెడు ఆలోచనల్ని, మాటల్ని, పనుల్ని కూడా ఆ లేఖనాలు సూచిస్తున్నాయి. *

‘మరణకరమైన పాపం’ అంటే అర్థమేమిటి?

పాపం చేసేవాళ్లు చనిపోతారని బైబిలు స్పష్టంగా చెప్తోంది. కానీ, యేసుక్రీస్తు విమోచన క్రయధనం ఆధారంగా మనం పాపం, మరణం నుండి విడుదల పొందవచ్చు. (రోమీయులు 5:12; 6:23) అయితే, “మరణశిక్ష పడేంత పాపం” చేస్తే దానినుండి బయటపడడానికి క్రీస్తు విమోచన క్రయధనం సహాయం చేయదు. ఇలాంటి పాపం చేసే వ్యక్తి పాపపు జీవితాన్నే గడపాలని నిశ్చయించుకుంటాడు. అతను తన ఆలోచనను, ప్రవర్తనను ఎప్పటికీ మార్చుకోడు. అలాంటి పాపం చేసే వ్యక్తికి “క్షమాపణ ఉండదు” అని బైబిలు కూడా చెప్తోంది.—మత్తయి 12:31; లూకా 12:10.

^ పేరా 1 గలతీయులు 5:19-21 వచనాల్లో ఉన్న 15 విషయాలు మాత్రమే ఘోరమైన పాపాలు కావు. ఆ వచనాల చివర్లో, “అలాంటి పనులు” అనే మాట కనిపిస్తుంది. కాబట్టి ఆ వచనాల్లో చెప్పబడిన విషయాలు కాకుండా ‘అలాంటి పనుల’ కోవలోకి ఇంకా ఏమేమి వస్తాయో ఎవరికివాళ్లు తమ వివేచనా సామర్థ్యాన్ని ఉపయోగించి ఆలోచించుకోవాలి.

^ పేరా 2 హీబ్రూ భాషలో ఒక జాతీయం ప్రకారం, మొదటి సంఖ్యను ఉపయోగించుకుని రెండవ సంఖ్యను నొక్కిచెప్తుంటారు. ఈ పద్ధతి చాలా వచనాల్లో కనిపిస్తుంది. ఒక ఉదాహరణ సామెతలు 6:16 లో ఉంది.—యోబు 5:19; సామెతలు 30:15, 18, 21.