కంటెంట్‌కు వెళ్లు

మతాలన్నీ ఒకటేనా? అన్నీ దేవుని దగ్గరికే నడిపిస్తాయా?

మతాలన్నీ ఒకటేనా? అన్నీ దేవుని దగ్గరికే నడిపిస్తాయా?

బైబిలు ఇచ్చే జవాబు

లేదు. మతాలన్నీ ఒక్కటి కాదు. దేవుడు ఇష్టపడని కొన్ని మతాల గురించి బైబిల్లో ఉంది. నిజానికి అలాంటి ఆరాధనలో రెండు రకాలు ఉన్నాయి.

1వ రకం: అబద్ధ దేవుళ్లను ఆరాధించడం

అబద్ధ దేవుళ్లకు చేసే ఆరాధన “వ్యర్థము,” “నిష్‌ప్రయోజనము” అని బైబిలు చెప్తుంది. (యిర్మియా 10:3-5; 16:19, 20) ప్రాచీన ఇశ్రాయేలు జనాంగానికి యెహోవా * దేవుడు ఇలా ఆజ్ఞాపించాడు, “నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.” (నిర్గమకాండము 20:3, 23; 23:24) అయినాసరే ఇశ్రాయేలీయులు ఆయన మాట లెక్కచేయకుండా వేరే దేవుళ్లను ఆరాధించినప్పుడు “యెహోవా కోపము రగులుకొనెను.”—సంఖ్యాకాండము 25:3; లేవీయకాండము 20:2; న్యాయాధిపతులు 2:13, 14.

‘దేవతలనబడినవారిని, ప్రభువులనబడినవారిని’ ఆరాధించే విషయంలో దేవుని అభిప్రాయం ఇప్పటికీ అలానే ఉంది. (1 కొరింథీయులు 8:5, 6; గలతీయులు 4:8) తనను ఆరాధించాలనుకునేవాళ్లు అబద్ధ ఆరాధన చేసేవాళ్లతో తెగతెంపులు చేసుకోవాలని ఆజ్ఞాపిస్తూ యెహోవా ఇలా చెప్పాడు, “మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి.” (2 కొరింథీయులు 6:14-18) ఒకవేళ మతాలన్నీ ఒక్కటే అయ్యి, అవన్నీ దేవుని దగ్గరకే నడిపిస్తే, అసలు దేవుడు ఇలాంటి ఆజ్ఞను ఎందుకు ఇస్తాడు?

2వ రకం: నిజమైన దేవుణ్ణి ఆయనకు ఇష్టంలేని పద్ధతిలో ఆరాధించడం

ఇశ్రాయేలీయులు కొన్నిసార్లు, అబద్ధ దేవుళ్ల ఆరాధన నుండి వచ్చిన నమ్మకాల్ని, ఆచారాల్ని ఉపయోగిస్తూ యెహోవాను ఆరాధించారు. కానీ అలా అబద్ధ ఆరాధనను సత్యారాధనతో కలపడాన్ని యెహోవా అంగీకరించలేదు. (నిర్గమకాండము 32:8; ద్వితీయోపదేశకాండము 12:2-4) యేసు కాలంలోని మతనాయకులు కూడా దేవుణ్ణి సరైన పద్ధతిలో ఆరాధించేవాళ్లు కాదు, అందుకే యేసు వాళ్లను వ్యతిరేకించాడు. వాళ్లు పైకి మాత్రం భక్తిపరులం అన్నట్లు నటించేవాళ్లు. కానీ నిజానికి వాళ్లు వేషధారుల్లా ప్రవర్తిస్తూ “ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి.”—మత్తయి 23:23.

అలాగే మనకాలంలో కూడా, సత్యమతం మాత్రమే ప్రజల్ని దేవునికి దగ్గర చేస్తుంది. సత్యమేమిటో బైబిల్లో ఉంది. (యోహాను 4:24; 17:17; 2 తిమోతి 3:16, 17) బైబిల్లోని విషయాలకు వ్యతిరేకంగా బోధించే మతాలు ప్రజల్ని దేవుని నుండి దూరం చేస్తున్నాయి. ప్రజలు ఏ బోధలనైతే బైబిలు నుండి వచ్చాయని అనుకుంటున్నారో అవి నిజానికి బైబిల్లో లేవు. ఉదాహరణకు త్రిత్వము, ఆత్మకు చావులేదు, నరకం వంటి బోధలు బైబిల్లో లేవు. అబద్ధ ఆరాధన చేసేవాళ్లు వాటిని వ్యాప్తిచేశారు. అలాంటి బోధల్ని సమర్థించే ఆరాధన “వ్యర్థము” లేదా పనికిరానిది. ఎందుకంటే అలాంటి ఆరాధనలో దేవుడు ఏమి కోరుకుంటున్నాడు అనే దానికన్నా మతాచారాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది.—మార్కు 7:7, 8.

మతం పేరు చెప్పుకుంటూ పైకి భక్తిపరులుగా నటించేవాళ్లను దేవుడు అసహ్యించుకుంటాడు. (తీతు 1:16) ప్రజలు దేవునికి దగ్గరవ్వాలంటే, మతం కేవలం ఆచారాలను నేర్పిస్తే సరిపోదు. అది వాళ్ల రోజువారీ జీవితాలపై ప్రభావం చూపించాలి. ఉదాహరణకు బైబిలు ఇలా చెప్తుంది, “ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే. తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా—దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్ను తాను కాపాడుకొనుటయునే.” (యాకోబు 1:26, 27) పవిత్రమును, నిష్కళంకమునైన భక్తి అనే మాటకు బదులు కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌ బైబిల్‌ “స్వచ్ఛమైన మతం” అనే మాటను ఉపయోగించింది.