కంటెంట్‌కు వెళ్లు

అశ్లీల చిత్రాల గురించి బైబిలు ఏమి చెప్తుంది? సైబర్‌ సెక్స్‌లో పాల్గొనడం తప్పా?

అశ్లీల చిత్రాల గురించి బైబిలు ఏమి చెప్తుంది? సైబర్‌ సెక్స్‌లో పాల్గొనడం తప్పా?

బైబిలు ఇచ్చే జవాబు

 అశ్లీల చిత్రాల గురించి, సైబర్‌ సెక్స్‌ గురించి లేదా అలాంటి వాటి గురించి బైబిలు సూటిగా ప్రస్తావించట్లేదు. కానీ భర్తతో లేదా భార్యతో కాకుండా వేరేవాళ్లతో లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదని బైబిలు చాలా స్పష్టంగా చెప్తుంది. అలాగే సెక్స్‌ విషయంలో ఉన్న తప్పుడు అభిప్రాయాలను కూడా బైబిలు ఖండిస్తుంది. ఈ బైబిలు వచనాల్ని గమనించండి:

  •   “కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను ... చంపి వేయుడి.” (కొలొస్సయులు 3:5) అశ్లీల చిత్రాల్ని చూడడం తప్పుడు కోరికల్ని చంపే బదులు వాటిని పెంచుతుంది. అశ్లీల చిత్రాల్ని చూసేవాళ్లను దేవుడు అపరిశుభ్రంగా, మురికివాళ్లుగా చూస్తాడు.

  •   “ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.” (మత్తయి 5:28) అశ్లీల చిత్రాల్ని చూడడం చెడు ఆలోచనలకు, ఆ తర్వాత చెడు పనుల్ని చేయడానికి దారి తీస్తుంది.

  •   “మీలో జారత్వమేగాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు.” (ఎఫెసీయులు 5:3) సరదాకి కూడా అనైతిక లైంగిక సంబంధాల గురించి మాట్లాడకూడదు, వాటిని చూడకూడదు లేదా వాటి గురించి చదవకూడదు.

  •   “శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత ... మొదలైనవి. వీటినిగూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.” (గలతీయులు 5:19-21) అశ్లీల చిత్రాల్ని చూసేవాళ్లను, సైబర్‌ సెక్స్‌లో, ఫోన్‌ సెక్స్‌లో లేదా సెక్స్‌టింగ్‌లో పాల్గొనేవాళ్లను దేవుడు అపరిశుభ్రమైనవాళ్లుగా, అపవిత్రులుగా చూస్తాడు. మనం అలాంటివాటిని చేస్తే, దేవుడు మనల్ని అస్సలు ఇష్టపడడు.