కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

జీవం ఎలా వచ్చింది? ఎవరైనా సృష్టించారా లేదా దానంతటదే వచ్చిందా?—2వ భాగం: పరిణామ సిద్ధాంతాన్ని ఎందుకు సందేహించాలి?

జీవం ఎలా వచ్చింది? ఎవరైనా సృష్టించారా లేదా దానంతటదే వచ్చిందా?—2వ భాగం: పరిణామ సిద్ధాంతాన్ని ఎందుకు సందేహించాలి?

ఆలిక్స్‌ అయోమయంలో పడ్డాడు. అతను ఇప్పటివరకూ దేవుడు ఉన్నాడనీ, సృష్టిని ఆయనే చేశాడనీ నమ్ముతూ వచ్చాడు. కానీ ఈ రోజు తన బయోలజీ టీచర్‌ పరిణామ సిద్ధాంతం నిజమనీ, విజ్ఞానశాస్త్ర పరిశోధనల్లో అందుకు తగిన ఆధారాలు ఉన్నాయని బల్లగుద్దిమరీ చెప్పారు. ఇక ఈ విషయం గురించి ప్రశ్నించి ఆలిక్స్‌ వెర్రి వాడిలా కనిపించదలుచుకోలేదు. అతనిలా అనుకున్నాడు, ‘పరిణామ సిద్ధాంతం నిజమని సైంటిస్టులు నిరూపించాక, దాని గురించి ప్రశ్నించడానికి నేనెవరు?’

 ఈ పరిస్థితి మీకే ఎదురైనట్లు ఊహించుకోగలరా? బహుశా మీరు మీ జీవితంలో ఇప్పటివరకూ “దేవుడు భూమ్యాకాశములను సృజించెను” అని బైబిల్లో ఉన్న మాటల్నే నమ్ముతూ వచ్చారు. (ఆదికాండము 1:1) కానీ ఈ మధ్య చాలామంది ప్రజలు దేవుడు సృష్టిని చేశాడన్నది అబద్ధమని, పరిణామ సిద్ధాంతమే నిజమని మిమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ల మాటల్ని మీరు నమ్మాలా? అసలు పరిణామ సిద్ధాంతాన్ని ఎందుకు సందేహించాలి?

 పరిణామ సిద్ధాంతాన్ని సందేహించడానికి గల రెండు కారణాలు

 1.   పరిణామ సిద్ధాంతంలోని కొన్ని వివరాలను సైంటిస్టులు ఒప్పుకోరు. కొన్ని దశాబ్దాలుగా పరిశోధనలు చేసినప్పటికీ, సైంటిస్టులందరూ ఒప్పుకునే కొన్ని వివరాలను వాళ్లు ఇంకా కనుగొనాల్సి ఉంది.

   ఆలోచించండి: సైన్సు గురించి ఎన్నో గొప్పగొప్ప విషయాలు తెలుసుకున్న సైంటిస్టులే పరిణామ సిద్ధాంతంలోని అన్ని వివరాలనూ పూర్తిగా అంగీకరించలేకపోతుంటే, మీరు ఆ సిద్ధాంతాన్ని సందేహించడంలో ఏమైనా తప్పుందా?—కీర్తన 10:4.

 2.   మీరేమి నమ్ముతున్నారు అనేది చాలా ప్రాముఖ్యం. జాకరీ అనే అబ్బాయి ఇలా అంటున్నాడు: “జీవం అనేది అనుకోకుండా దానంతటదే వచ్చుంటే మన జీవితాలకు, ఈ విశ్వంలో ఉన్నవాటన్నిటికీ అర్థం లేనట్టే.” అతని మాటలకు అర్థం లేకపోలేదు. ఒకవేళ పరిణామ సిద్ధాంతమే నిజమైతే జీవితానికి ఏ సంకల్పమూ లేనట్టే. (1 కొరింథీయులు 15:32) మరోవైపు దేవుడు సృష్టిని చేశాడన్నది నిజమైతే, జీవిత సంకల్పం ఏమిటి? భవిష్యత్తు విషయంలో మనకు ఏ నిరీక్షణ ఉంది? అనే ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబులు దొరుకుతాయి.—యిర్మీయా 29:11.

   ఆలోచించండి: పరిణామ సిద్ధాంతం, సృష్టి గురించిన నిజాలు తెలుసుకోవడం మీ జీవితంపై ఏమైనా ప్రభావం చూపిస్తుందా?—హెబ్రీయులు 11:1.

 పరిశీలించాల్సిన ప్రశ్నలు

 ప్రజలు నమ్మేది: ‘ఈ విశ్వమంతా, అనుకోకుండా జరిగిన ఒక పెద్ద విస్ఫోటనం వల్లే వచ్చింది.’

 •   ఈ విస్ఫోటనం ఎందుకు జరిగింది? ఎవరు చేశారు?

 •   ఏది అర్థవంతంగా ఉంది?—ఏమీ లేకుండానే అన్నీ వాటంతటవే వచ్చాయి అనే మాటనా? లేక అన్నిటినీ ఏదో ఒకటి లేదా ఎవరో ఒకరు చేశారనా?

 ప్రజలు నమ్మేది: ‘పరిణామ క్రమంలో జంతువుల నుండి మనుషులు వచ్చారు.’

 •   మనుషులు జంతువుల నుండి వచ్చుంటే, ఉదాహరణకు మనం కోతుల నుండి వచ్చుంటే కోతుల తెలివికి, మనుషుల తెలివికి ఎందుకంత తేడా ఉంది? *

 •   ప్రాణులన్నిటిలో అతి సూక్ష్మ భాగమైన జీవకణంలో ఎందుకంత అద్భుతమైన డిజైన్‌ ఉంది? *

 ప్రజలు నమ్మేది: ‘పరిణామ సిద్ధాంతం ఖచ్చితమైనది అని రుజువైంది.’

 •   ఆ మాట చెప్పే వ్యక్తి ఆ రుజువులను పరిశోధించి తెలుసుకున్నాడా?

 •   తెలివైన వాళ్లందరూ దీన్ని నమ్ముతారని ఎవరో వాళ్లకు చెప్పినందుకే పరిణామ సిద్ధాంతాన్ని నమ్మే ప్రజలు ఎంతమంది ఉన్నారు?

^ మనుషుల మెదడు కోతుల మెదడు కంటే పెద్దది కాబట్టే మనుషులు కోతుల కంటే తెలివైనవాళ్లని కొంతమంది అంటారు. అయితే ఆ వాదన ఎందుకు సరైనది కాదో The Origin of Life—Five Questions Worth Asking, అనే బ్రోషురులోని 28వ పేజీలో చూడండి.

^ The Origin of Life—Five Questions Worth Asking అనే బ్రోషురులోని 8-12 పేజీలు చూడండి.