కంటెంట్‌కు వెళ్లు

‘ఆల్ఫా, ఓమెగ’ అంటే ఏమిటి? ఆ పదం ఎవర్ని సూచిస్తుంది?

‘ఆల్ఫా, ఓమెగ’ అంటే ఏమిటి? ఆ పదం ఎవర్ని సూచిస్తుంది?

బైబిలు ఇచ్చే జవాబు

‘ఆల్ఫా, ఓమెగ’ సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుణ్ణి సూచిస్తుంది. ఈ పదం బైబిల్లో మూడు సార్లు కనిపిస్తుంది.—ప్రకటన 1:8; 21:6; 22:13. *

ఎందుకు దేవుడు తనను తాను “ఆల్ఫాను, ఓమెగను” అని చెప్పుకున్నాడు?

గ్రీకు అక్షరమాలలో ఆల్ఫా మొదటి అక్షరం, ఓమెగ చివరి అక్షరం. బైబిల్లో కొత్త నిబంధన అని పిలిచే భాగాన్ని గ్రీకు భాషలో రాశారు. దీంట్లో ప్రకటన పుస్తకం కూడా ఉంది. గ్రీకు అక్షరమాలలోని ఈ పదాల స్థానాల్ని ఉపయోగించి, యెహోవా ఆరంభాన్ని, ముగింపును సూచిస్తున్నాడని వర్ణించారు. (ప్రకటన 21:6) గతంలో యెహోవాయే సర్వశక్తిమంతుడైన దేవుడు, ఇక ఎప్పటికీ ఆయనే సర్వశక్తిమంతుడైన దేవుడు. “యుగయుగములు” ఆయన మాత్రమే ఉనికిలో ఉన్నాడు.—కీర్తన 90:2.

‘మొదటివాడు, చివరివాడు’ ఎవరు?

బైబిలు ఈ పదాన్ని యెహోవాకు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుకు ఇద్దరికి వేర్వేరు విధాల్లో అన్వయిస్తుంది. ఈ రెండు ఉదాహరణలు గమనించండి.

  • యెషయా 44:6లో యెహోవా ఇలా చెప్తున్నాడు: “నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు.” ఇక్కడ యెహోవా, తాను మాత్రమే శాశ్వతంగా ఉండే నిజమైన దేవుడని, తాను తప్ప వేరే దేవుడు లేడని నొక్కి చెప్తున్నాడు. (ద్వితీయోపదేశకాండము 4:35, 39) ఈ సందర్భంలో “మొదటివాణ్ణి, చివరివాణ్ణి” అనే పదాలకు “ఆల్ఫాను, ఓమెగను” అనే పదాలకు అర్థం ఒకటే.

  • “మొదటివాణ్ణి [ప్రోటోస్‌, ఆల్ఫా కాదు], చివరివాణ్ణి [ఎస్కాటోస్‌, ఓమెగ కాదు]” అనే పదం ప్రకటన 1:17, 18; 2:8లో కూడా కనిపిస్తుంది. ఈ వచనాల్లోని సందర్భాన్ని పరిశీలిస్తే, ఒకటి చనిపోవడాన్ని, రెండోది తిరిగి బ్రతకడాన్ని సూచిస్తుంది. ఈ పదాలు దేవుణ్ణి సూచించట్లేదు, ఎందుకంటే ఆయన ఎప్పుడూ చనిపోలేదు. (హబక్కూకు 1:12) అయితే యేసు చనిపోయాడు, పునరుత్థానమయ్యాడు. (అపొస్తలుల కార్యాలు 3:13-15) అమర్త్యమైన ఆత్మప్రాణిగా పరలోకానికి పునరుత్థానమైన వాళ్లలో మొట్టమొదటి వ్యక్తి యేసే. ఆయన అక్కడ “యుగయుగాలు” జీవిస్తున్నాడు. (ప్రకటన 1:18; కొలొస్సయులు 1:18) ఆ తర్వాత జరిగే పునరుత్థానాలన్నిటిని యేసే చేస్తాడు. (యోహాను 6:40, 44) అంతేకాకుండా యెహోవాయే స్వయంగా పునరుత్థానం చేసిన వాళ్లలో యేసే చివరి వ్యక్తి. (అపొస్తలుల కార్యాలు 10:40) అందుకే ఈ అర్థంలో యేసుని “మొదటివాణ్ణి, చివరివాణ్ణి” అనడం సరైనదే.

ప్రకటన 22:13లో ఉన్న ‘ఆల్ఫా, ఓమెగ’ యేసును సూచిస్తుందా?

లేదు. ప్రకటన 22:13లోని మాటలు ఖచ్చితంగా ఎవరు అన్నారో తెలియదు, పైగా ఆ అధ్యాయంలో చాలామంది మాట్లాడతారు. ఈ అధ్యాయం గురించి ప్రొఫెసర్‌ విలియమ్‌ బార్‌ క్లే ఇలా రాశాడు: “ఇక్కడ విషయాలు ఒక క్రమపద్ధతిలో చెప్పట్లేదు; . . . కాబట్టి ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారో ఖచ్చితంగా చెప్పలేం.” (ద రెవలేషన్‌ ఆఫ్‌ జాన్‌, 2వ సంపుటి, రివైజ్డ్‌ ఎడిషన్‌ 223వ పేజీ) ప్రకటన పుస్తకంలో మరోచోట ఇదే పదబంధం యెహోవాను సూచిస్తుంది, కాబట్టి ప్రకటన 22:13 ఉన్న ‘ఆల్ఫా, ఓమెగ’ కూడా యెహోవా దేవుణ్ణి సూచిస్తుందని చెప్పవచ్చు.

^ పేరా 3 ఈ పదం నాలుగోసారి, కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌ బైబిల్లోని ప్రకటన 1:11లో కనిపిస్తుంది. అయితే ఇది ప్రాచీన గ్రీకు రాతప్రతుల్లో లేని కారణంగా, చాలా ఆధునిక అనువాదాలు దీన్ని తీసేశాయి. కానీ తర్వాత దీన్ని లేఖన ప్రతుల్లో కలిపారు.