కంటెంట్‌కు వెళ్లు

కుటుంబం కోసం

కోపాన్ని అదుపుచేసుకోవడం ఎలా?

కోపాన్ని అదుపుచేసుకోవడం ఎలా?

 మీ భర్త/భార్య మీకు కోపం తెప్పించే ఏదోక మాట అన్నారు, లేదా అలాంటి పని చేశారు, మీరు కోపాన్ని అణచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈలోగా అతను/ఆమె ఏదో తప్పు జరిగిందని గమనించి ఆరాలు తీయడం మొదలుపెట్టారు. దాంతో మీ కోపం ఇంకా పెరిగిపోతోంది. అలాంటి పరిస్థితుల్లో మీ కోపాన్ని అదుపుచేసుకోవడం ఎలా?

 మీరేం తెలుసుకోవాలి?

 •   కోప్పడడం ఆరోగ్యానికి మంచిది కాదు. అదుపులేని కోపం వల్ల హై బీపీ, గుండె జబ్బులు, డిప్రెషన్‌, జీర్ణకోశ వ్యాధుల వంటి సమస్యలు ఎక్కువౌతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. అంతేకాదు, కోపం వల్ల నిద్రపట్టకపోవడం, ఆందోళన పెరిగిపోవడం, చర్మ వ్యాధులు, స్ట్రోక్‌ లాంటి సమస్యలు కూడా రావచ్చు. అందుకే బైబిలు ఇలా చెప్తోంది: “కోపము మానుము ... అది కీడుకే కారణము.”—కీర్తన 37:8.

 •   కోపాన్ని అణచుకోవడం కూడా మంచిది కాదు. కోపాన్ని అలాగే మనసులో ఉంచుకుంటే అది జబ్బులా లోపలి నుండి మిమ్మల్ని తినేస్తుంది. ఉదాహరణకు, దానివల్ల మీకు వెటకార ధోరణి, విమర్శించే స్వభావం అలవాటు కావచ్చు. అలాంటి స్ఫూర్తి వల్ల మీతో కలిసి ఉండడం కష్టం కావచ్చు, మీ వివాహ బంధానికి తీవ్ర నష్టం జరగవచ్చు.

 మీరేం చేయవచ్చు?

 •   మీ భర్త/భార్యలో ఉన్న మంచి లక్షణాలు చూడండి. మీ భర్త/భార్యలో మీకు నచ్చే మూడు లక్షణాలు ఏమిటో రాయండి. ఈసారి అతనిమీద/ఆమెమీద కోపం వచ్చినప్పుడు ఆ మంచి లక్షణాల గురించి ఆలోచించండి. దానివల్ల మీ కోపం తగ్గవచ్చు.

   బైబిలు సూత్రం: “కృతజ్ఞులై ఉండండి.”—కొలొస్సయులు 3:15.

 •    క్షమించే స్ఫూర్తి అలవర్చుకోండి. ముందుగా, విషయాల్ని మీ భర్త/భార్య వైపు నుండి చూడడానికి ప్రయత్నించండి. దానివల్ల మీరు “సహానుభూతిని” అలవర్చుకోగలుగుతారు. (1 పేతురు 3:8) తర్వాత, ‘ఇది నేను క్షమించలేనంత పెద్ద తప్పా?’ అని ఆలోచించండి.

   బైబిలు సూత్రం: “తప్పులు క్షమించుట ... ఘనతనిచ్చును.”—సామెతలు 19:11.

 •    మీ భావాల్ని దయతో, నొప్పించకుండా చెప్పండి. ఎక్కువగా “నేను,” “నాకు” అంటూ మాట్లాడండి. ఉదాహరణకు, “నా మీద నీకు శ్రద్ధ లేదు, అందుకే ఎక్కుడున్నావో ఫోన్‌ చేసి చెప్పవు” అనే బదులు “నువ్వు రావడం ఆలస్యమైతే నాకు కంగారుగా ఉంటుంది, ఎలా ఉన్నావో అని అనిపిస్తుంది” అని చెప్పండి. మృదువుగా మాట్లాడడం వల్ల మీ కోపం తగ్గవచ్చు.

   బైబిలు సూత్రం: “ఉప్పుతో ఆహారానికి రుచి వచ్చినట్టు, మంచితనంతో మీ మాటలకు రుచి వస్తుంది.”—కొలొస్సయులు 4:6.

 •    గౌరవపూర్వకంగా వినండి. మీకు ఏమనిపిస్తుందో చెప్పాక, మీ భర్తను/భార్యను మాట్లాడనివ్వండి, మధ్యలో అడ్డుపడకండి. అతను/ఆమె చెప్పడం పూర్తయ్యాక, ఆ మాటల్లో మీకేం అర్థమైందో చెప్పండి; దానివల్ల మీరు సరిగ్గా అర్థంచేసుకున్నారో లేదో తెలుస్తుంది. కేవలం వినడం అనే చిన్న పని కూడా మీ కోపాన్ని తగ్గించుకోవడానికి ఎంతో సహాయం చేయవచ్చు.

   బైబిలు సూత్రం: “వినడానికి సిద్ధంగా ఉండాలి, తొందరపడి మాట్లాడకూడదు.”—యాకోబు 1:19.