కంటెంట్‌కు వెళ్లు

వాళ్లలా విశ్వాసం చూపించండి | ఏలీయా

చివరి వరకు సహించాడు

చివరి వరకు సహించాడు

 రాజైన ఆహాబు చనిపోయాడనే వార్తను ఏలీయా విన్నాడు. ఎన్నో సంవత్సరాలుగా ఆ చెడ్డ రాజుకు, తనకూ మధ్య జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుని, ఆ వృద్ధ ప్రవక్త ఆలోచిస్తూ తన గడ్డాన్ని నిమురుకోవడం, కళ్లతో ఎటో చూస్తూ ఉండడం మనం ఊహించుకోవచ్చు. ఏలీయా చాలా సహించాడు. ఆహాబు, రాణియైన యెజెబెలు ఎన్నోసార్లు అతన్ని బెదిరించారు, పట్టుకోవడానికి వెంటాడారు, చంపడానికి కూడా చూశారు. ఎంతోమంది యెహోవా ప్రవక్తలను చంపడానికి ఆదేశాలు ఇచ్చిన యెజెబెలును ఆపడానికి రాజు ఏమీ చేయలేదు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి కేవలం దురాశతో నిర్దోషి, నీతిమంతుడు అయిన నాబోతును అతని కొడుకులతో పాటు చంపడానికి కూడా కుట్ర చేశారు. దానికి ప్రతిస్పందనగా ఆహాబుని అతని రాజ్యం మొత్తాన్ని ఖండిస్తూ యెహోవా తీర్పు సందేశాన్ని ఏలీయా చెప్పాడు. ఇప్పుడు దేవుడు చెప్పిన మాటలు నిజం అవుతున్నాయి. యెహోవా చెప్పిన విధంగానే ఆహాబు చనిపోయాడు.​—1 రాజులు 18:4; 21:​1-​26; 22:37, 38; 2 రాజులు 9:​26.

 ఏదేమైనా, తాను ఇంకా సహనం చూపించాల్సిన అవసరం ఉందని ఏలీయాకు తెలుసు. యెజెబెలు ఇంకా బ్రతికే ఉంది, ఆమె ఇంకా తన భయంకరమైన ప్రభావాన్ని ఆమె కుటుంబం మీద, దేశం మీద చూపిస్తూనే ఉంది. ఏలీయాకు ఎన్నో పరీక్షలు వస్తాయి, తర్వాత ఆయన తన సహచరుడు, తన స్థానం తీసుకోబోయే ఎలీషాకు నేర్పించాల్సింది ఇంకా ఎంతో ఉంది. కాబట్టి మనం ఏలీయా చివరి మూడు పనుల గురించి చూద్దాం. ఆయన విశ్వాసం ఆయనకు సహించేలా ఎలా సహాయం చేసిందో చూస్తుండగా, మనం మన విశ్వాసాన్ని మనం జీవిస్తున్న ఈ కష్టకాలాల్లో ఎలా బలపర్చుకోవచ్చో ఇంకా బాగా తెలుసుకోవచ్చు.

అహజ్యా మీద తీర్పు

 ఆహాబు, యెజెబెలుల కొడుకైన అహజ్యా ఇప్పుడు ఇశ్రాయేలులో రాజుగా ఉన్నాడు. తన తల్లిదండ్రులు చేసిన తప్పుల నుండి నేర్చుకునే బదులు ఆయన వాళ్ల చెడు అడుగుజాడల్లో నడిచాడు. (1 రాజులు 22:52) అహజ్యా కూడా వాళ్లలాగే బయలును ఆరాధించాడు. బయలు ఆరాధన ఆలయాల్లో దేవదాసీలను, పిల్లలను బలి ఇవ్వడాన్ని కూడా ప్రోత్సహిస్తూ దాన్ని ముట్టిన ప్రతి ఒక్కర్నీ దిగజార్చే మతం. అహజ్యా తన పద్ధతుల్ని మార్చుకునేలా, యెహోవాకు ఇంత విపరీతమైన అవిశ్వాసం చూపించకుండా ప్రజల్ని పక్కకు మళ్లించేలా అతన్ని ఏదైనా కదిలిస్తుందా?

 అహంకారియైన ఆ రాజుకు ఉన్నట్టుండి విషాదం దెబ్బ కొట్టింది. ఆయన తన మేడగది కిటికీలో నుండి జారిపడి బాగా గాయపడ్డాడు. సొంత ప్రాణం ప్రమాదంలో ఉన్నా, సహాయం కోసం ఆయన యెహోవా వైపు చూడలేదు. కానీ ఆయన తాను కోలుకునే అవకాశం ఉందో లేదో బయల్జెబూబు దేవుడిని అడగడానికి శత్రువులైన ఫిలిష్తీయుల పట్టణం ఎక్రోనుకు మనుషుల్ని పంపించాడు. యెహోవాకు చాలా కోపం వచ్చింది. ఆయన ఏలీయా దగ్గరికి దేవదూతను పంపి ఆ మనుషుల్ని అడ్డుకోమని అతనికి చెప్పాడు. ఆ ప్రవక్త వాళ్లను ఒక కఠినమైన సందేశంతో రాజు దగ్గరికి వెనక్కి పంపించాడు. ఇశ్రాయేలుకు దేవుడే లేడు అన్నట్లు ప్రవర్తించి అహజ్యా చాలా ఘోరంగా పాపం చేశాడు. అహజ్యా ఇంక జబ్బుతో మంచం నుండి లేవడని యెహోవా నిర్ణయించాడు.​—2 రాజులు 1:​2-4.

 పశ్చాత్తాపం లేని అహజ్యా, “మిమ్మును ఎదుర్కొనవచ్చి యీ మాట చెప్పినవాడు ఏలాటివాడని” అడిగాడు. ఆ మనుషులు, ప్రవక్త వేసుకునే సాధారణ వస్త్రధారణ గురించి చెప్పగానే అహజ్యా వెంటనే: అతను ఏలీయా అని అన్నాడు. (2 రాజులు 1:​7, 8) ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏలీయా ఒక సాధారణ జీవితాన్ని గడిపాడు, తన జీవితంలో దేవుని సేవచేయడం పైనే దృష్టి పెట్టాడు. అందుకే అతి సాధారణంగా ఉన్న అతని వస్త్రాల గురించి చెప్పగానే గుర్తుపట్టేలా ఉన్నాడు. ఖచ్చితంగా అహజ్యా గురించి గానీ, అతని తల్లిదండ్రులు గురించి గానీ అలా చెప్పలేము. వాళ్లు ధనసంపదల విషయంలో చాలా దురాశపరులు. యేసు మనకు ఇచ్చిన సలహా ప్రకారం మన కంటిని తేటగా ఉంచుకుని, అసలు ముఖ్యమైన విషయంపైన దృష్టి పెట్టేలా జీవించాలని ఏలీయా ఉదాహరణ నేడు మనకు గుర్తు చేస్తుంది.—మత్తయి 6:​22-​24.

 పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుని అహజ్యా, ఏలీయాను బంధించడానికి 50 మంది సైనికులను వాళ్ల అధిపతితో పంపించాడు. కొండ శిఖరం మీద కూర్చుని a ఉన్న ఏలీయాను వాళ్లు చూడగానే ఆ సైనికుల అధిపతి అమర్యాదగా ఏలీయాను కొండ దిగిరమ్మని రాజు పేరట ఆదేశిస్తాడు. అంటే ఆయనను శిక్షించడానికి తీసుకెళ్లాలని అలా పిలిచి ఉండవచ్చు. ఊహించండి! ఏలీయా దైవజనుడని తెలిసినప్పటికీ ఆ సైనికులు ఆయన్ని ఏడిపించవచ్చని, బెదిరించవచ్చని అనుకున్నారు. అది ఎంత తప్పు. ఏలీయా ఆ అధిపతితో: “నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశమునుండి దిగివచ్చి నిన్ను నీ యేబదిమందిని దహించునుగాక అని” చెప్పాడు. అప్పుడు దేవుడు చర్య తీసుకున్నాడు. “అగ్ని ఆకాశమునుండి దిగి” ఆ అధిపతిని అతనితో ఉన్న 50 మందిని కాల్చేసింది. (2 రాజులు 1:​9, 10) ఎవరైనా తన సేవకుల్ని తృణీకారంతో లేదా అగౌరవంతో చూస్తే యెహోవా దాన్ని తేలిగ్గా తీసుకోడు అని ఆ సైనికులకు వచ్చిన విషాద అంతం మనకు స్పష్టంగా గుర్తు చేస్తుంది.—1 దినవృత్తాంతములు 16:21, 22.

 అహజ్యా మరో అధిపతిని 50 మందితో పంపిస్తాడు. ఆ రెండవ అధిపతి మొదటి వాడికన్నా లెక్కలేకుండా ఉంటాడు. ఒకటి, ఆయన కొండ దగ్గర ఆ 51 మంది కాలిపోయిన బూడిదను చూసి కూడా వాళ్ల మరణాల నుండి ఏమి నేర్చుకోలేదు. ఇంకొకటి, ఆయన ముందు అధిపతిలా ఏలీయాను తృణీకారంగా క్రిందికి దిగిరమ్మని ఆదేశించిన మాటలను మళ్లీ పలకడమే కాకుండా, “త్వరగా” అనే మాటను కూడా కలిపి అన్నాడు. ఎంత మూర్ఖత్వం! కాబట్టి అతను, అతని మనుషులు ముందువాళ్లలానే ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ అంతకన్నా పిచ్చివాడు ఆ రాజు. ఇంకా తెలుసుకోకుండా ఆయన మూడవసారి సైనికుల్ని పంపించాడు. మంచి విషయం ఏంటంటే ఈ మూడవ అధిపతి తెలివిగలవాడు. ఆయన వినయంగా ఏలీయా దగ్గరికి వచ్చి అతనిని, అతని మనుషులను విడిచిపెట్టమని వేడుకుంటాడు. దైవజనుడైన ఏలీయా వినయస్థుడైన ఆ అధిపతికి స్పందించినప్పుడు నిస్సందేహంగా యెహోవా కరుణను చూపించాడు. యెహోవా దూత ఏలీయాను ఆ సైనికులతో వెళ్లమని నిర్దేశించాడు. ఏలీయా అందుకు లోబడి ఆ దుష్టరాజు గురించి యెహోవా చేసిన ప్రకటనను చెప్పాడు. దేవుడు చెప్పినట్లే అహజ్యా చనిపోయాడు. అతని పరిపాలన కేవలం 2 సంవత్సరాలే ఉంది.—2 రాజులు 1:​11-​17.

ఏలీయా వినయస్థుడైన ఆ అధిపతి పట్ల యెహోవాలాంటి కరుణను చూపించాడు

 తన చుట్టూ ఉండే ప్రజలు మొండిగా తిరుగుబాటుతో ప్రవర్తిస్తున్నా ఏలీయా ఎలా సహించాడు? ఆ ప్రశ్న గురించి తెలుసుకోవడం ఈ రోజుల్లో అవసరమే, కాదంటారా? మీరు మంచి కోరుకునేవాళ్లు, మీరు చెప్పే మంచిని వినకుండా నష్టాన్ని తెచ్చుకునే పనులు చేస్తుంటే మీకు విసుగు అనిపించదా? అలాంటి నిరుత్సాహాన్ని మనం ఎలా సహించవచ్చు? సైనికులు ఏలీయాను కొండ శిఖరం మీద కనుగొన్న విషయాన్ని బట్టి మనం ఒకటి నేర్చుకోవచ్చు. ఖచ్చితంగా ఏలీయా అక్కడ ఉంది ఇందుకే అని మనం చెప్పలేం కానీ, ప్రార్థనాపరుడిగా అతనికి అక్కడున్న ప్రశాంతత, తాను ఎంతో ప్రేమించే దేవునికి దగ్గరవ్వడానికి మంచి అవకాశాలను కలిగించి ఉంటుందని చెప్పవచ్చు. (యాకోబు 5:​16-​18) మనం కూడా అలానే దేవునితో ఒంటరిగా సమయం గడపడానికి, ఆయన పేరుతో ఆయన్ని ప్రార్థించడానికి, మన సమస్యల్ని, మన అవసరాల్ని ఆయనకు చెప్పుకోవడానికి క్రమంగా సమయం తీసుకోవాలి. అప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్లు లెక్కలేకుండా, వాళ్లకు వాళ్లు హాని తెచ్చుకునేలా ప్రవర్తించినా సహించగలుగుతాం.

వస్త్రాన్ని ఇచ్చివేయడం

 ఏలీయా అధికారికంగా తనకున్న నియామకాన్ని విడిచిపెట్టే సమయం వచ్చింది. ఆయన ఏమి చేశాడో చూడండి. ఆయనా, ఎలీషా గిల్గాలు పట్టణాన్ని వదిలి వస్తున్నప్పుడు ఏలీయా ఎలీషాను అక్కడే ఉండిపొమ్మని వేడుకున్నాడు. తను ఒంటరిగా దాదాపు 11 కిలోమీటర్లు (7 మైళ్లు) దూరంలో ఉన్న బేతేలుకు వెళ్తున్నాడు. ఎలీషా దృఢంగా ఇలా చెప్పాడు: యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువను. వాళ్లిద్దరు బేతేలు చేరుకోగానే, ఏలీయా ఎలీషాతో తాను దాదాపు 22 కిలోమీటర్లు (14 మైళ్లు) దూరంలో ఉన్న యెరికోకు ఒంటరిగా వెళ్తున్నానని చెప్పాడు. ఎలీషా దృఢంగా ఇంతకుముందులానే జవాబిచ్చాడు. మూడవసారి, యెరికోలో ఉండగా, వాళ్లు అక్కడకు దాదాపు 8 కిలోమీటర్లు (5 మైళ్లు) దూరంలో ఉన్న యొర్దాను నది వైపుకి వెళ్ళే ముందు మళ్లీ అదే జరిగింది. మళ్లీ ఆ యువకుడు తను అనుకున్నట్లు దృఢంగా ఉన్నాడు. ఆయన ఏలీయాను విడిచిపెట్టలేదు!​—2 రాజులు 2:​1-6.

 ఎలీషా ఒక ముఖ్యమైన లక్షణాన్ని చూపిస్తున్నాడు, అదే విశ్వసనీయ ప్రేమ. ఇలాంటి ప్రేమను రూతు నయోమి పట్ల చూపించింది, ఇలాంటి ప్రేమ ఒక విషయానికి గట్టిగా కట్టుబడి దానిని వదిలిపెట్టకుండా ఉంటుంది. (రూతు 1:​15, 16) దేవుని సేవకులందరికీ ఎప్పటికన్నా ఎక్కువగా ఇప్పుడు ఆ లక్షణం అవసరం. ఎలీషాలా మనం ఆ లక్షణానికున్న ప్రాముఖ్యతను చూస్తున్నామా?

 తన యువ సహచరుడు చూపించిన విశ్వసనీయ ప్రేమ ఖచ్చితంగా ఏలీయాను కదిలించి ఉంటుంది. దానివల్లే ఎలీషాకు ఏలీయా చేసిన చివరి అద్భుతాన్ని చూసే గొప్ప అవకాశం దొరికింది. యొర్దాను నది ఒడ్డున, కొన్నిచోట్ల ఉరవడిగా లోతుగా ఉంటుంది. ఏలీయా నీటిని తన ప్రవక్త వస్త్రంతో కొట్టాడు. నీళ్లు విడిపోయాయి. ఆ అద్భుతాన్ని “ప్రవక్తల శిష్యులలో ఏబదిమంది,” కూడా చూస్తూ ఉన్నారు. వాళ్లు ఆ దేశంలో సత్యారాధనను ముందుకు తీసుకెళ్లడానికి శిక్షణ ఇచ్చే పాఠశాలలో ఉన్నారు. అది అభివృద్ధి చెందుతుంది. (2 రాజులు 2:​7, 8) ఏలీయా ఆ శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉండి ఉంటాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక సమయంలో ఏలీయా దేశం మొత్తంలో నమ్మకమైనవాళ్లలో తను ఒక్కడే మిగిలి ఉన్నాడని అనుకున్నాడు. అప్పటి నుండి యెహోవా ఏలీయా చూపించిన ఓర్పుకు ప్రతిఫలమిచ్చాడు, ఆయన ఆరాధకుల్లో వస్తున్న గొప్ప ప్రగతిని చూసే అవకాశాన్ని ఇచ్చాడు.​—1 రాజులు 19:10.

 యొర్దాను నది దాటాక, ఏలీయా ఎలీషాతో: “నేను నీయొద్దనుండి తీయబడకమునుపు నీకొరకు నేనేమి చేయకోరుదువో దాని నడుగుమని” అంటాడు. తను వెళ్లిపోయే సమయం వచ్చేసిందని ఏలీయాకు తెలుసు. ఆయన తన యువ స్నేహితుడికి రానున్న ఆధిక్యతలు, పేరు విషయంలో అసూయతో లేడు. కానీ ఏలీయా ఏ విధంగానైనా అతనికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలీషా ఈ విన్నపం మాత్రమే చేశాడు: నీకు కలిగిన ఆత్మలో రెండుపాళ్లు నా మీదికి వచ్చునట్లు దయచేయుము. (2 రాజులు 2:9) ఏలీయా పొందిన పవిత్రశక్తికి రెండింతలు ఎక్కువ తనకు కావాలని ఆయన కోరుకోలేదు. కానీ ఆయన మొదటి కుమారుడిలాంటి వారసత్వాన్ని అడుగుతున్నాడు. ధర్మశాస్త్రం ప్రకారం మొదటి కుమారుడికి వారసత్వంలో ఎక్కువ భాగం లేదా రెండు భాగాలు వస్తాయి. కుటుంబ పెద్దగా అతని కొత్త బాధ్యతలకు సరిపోయే ఆస్తి అతనికి వస్తుంది. (ద్వితీయోపదేశకాండము 21:17) ఏలీయా ఆధ్యాత్మిక వారసుడిగా ఎలీషా, ఈ పని జరగాలంటే ఆయనకున్న ధైర్యం తనకు అవసరమని స్పష్టంగా గుర్తించాడు.

 వినయంగా ఏలీయా ఆ విషయాన్ని యెహోవా చేతుల్లోకి వదిలేశాడు. ఆ వృద్ధ ప్రవక్తయైన ఏలీయాను తీసుకెళ్లిపోతున్నప్పుడు చూసే అవకాశాన్ని యెహోవా ఎలీషాకు ఇస్తే, ఎలీషా విన్నపాన్ని దేవుడు ఒప్పుకున్నట్లు అవుతుంది. అయితే కొద్ది సమయానికే అంటే ఆ చిరకాల స్నేహితులిద్దరూ నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడుకుంటుండగా ఒక అద్భుతమైన విషయం జరిగింది.—2 రాజులు 2:​10, 11.

ఏలీయా, ఎలీషా మధ్య ఉన్న స్నేహం ఖచ్చితంగా కష్టమైన సమయాల్లో తట్టుకోవడానికి వాళ్లిద్దరికీ సహాయం చేసింది

 ఆకాశంలో ఒక వింత వెలుగు కనపడి వాళ్లకు దగ్గర దగ్గరగా వస్తూ ఉంది. మనం ఒక ఉరుమును, ఉన్నట్లుండి రేగిన సుడిగాలి వల్ల వస్తున్న హుష్షుమనే శబ్దాన్ని, దానితోపాటు ఒక ప్రకాశవంతమైన వస్తువు ఆ ఇద్దరు మనుషుల వైపు వేగంగా రావడాన్ని, వాళ్లిద్దరినీ విడదీయడాన్ని, బహుశా అది వాళ్లు తడబడి అడుగు వెనక్కి వేసేలా చేయడాన్ని ఊహించుకోవచ్చు. వాళ్లు చూసింది ఒక వాహనం, అగ్నితో చేసినట్లు మెరిసిపోతున్న ఒక రథం. తన సమయం వచ్చేసిందని ఏలీయాకు అర్థమైపోయింది. ఆయన పైకి ఎక్కాడా? ఆ వృత్తాంతం మనకు ఏమీ చెప్పడం లేదు. ఏదేమైనా ఆయన పైపైకి ఎత్తబడుతున్నట్లు, గాలిలో ఎత్తుకు వెళ్తున్నట్లు, సుడిగాలిలో ఎక్కడికో వెళ్లిపోయినట్లు అతనికి తెలిసి ఉంటుంది.

 ఎలీషా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాడు. ఆయనకు ఈ అద్భుత దృశ్యం జరుగుతుండగా చూసే అవకాశం వచ్చింది కాబట్టి యెహోవా ఏలీయాకున్న ధైర్యంలో రెండుపాళ్లు అతనికి ఇస్తాడని ఎలీషాకు తెలిసిపోయింది. కానీ దాన్ని తలచుకోవడానికి ఎలీషాకు బాధేసి ఉంటుంది. తన వృద్ధ స్నేహితుడు ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనకు తెలియదు, కానీ ఏలీయాను మళ్లీ చూడగలనని మాత్రం ఎలీషా అనుకోలేదు. ఆయన: “నా తండ్రీ నా తండ్రీ, ఇశ్రాయేలువారికి రథమును రౌతులును నీవే అని” ఏడ్చాడు. తన ప్రియమైన గురువు కనుమరుగైపోవడాన్ని దూరం నుండి చూశాడు. తర్వాత ఎలీషా దుఃఖంతో తన బట్టలు చింపుకున్నాడు.​—2 రాజులు 2:​12.

 ఏలీయా ఆకాశంలోకి పైకి వెళ్తున్నప్పుడు, తన యువ స్నేహితుడు దూరం నుండి ఒంటరిగా, దీనంగా ఏడ్వడాన్ని విన్నాడా?, బహుశా తను కూడా ఒకటి లేదా రెండు చుక్కల కన్నీరు కార్చి ఉంటాడా? ఏదేమైనా అలాంటి స్నేహితుడు ఉండడం, కొన్ని కష్ట సమయాల్లో తట్టుకోవడానికి సహాయం చేసిందని అతనికి ఖచ్చితంగా తెలుసు. మనం ఏలీయా ఉదాహరణ నుండి చక్కగా నేర్చుకుని, దేవున్ని ప్రేమిస్తూ ఆయన ఇష్టం చేయడానికి ప్రయత్నించే వాళ్లతో స్నేహాలు పెంచుకోవాలి!

యెహోవా ఏలీయాను ఒక కొత్త నియామకంలోకి మార్చేశాడు

చివరి నియామకం

 ఏలీయా తర్వాత ఎక్కడికి వెళ్లాడు? కొన్ని మతాలు ఆయన దేవునితో ఉండడానికి పరలోకానికి వెళ్లాడని నేర్పిస్తాయి. కానీ అది అసాధ్యం. శతాబ్దాల తర్వాత, యేసుక్రీస్తు తను వెళ్లకముందు ఎవరూ పరలోకానికి వెళ్లలేదని చెప్పాడు. (యోహాను 3:​13) కాబట్టి మనం “ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయెను” అని చదివినప్పుడు అది ఏ ఆకాశము అని ప్రశ్నించుకోవాలి? (2 రాజులు 2:​11) బైబిలు ఆకాశం అనే మాటను యెహోవా నివసించే చోటుకే కాదు, మన భూమిపైన మేఘాలు ఉండే, పక్షులు ఎగిరే ఆకాశానికి కూడా వాడుతుంది. (కీర్తన 147:8) ఆ ఆకాశంలోకి ఏలీయా ఆరోహణం అయ్యాడు. మరి తర్వాత ఏం జరిగింది?

 యెహోవా సులువుగా ఆ ప్రవక్తని వేరే నియామకంలోకి మార్చాడు, ఈసారి పొరుగు రాజ్యమైన యూదాలో నియామకాన్ని ఇచ్చాడు. ఏలీయా తర్వాత అక్కడ ఏడు సంవత్సరాల వరకు పని చేసినట్లు బైబిల్లో ఉంది. యూదాను ఆ సమయంలో చెడ్డ రాజైన యెహోరాము పరిపాలిస్తున్నాడు. ఆయన ఆహాబు, యెజెబెలుల కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, కాబట్టి వాళ్ల చెడు ప్రభావం ఇంకా అక్కడ ఉంది. యెహోరాము మీద తీర్పు ప్రకటిస్తూ ఒక ఉత్తరం రాయమని యెహోవా ఏలీయాను ఆదేశించాడు. ముందే ప్రవచించబడినట్లు, యెహోరాము ఘోరంగా చనిపోతాడు. అంతకన్నా ఘోరం ఏంటంటే, “యెవరికిని ఇష్టము లేనివాడై అతడు చనిపోయెను” అని ఆ వృత్తాంతం చెప్తుంది.​—2 దినవృత్తాంతములు 21:12-​20.

 ఆ దుష్టుడికి, ఏలీయాకి ఎంత తేడా. ఏలీయా ఎలా చనిపోయాడు, ఎప్పుడు చనిపోయాడు మనకు తెలీదు. కానీ మనకు తెలిసింది ఏంటంటే, ఆయన మాత్రం యెహోరాములా ఒక్కరు కూడా బాధపడనంత ఘోరంగా చనిపోలేదు. ఎలీషా తన స్నేహితున్ని కోల్పోయి బాధపడ్డాడు. మిగతా నమ్మకమైన ప్రవక్తలు కూడా అతను లేనందుకు బాధపడ్డారు. యెహోవా కూడా స్వయంగా ఏలీయాను 1,000 సంవత్సరాల తర్వాత కూడా ఎంతో విలువైన వాడిగా చూశాడు. ఎందుకంటే రూపాంతర దర్శనంలో ఆయన ఆ ప్రియమైన ప్రవక్తను సూచనార్థకంగా చూపించాడు. (మత్తయి 17:​1-9) మీరు ఏలీయాను చూసి నేర్చుకుని కష్టాలు వచ్చినా సహించే విశ్వాసాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే దేవున్ని ప్రేమించేవాళ్లతో స్నేహాన్ని పెంచుకోవడాన్ని, మీ జీవితంలో యెహోవాను సేవించడంపై దృష్టి పెట్టడాన్ని, హృదయంలో నుండి ప్రార్థించడాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. మీరు కూడా అలానే యెహోవా ప్రేమగల హృదయంలో ఎప్పటికీ ఉండిపోయే చోటు సంపాదించుకుంటారు.

a కొంతమంది పండితులు ఇక్కడ చెప్పిన కొండ, కొన్ని సంవత్సరాల క్రితం బయలు ప్రవక్తలను చంపడానికి దేవుడు ఏలీయాకు శక్తిని ఇచ్చిన కర్మెలు పర్వతం అని చెప్తారు. కానీ బైబిలు మాత్రం అది ఏ కొండనో చెప్పడం లేదు.