కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

మా అమ్మానాన్నలు విడాకులు తీసుకుంటుంటే అప్పుడేంటి?

మా అమ్మానాన్నలు విడాకులు తీసుకుంటుంటే అప్పుడేంటి?

 అమ్మానాన్నలు విడాకులు తీసుకోవడం అనేది యౌవనులకు చెప్పలేనంత ఒత్తిడి కలిగించే విషయాల్లో ఒకటి. ఆ బాధను మీరు ఎలా తట్టుకోవచ్చు?

ఈ ఆర్టికల్‌లో …

 మీరు చేయకూడని మూడు పనులు

 1. అందుకు కారణం మీరే అనుకోవడం

 “తనకు, నాన్నకు మధ్య సమస్యలన్నీ నేను పుట్టినప్పటి నుండే మొదలయ్యాయని అమ్మ ఒకసారి నాతో అంది. కాబట్టి వాళ్ల బంధం తెగిపోవడానికి నేనే కారణం అనుకున్నాను.”—డయానా.

 గుర్తుంచుకోండి: మీ వల్ల మీ అమ్మానాన్నలు విడాకులు తీసుకోవడం లేదు. వాళ్ల మధ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి విడాకులు తీసుకుంటున్నారు. ఆ సమస్యలు మీ వల్ల వచ్చినవి కాదు, వాటిని మీరు తీసేయలేరు కూడా. వాళ్ల వివాహ బంధంలో తలెత్తిన సమస్యల్ని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత వాళ్లదే.

 “ప్రతీ వ్యక్తి తన బరువు తానే మోసుకోవాలి.”—గలతీయులు 6:5.

 2. మనసులో కోపం పెట్టుకోవడం

 “మా అమ్మకు ద్రోహం చేశాడని నాన్నంటే నాకు చాలా కోపం. నేను అంత తేలిగ్గా మళ్లీ ఆయన్ని నమ్మను.”—రియానా.

 గుర్తుంచుకోండి: మీ అమ్మానాన్నల మధ్య జరుగుతున్న దాన్నిబట్టి మీకు బహుశా కోపం, చిరాకు వస్తుండవచ్చు, అది సహజమే. కానీ లోపల కోపం పెట్టుకోవడం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. అది మీ శరీరాన్ని, మనసును పాడుచేయవచ్చు. మనసులో కోపం పెట్టుకోవడం అనేది మీరు విషం తాగి, ఎదుటి వ్యక్తి జబ్బు పడతాడని ఎదురుచూడడం లాంటిది. a

 “కోపం మానుకో, ఆగ్రహం విడిచిపెట్టు.”—కీర్తన 37:8.

 3. మీ వివాహంలో కూడా అలా జరుగుతుందేమో అని భయపడడం

 “నేను కూడా మా నాన్న చేసినట్టే చేస్తానని నాకు చాలా భయమేస్తుంది. నాకు పెళ్లయి పిల్లలు పుడితే, నేను కూడా మా అమ్మానాన్నల విడాకులకు కారణమైన పనే చేస్తానని నా భయం.”—జెస్సిక.

 గుర్తుంచుకోండి: మీ అమ్మానాన్నలకు అలా జరిగింది కదా అని, మీకు కూడా అలాగే జరుగుతుందని అనుకోకూడదు. నిజానికి మీ అమ్మానాన్నలకు ఎదురైన పరిస్థితి నుండి మీరు విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. ఉదాహరణకు, మీరు పెళ్లి చేసుకునే వ్యక్తిలో ఎలాంటి లక్షణాలు చూడాలో ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉంటుంది. అంతేకాదు, మీ అమ్మానాన్నలకు అలా జరిగింది కాబట్టి, మీరు మంచి భర్తగా లేదా భార్యగా ఉండడానికి కావల్సిన లక్షణాలు పెంచుకునేలా అది మిమ్మల్ని కదిలించవచ్చు.

 “ప్రతీ వ్యక్తి తాను చేసే పనుల్ని పరిశీలించుకోవాలి.”—గలతీయులు 6:4.

మీ అమ్మానాన్నలు విడాకులు తీసుకున్నారనే బాధ నుండి మీరు బయటపడడం, విరిగిన ఎముక కట్టుకోవడం లాంటిది. ఇప్పుడు బాధగా ఉన్నా, సమయం గడిచేకొద్దీ అది తగ్గిపోతుంది

 మీరు చేయగలిగే మూడు పనులు

 1. మాట్లాడండి. బాధంతా లోపలే దాచుకునేవాళ్లు ఎక్కువగా, తమకు హానిచేసే వ్యసనాలకు అంటే తాగుడు, డ్రగ్స్‌ వంటివాటికి అలవాటు పడుతుంటారు. మీరు ఆ దారిని ఎంచుకునే బదులు ఇలా చేసి చూడండి:

 మీ అమ్మానాన్నలతో మాట్లాడండి. మీ అమ్మానాన్నలు ఇద్దరూ లేదా వాళ్లలో ఒకరు తమ సమస్యలోకి మిమ్మల్ని లాగాలని ప్రయత్నిస్తే, దానివల్ల మీపై ఎలాంటి ప్రభావం పడుతోందో ప్రశాంతంగానే అయినా ఖచ్చితంగా వివరించండి. నేరుగా మాట్లాడడం ఇబ్బందిగా అనిపిస్తే, ఇద్దరికీ లేదా వాళ్లలో ఒకరికి ఉత్తరం రాయండి.

 మీరు నమ్మే ఫ్రెండ్‌తో మాట్లాడండి. మీరు చెప్పేది శ్రద్ధగా వినేవాళ్లు ఎవరైనా ఉంటే, చాలా సహాయంగా ఉంటుంది. బైబిలు ఇలా చెప్తుంది: “నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు, కష్టకాలంలో అతను సహోదరుడిలా ఉంటాడు.”—సామెతలు 17:17.

 మీ సృష్టికర్తతో మాట్లాడండి. ‘ప్రార్థనలు వినే దేవుడైన’ యెహోవా మీరు ఎప్పుడు మాట్లాడినా వింటాడు. (కీర్తన 65:2) “ఆయనకు మీ మీద శ్రద్ధ ఉంది కాబట్టి మీ ఆందోళనంతా ఆయన మీద వేయండి” అని బైబిలు చెప్తుంది.—1 పేతురు 5:7.

  •   మీరు ప్రశాంతంగా, నిగ్రహంతో మీ అమ్మతో మాట్లాడగలరా లేక నాన్నతోనా?

  •   మీ పరిస్థితిని తట్టుకోవడానికి మీకు సహాయం చేసేవాళ్ల లిస్టులో మీరు నమ్మే ఏ ఫ్రెండ్‌ని (మీ వయసువాళ్లు లేదా పెద్దవాళ్లు) చేరుస్తారు?

  •   మీరు ప్రత్యేకంగా ఏయే అంశాల గురించి ప్రార్థించవచ్చు?

 2. మారిన పరిస్థితికి అలవాటు పడండి

 మీ అమ్మానాన్నలు విడిపోవడం వల్ల మీరు కొత్త ఇల్లు, కొత్త స్కూలు, కొత్త ఆర్థిక పరిస్థితి, చివరికి కొత్త ఫ్రెండ్స్‌కి కూడా అలవాటు పడాల్సి రావచ్చు. దానివల్ల చిరాకు-ఒత్తిడి కలగడం, మీ జీవితం తలకిందులైనట్టు అనిపించడం సహజమే. మీ జీవితం తేలికపడాలంటే ఏంచేయాలి? కొత్త పరిస్థితులకు ఎలా అలవాటుపడాలనే దానిమీదే మనసుపెట్టండి.

  •   మీ అమ్మానాన్నలు విడాకులు తీసుకోవడం వల్ల మీరు చేసుకోవాల్సి వచ్చిన అతిపెద్ద మార్పు ఏంటి?

  •   ఆ మార్పుకు అలవాటు పడడానికి మీరు ఏమేం పనులు చేయవచ్చు?

 “నా పరిస్థితులు ఎలా ఉన్నా సంతృప్తిగా ఉండడం నేను నేర్చుకున్నాను.”—ఫిలిప్పీయులు 4:11.

 3. మీ బలాలను గుర్తించండి

 అమ్మానాన్నలు విడాకులు తీసుకోవడం వల్ల నిజంగా చాలా ఆందోళన కలుగుతుంది, అయితే అది మీ బలాలను గుర్తించడానికి కూడా మీకు సహాయం చేస్తుంది. అంతేకాదు ఇంకొన్ని మంచి లక్షణాలు పెంచుకోవడానికి కూడా సహాయం చేయవచ్చు. జెరమీకి 13 ఏళ్లు ఉన్నప్పుడు వాళ్ల అమ్మానాన్నలు విడాకులు తీసుకున్నారు. అతను ఇలా అంటున్నాడు: “మా ఇంట్లో నేనే పెద్ద పిల్లవాడిని కాబట్టి అమ్మకు నేను ఎక్కువ సహాయం చేయాల్సి వచ్చేది, మా చిన్న తమ్ముడిని చూసుకోవాల్సి వచ్చేది.”

మీ అమ్మానాన్నల విడాకులు, మీరు ఇంట్లో మరింత బాధ్యతగా ఉండేలా మిమ్మల్ని కదిలించవచ్చు

  •   మీ అమ్మానాన్నల పరిస్థితి వల్ల, మీలో ఎలాంటి బలాలు ఉన్నాయని గుర్తించారు?

  •   మీరు ఎలాంటి లక్షణాలు పెంచుకోవాలని అనుకుంటున్నారు?

 ‘లేఖనాలన్నిటినీ దేవుడు ప్రేరేపించాడు. అవి సరిదిద్దడానికి ప్రయోజనకరంగా ఉంటాయి.’—2 తిమోతి 3:16.

a ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, “నేను కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి?” అనే ఆర్టికల్‌ చూడండి.