కంటెంట్‌కు వెళ్లు

ఉన్నంతలో ఎలా జీవించవచ్చు?

ఉన్నంతలో ఎలా జీవించవచ్చు?

పరిస్థితులు ఒక్కసారిగా తలక్రిందులు అవ్వడం వల్ల తక్కువ డబ్బుతో కుటుంబాన్ని పోషించాల్సి వస్తోందా? కొత్త రకాల జబ్బులు, ప్రకృతి విపత్తులు, రాజకీయ అల్లర్లు, యుద్ధాలు వంటివి ఆర్థిక పరిస్థితిని చిటికెలో మార్చేస్తాయి. నెలనెలా వచ్చే జీతం తగ్గిపోయినా లేదా పూర్తిగా రాకపోయినా ఇల్లు గడవడం చాలా ఇబ్బందిగా మారుతుంది. అయితే తక్కువ డబ్బుతో ఎలా సర్దుకుని జీవించవచ్చో తెలిపే తెలివైన సలహాలు బైబిల్లో ఉన్నాయి.

1. మారిన పరిస్థితులకు అలవాటు పడండి.

బైబిలు సూత్రం: ‘సమృద్ధిగా ఉన్నా, ఏమీ లేకున్నా తృప్తిగా ఎలా జీవించాలో నేర్చుకున్నాను.’—ఫిలిప్పీయులు 4:12.

ఒకప్పుడు వస్తున్నంత జీతం ఇప్పుడు రాకపోయినా, ఇప్పుడు వస్తున్న డబ్బుతో తృప్తిగా జీవించడం సాధ్యమే. మారిన పరిస్థితులకు వీలైనంత త్వరగా అలవాటుపడండి. ఎంత త్వరగా అలవాటుపడితే, మీరూ మీ కుటుంబం అంత త్వరగా మళ్లీ మామూలు జీవితం గడపగలుగుతారు.

ప్రభుత్వం లేదా ఇతర సంస్థలు ఇచ్చే పథకాలు ఏవైనా మీకు వర్తిస్తాయేమో తెలుసుకోండి. ఒకవేళ వర్తిస్తే, వాళ్లు ఇచ్చిన గడువు పూర్తికాక ముందే వాటికి అప్లై చేసుకోండి.

2. కష్టం నుండి బయటపడడానికి కుటుంబమంతా కలిసి పనిచేయండి.

బైబిలు సూత్రం: “ఒకరితో ఒకరు సంప్రదించుకోకపోతే ప్రణాళికలు విఫలమౌతాయి, సలహాదారులు ఎక్కువమంది ఉంటే పనులు జరుగుతాయి.”—సామెతలు 15:22.

ఇంట్లో పరిస్థితి గురించి మీ భర్తతో/భార్యతో, పిల్లలతో మాట్లాడండి. దాపరికం లేకుండా మాట్లాడుకుంటే కుటుంబ సభ్యులందరికీ పరిస్థితి అర్థమౌతుంది, ఉన్నంతలో సర్దుకుని జీవించడానికి వాళ్లు కూడా సహాయం చేయగలుగుతారు. అందరూ మాట్లాడుకుని పొదుపుగా జీవిస్తే, తక్కువ డబ్బును కూడా తెలివిగా ఉపయోగించుకోగలుగుతారు.

3. ఎంత డబ్బును దేనికి ఖర్చు చేయాలో రాసిపెట్టుకోండి.

బైబిలు సూత్రం: ‘కూర్చొని లెక్కలు రాసుకోండి.’—లూకా 14:28.

జీతం తగ్గినప్పుడు ఎంత డబ్బును దేనికి ఖర్చు చేస్తున్నామో రాసుకోవడం చాలా ప్రాముఖ్యం. ముందు, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మీకెంత జీతం వస్తోందో రాసుకోండి. తర్వాత, మీరు ప్రతీనెల దేనిదేనికి ఎంత ఖర్చు చేస్తారో రాసుకోండి, మీరు తగ్గించుకోవాలి అనుకుంటున్న ఖర్చుల్ని కూడా ఈ లిస్టులో చేర్చండి. అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవడానికి ఎంత డబ్బు పక్కన పెట్టాలనుకుంటున్నారో కూడా నెలవారీ ఖర్చుల్లో రాసుకోండి.

టిప్‌: చిల్లర ఖర్చుల్ని కూడా మర్చిపోకుండా రాసిపెట్టుకోండి. కొన్నిసార్లు మనకు తెలీకుండా వీటి కోసమే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేస్తుంటాం. ఒకతను తన నెలవారీ ఖర్చులన్నీ తిరగేసినప్పుడు, కేవలం బబుల్‌ గమ్‌లు కొనుక్కోవడానికే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినట్లు తెలుసుకున్నాడు!

4. అవసరమైన వాటికే డబ్బులు ఖర్చుపెట్టండి.

బైబిలు సూత్రం: ‘ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో పరిశీలించి తెలుసుకోండి.’—ఫిలిప్పీయులు 1:10.

మీకు ఎంత ఆదాయం వస్తోందో, మీరు ఎంత ఖర్చు చేస్తున్నారో పోల్చి చూసుకోండి. తర్వాత, ఎక్కడెక్కడ ఖర్చులు తగ్గించుకోవచ్చో ఒకసారి ఆలోచించండి. ఉదాహరణకు ఇవి గమనించండి:

  • బైక్‌లు/కార్లు. మీ దగ్గర ఒకటి కన్నా ఎక్కువ వాహనాలు ఉంటే, వాటిలో ఒకదాన్ని అమ్మేయగలరా? ఒకవేళ మీ దగ్గర ఎక్కువ ఖరీదైన బండి ఉంటే, దాన్ని అమ్మేసి తక్కువ ఖరీదులో మరోదాన్ని తీసుకోగలరా? అసలు సొంత వాహనం లేకుండా సిటీ బస్సులో గానీ, సైకిల్‌ మీద గానీ వెళ్లగలరా?

  • టీవీ/సినిమాలు. మీరు కేబుల్‌ టీవీ కనెక్షన్‌ గానీ, ఇంకేవైనా ఆన్‌లైన్‌ సబ్‌స్క్రిప్షన్‌లు గానీ తీసుకొని ఉంటే వాటిని కొన్ని రోజుల కోసం క్యాన్సిల్‌ చేసుకోగలరా? వాటికి బదులు తక్కువ ఖర్చుతో ఇంకేదైనా చూసుకోగలరా?

  • నిత్యావసరాలు. నీళ్లను, కరెంటును, పెట్రోలును పొదుపుగా ఎలా వాడుకోవచ్చో కుటుంబంలో అందరూ కలిసి మాట్లాడుకోండి. అవసరం లేనప్పుడు లైట్లు ఆపేయడం, తక్కువ నీళ్లు వాడడం లాంటి చిన్నచిన్న పనుల వల్ల ఎక్కువ డబ్బు ఆదా అవుతుంది.

  • భోజనం. హోటళ్లలో తినే బదులు ఇంట్లోనే వండుకొని తినండి. ఏం వండుకోవాలో ముందే ఆలోచించుకొని అవసరమైనవి కొనుక్కోండి. ఒకేసారి ఎక్కువ వండుకొని మిగతా రోజులు కూడా దాన్నే తినండి. కనిపించిన ప్రతీది కొనేయకుండా, మార్కెట్‌కు వెళ్లేముందే మీకు కావాల్సిన వస్తువుల లిస్టు రాసుకోండి. ఏ కాలంలో పండే కూరగాయల్ని ఆ కాలంలో కొనుక్కోండి, అవైతే తక్కువ రేటుకే దొరుకుతాయి. ఆరోగ్యాన్ని పాడుచేసే చిరుతిళ్లు కొనకండి. వీలైతే పెరట్లోనే కూరగాయల్ని పండించుకోండి.

  • బట్టలు. బట్టలు వాడుకోలేనంత పాతగా అయిపోతే తప్ప కొత్త బట్టలు కొనకండి. ఏవైనా ఆఫర్లు ఉన్నాయేమో చూడండి, లేదా మంచి బట్టల్ని తక్కువ రేటుకు అమ్మే సెకండ్‌ హ్యాండ్‌ స్టోర్‌లకు వెళ్లండి. వాతావరణం అనుకూలంగా ఉంటే బట్టల్ని కరెంటు డ్రైయర్లలో కాకుండా ఎండలో ఆరేయండి; అలా చేస్తే కరెంటు బిల్లు కాస్త తగ్గుతుంది.

  • ఏదైనా కొనాలనుకుంటే. ఏదైనా కొనాలనుకున్న ప్రతీసారి, ‘అది కొనేంత డబ్బు నా దగ్గర ఉందా? నాకు అది నిజంగా అవసరమా?’ అని ఆలోచించండి. కొత్త వస్తువుల్ని, వాహనాల్ని కొనే బదులు ప్రస్తుతం మీ దగ్గరున్న వాటినే కొంతకాలం వాడుకోగలరా? మీకు అవసరంలేని వస్తువులు, వాడని వస్తువులు ఏవైనా ఉంటే వాటిని అమ్మేయగలరా? ఇలా చేస్తే మీ భారం తగ్గుతుంది, కాస్త డబ్బు కూడా వస్తుంది.

టిప్‌: మీకొచ్చే ఆదాయం అకస్మాత్తుగా తగ్గిపోయినప్పుడు, మీ ఆరోగ్యాన్ని పాడుచేసే అలవాట్లను మానుకోవడానికి ఈ అవకాశం ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు సిగరెట్‌, మందు, జూదం లాంటి అలవాట్లు ఉంటే వాటిని మానుకోండి. అలా చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది, డబ్బులు కూడా మిగులుతాయి.

5. దేవుని గురించి తెలుసుకోండి.

బైబిలు సూత్రం: “దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు సంతోషంగా ఉంటారు”—మత్తయి 5:3.

బైబిలు ఈ తెలివైన సలహా ఇస్తోంది: “డబ్బులాగే తెలివి కూడా రక్షణగా ఉంటుంది; కానీ జ్ఞానం వల్ల, తెలివి వల్ల ప్రయోజనం ఏమిటంటే, అవి తమ యజమాని ప్రాణాన్ని కాపాడతాయి.” (ప్రసంగి 7:12) ఇలాంటి ఎన్నో తెలివైన సలహాలు బైబిల్లో ఉన్నాయి. వాటిని పాటించిన చాలామంది డబ్బు గురించి అనవసరంగా ఆందోళన పడకుండా నిశ్చింతగా జీవిస్తున్నారు.—మత్తయి 6:31, 32.