యువత అడిగే ప్రశ్నలు
నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానా?
ఆ ప్రశ్నకు జవాబు చెప్పేముందు మీ గురించి మీకు బాగా తెలిసి ఉండాలి. ఉదాహరణకు కింద చెప్పిన విషయాలను గమనించండి:
కుటుంబ సభ్యులతో మీ అనుబంధం
మీ తల్లిదండ్రులతో, అన్నదమ్ములు లేక అక్కాచెల్లెళ్లతో మీరు ఎలా ప్రవర్తిస్తారు? తరచూ వాళ్లపై కోపం చూపిస్తూ, మీ అభిప్రాయాన్ని చెప్పడానికి కఠినమైన అవమానించే మాటలు మాట్లాడుతూ ఉంటారా? ఆ విషయంలో వాళ్లు మీ గురించి ఏమంటున్నారు? మీరు మీ కుటుంబ సభ్యులతో ఎలా ఉంటారో, పెళ్లైన తర్వాత మీ భార్య/భర్తతో కూడా అలాగే ఉంటారు.—ఎఫెసీయులు 4:31.
మీరు విషయాలను చూసే తీరు
మీరు మంచి జరుగుతుందని ఎదురుచూస్తారా లేదా ఏదో చెడు జరుగుతుందని ఆలోచించుకుంటారా? ఏ పనైనా మీకు నచ్చినట్టు ఇలానే చేయాలని పట్టుబడతారా లేక ఇతరుల అభిప్రాయాలను కూడా గౌరవిస్తారా? ఏదైనా సమస్య లేక ఒత్తిడి ఎదురైనప్పుడు ప్రశాంతంగా ఉండగలరా? మీకు ఓర్పు ఉందా? దేవుడిచ్చే ఆత్మఫలాన్ని ఇప్పుడే వృద్ధి చేసుకుంటే, రాబోయే రోజుల్లో మీరొక మంచి భార్య/భర్తగా ఉండడానికి అవి మీకు సహాయం చేస్తాయి.—గలతీయులు 5:22-24.
మీ ఆర్థిక స్థితి
మీరు డబ్బుల్ని పద్ధతిగా ఖర్చుపెడతారా? తరచూ అప్పులు చేస్తుంటారా? మీరు ఉద్యోగంలో కొనసాగగలరా? ఉద్యోగంలో ఎక్కవ కాలం కొనసాగలేకపోతుంటే అలా ఎందుకు కొనసాగలేకపోతున్నారు? ఉద్యోగాన్ని బట్టా? మీ బాస్‌ని బట్టా? మీరు సరిచేసుకోవాల్సిన ఏదైనా అలవాటు లేక సమస్య మీకు ఉందా? మీ ఆర్థిక సమస్యలనే మీరు సరిచేసుకోలేకపోతే మీ కుటుంబ సభ్యుల సమస్యలను ఎలా తీర్చగలరు?—1 తిమోతి 5:8.
దేవునితో మీ సంబంధం
మీరొక యెహోవాసాక్షి అయితే దేవునితో మీ సంబంధాన్ని కాపాడుకోవడానికి మీరేమి చేస్తుంటారు? దేవుని వాక్యం చదవడానికి, పరిచర్య చేయడానికి, కూటాలకు వెళ్లడానికి ఎవరూ చెప్పకుండానే మీరే ముందుగా ప్రయత్నిస్తుంటారా? అప్పుడు మీరు పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి ఆధ్యాత్మికంగా బలంగా ఉన్న భాగస్వామి దొరికినట్టే.—ప్రసంగి 4:9, 10.
మీరు పెళ్లైన తర్వాత మరిన్ని బాధల్లో కూరుకుపోకుండా, మీ భార్య/భర్త నుంచి బలం పొందాలంటే మీ గురించి మీరు తెలుసుకోవాలి. అలా మీ గురించి మీరు ఎంత ఎక్కువ అర్థం చేసుకుంటే అంత సంతోషంగా ఉండగలుగుతారు.