మారణహోమం ఎందుకు జరిగింది? దేవుడు దాన్ని ఎందుకు ఆపలేదు?
ఈ ప్రశ్నలు అడిగే చాలామంది ఎంతో తీవ్రంగా నష్టపోయి బాధను అనుభవిస్తున్నారు. అందుకే వాళ్లు కేవలం వాటికి సమాధానాలనే కాదుగానీ ఓదార్పును కోరుకుంటున్నారు. ఇంకొంతమంది ఆ మారణహోమాన్ని మనుషుల దుర్మార్గానికి పరాకాష్ఠగా భావిస్తూ దేవుణ్ణి నమ్మలేకపోతున్నారు.
దేవుని గురించి, మారణహోమం గురించి ప్రజల్లో సాధారణంగా ఉండే తప్పుడు అభిప్రాయాలు
అపోహ: మారణహోమాన్ని దేవుడు ఎందుకు ఆపలేదు అని అడగడం తప్పు.
నిజం: దేవుడు చెడును ఎందుకు ఆపట్లేదని ఎంతో విశ్వాసంగల ప్రజలు కూడా ప్రశ్నించారు. ఉదాహరణకు హబక్కూకు ప్రవక్తనే తీసుకోండి, అతను దేవుణ్ణి ఇలా ప్రశ్నించాడు: “నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేల ఊరకయే చూచుచున్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి?” (హబక్కూకు 1:3) అలా అడిగినందుకు దేవుడు హబక్కూకును గద్దించలేదు, బదులుగా మనందరం చదువుకునేలా ఆయన అడిగిన ప్రశ్నల్ని బైబిల్లో రాయించాడు.
అపోహ: మనుషుల బాధల్ని దేవుడు పట్టించుకోడు.
నిజం: దేవుడు చెడుతనాన్ని దానివల్ల వచ్చే బాధను ఇష్టపడడం లేదు. (సామెతలు 6:16-19) నోవహు కాలంలో భూమ్మీద హింస ఎక్కువవ్వడం చూసి దేవుడు “హృదయంలో నొచ్చుకున్నాడు.” (ఆదికాండము 6:5, 6) కాబట్టి మారణహోమం జరిగినప్పుడు కూడా దేవుడు చాలా బాధపడ్డాడు.—మలాకీ 3:6.
అపోహ: మారణహోమం దేవుడు యూదులకు విధించిన శిక్ష.
నిజం: మొదటి శతాబ్దంలో రోమన్లు యెరూషలేమును నాశనం చేయడానికి దేవుడు అనుమతించాడు. (మత్తయి 23:37-24:2) అయితే అప్పటినుండి కృపచూపించడానికి లేదా శిక్షించడానికి దేవుడు ఏ ప్రత్యేకమైన గుంపునూ ఎంచుకోలేదు. దేవుని దృష్టిలో యూదులు, అన్యులు సమానమే.—రోమీయులు 10:12.
అపోహ: ప్రేమగల శక్తివంతుడైన దేవుడు ఉండి ఉంటే, ఈ మారణహోమం జరగకుండా ఆపేవాడు.
నిజం: దేవుడు బాధలు పెట్టకపోయినా కొన్నిసార్లు ఆయన వాటిని కొంతకాలం వరకు అనుమతిస్తాడు.—యాకోబు 1:13; 5:11.
దేవుడు మారణహోమాన్ని ఎందుకు ఆపలేదు?
చాలాకాలం క్రితం తలెత్తిన వివాదాంశాలను పరిష్కరించడానికే దేవుడు మనషులందరికీ బాధల్ని అనుమతించాడు. ఆయన ఈ మారణహోమాన్ని కూడా అందుకే అనుమతించాడు. ప్రస్తుతం ఈ లోకాన్ని దేవుడు కాదుగానీ సాతాను పరిపాలిస్తున్నాడని బైబిలు స్పష్టంగా చెప్తుంది. (లూకా 4:1, 2, 6; యోహాను 12:31) దేవుడు మారణహోమాన్ని ఎందుకు అనుమతించాడో అర్థంచేసుకోవడానికి బైబిల్లో ఉన్న రెండు ప్రాథమిక విషయాలు మనకు సహాయం చేస్తాయి.
దేవుడు మనుషులకు స్వేచ్ఛాచిత్తాన్ని ఇచ్చాడు. దేవుడు మొదటి మానవులైన ఆదాముహవ్వలకు తాను వాళ్లనుండి ఏమి కోరుకుంటున్నాడో చెప్పాడే గానీ వాళ్లు తన మాట వినాల్సిందేనని బలవంతం చేయలేదు. మంచేదో చెడేదో తామే నిర్ణయించుకుంటామని ఆదాముహవ్వలు అనుకున్నారు. వాళ్లు తీసుకున్న తప్పుడు నిర్ణయం, అలాగే ఆ తర్వాత చరిత్రంతటిలో మనషులు తీసుకున్న చెడ్డ నిర్ణయాలే, మానవజాతి మొత్తం తీవ్రమైన కష్టాలు అనుభవించడానికి కారణమయ్యాయి. (ఆదికాండము 2:17; 3:6; రోమీయులు 5:12) స్టేట్మెంట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కన్జర్వేటివ్ జుడాయిసమ్ అనే పుస్తకం ఏం చెప్తుందంటే, “ఇప్పుడు లోకంలో ప్రజలు అనుభవించే చాలా బాధలకు మూలకారణం, మనకున్న స్వేచ్ఛాచిత్తాన్ని సరైన విధంగా ఉపయోగించుకోకపోవడమే.” అందుకని దేవుడు మనకున్న స్వేచ్ఛాచిత్తాన్ని తీసేయలేదు గానీ, ఆయన సహాయం లేకుండానే తమకు కావల్సినవన్నీ తామే చేసుకోగలరేమో ప్రయత్నించి చూడమని మనషులకు తగినంత సమయం ఇచ్చాడు.
ఆ మారణహోమం వల్ల జరిగిన నష్టాన్నంతా దేవుడు పూరించగలడు, పూరిస్తాడు కూడా. మారణహోమంలో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్లతోసహా చనిపోయిన లక్షలాది మందిని తిరిగి బ్రతికిస్తానని దేవుడు మాటిస్తున్నాడు. మారణహోమాన్ని తప్పించుకుని బ్రతికి బయటపడ్డవాళ్లకు ఆ భయంకరమైన జ్ఞాపకాలు మిగిల్చిన బాధను కూడా దేవుడు తీసేస్తాడు. (యెషయా 65:17; అపొస్తలుల కార్యములు 24:14, 15) మానవజాతి పట్ల దేవునికున్న ప్రేమ ఆయన ఈ వాగ్దానాలన్నీ తప్పకుండా నెరవేరుస్తాడని భరోసానిస్తుంది.—యోహాను 3:16.
మారణహోమంలో బాధలుపడి, దానిలోనుండి బ్రతికి బయటపడ్డ చాలామంది, దేవుడు చెడును ఎందుకు అనుమతించాడో, దానివల్ల జరిగిన నష్టాన్ని ఆయన ఎలా పూరిస్తాడో తెలుసుకొని దేవుని పట్ల తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ జీవితానికున్న అర్థం ఏమిటో తెలుసుకోగలిగారు.