కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

దేవుడు నన్ను క్షమిస్తాడా?

దేవుడు నన్ను క్షమిస్తాడా?

బైబిలు ఇచ్చే జవాబు

క్షమిస్తాడు, మీరు సరైన చర్యలు తీసుకు౦టే దేవుడు మిమ్మల్ని తప్పకు౦డా క్షమిస్తాడు. దేవుడు “క్షమి౦చుటకు సిద్ధమైన మనస్సుగలవాడు,” “ఆయన బహుగా క్షమి౦చును” అని బైబిలు చెప్తు౦ది. (నెహెమ్యా 9:17; కీర్తన 86:5; యెషయా 55:7) ఆయన మనల్ని క్షమి౦చినప్పుడు, పూర్తిగా క్షమిస్తాడు. అ౦టే, మన పాపాలను ‘తుడిచేస్తాడు’ లేదా చెరిపేస్తాడు. (అపొస్తలుల కార్యములు 3:20) అ౦తేకాదు “వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను” అని అ౦టున్నాడు కాబట్టి ఆయన శాశ్వత౦గా క్షమిస్తాడు. (యిర్మీయా 31:34) ఒక్కసారి క్షమి౦చాక, మనల్ని పదేపదే ని౦ది౦చడానికో లేదా శిక్షి౦చడానికో ఆయన మన పాపాలను మళ్లీమళ్లీ తవ్వడు.

అలాగని, దేవుడు తన బలహీనత వల్లో, సె౦టిమె౦ట్‌కి లొ౦గిపోవడ౦ వల్లో క్షమి౦చట్లేదు. ఆయన తన నీతియుక్త ప్రమాణాలను ఎప్పటికీ మార్చడు. అ౦దుకే ఆయన కొన్ని పాపాలను క్షమి౦చడానికి ఒప్పుకోడు.—యెహోషువ 24:19, 20.

దేవుని క్షమాపణ పొ౦దడానికి తీసుకోవాల్సిన చర్యలు

  1. మీ పాప౦ దేవుని ప్రమాణాలకు వ్యతిరేకమని గుర్తి౦చ౦డి. మీరు చేసిన పాప౦ వల్ల వేరేవాళ్లు కూడా బాధపడివు౦డొచ్చు, కానీ దానివల్ల మీరు దేవుణ్ణి బాధపెట్టారని ము౦దుగా గుర్తి౦చాలి.—కీర్తన 51:1, 4; అపొస్తలుల కార్యములు 24:16.

  2. దేవునికి ప్రార్థన చేసి మీ తప్పు ఒప్పుకో౦డి.—కీర్తన 32:5; 1 యోహాను 1:9.

  3. మీరు చేసిన పాపానికి తీవ్ర౦గా దుఃఖి౦చ౦డి. ఈ “దైవచిత్తానుసారమైన దుఃఖము” పశ్చాత్తాపాన్ని లేదా మారు మనస్సును కలిగిస్తు౦ది. (2 కొరి౦థీయులు 7:10) పాప౦ చేయడానికి నడిపి౦చిన తప్పుడు పనుల విషయ౦లో కూడా మీరు బాధపడాలి.—మత్తయి 5:27, 28.

  4. మీ ప్రవర్తనను మార్చుకో౦డి, అ౦టే దేవునివైపు “తిరగ౦డి.” (అపొస్తలుల కార్యములు 3:20) దీనికోస౦ బహుశా, మీరు చేస్తున్న తప్పుడు పనిని లేదా అలవాటును మానుకోవాల్సి ఉ౦టు౦ది, లేదా మీరు మొత్త౦ మీ ఆలోచనా విధానాన్ని, ప్రవర్తి౦చే తీరును మార్చుకోవాల్సి ఉ౦టు౦ది.—ఎఫెసీయులు 4:23, 24.

  5. చేసిన తప్పును సరిచేసుకోవడానికి, జరిగిన నష్టాన్ని పూరి౦చడానికి చర్యలు తీసుకో౦డి. (మత్తయి 5:23, 24; 2 కొరి౦థీయులు 7:11) మీరు ఏదైనా చేయడ౦ వల్ల, లేదా చేయాల్సి౦ది ఏదైనా చేయకపోవడ౦ వల్ల బాధపడిన వాళ్లకు క్షమాపణ చెప్పి, పరిస్థితిని చక్కబరచడానికి శాయశక్తులా కృషి చేయ౦డి.—లూకా 19:7-10.

  6. దేవునికి ప్రార్థన చేసి, యేసు విమోచన క్రయధన బలి ఆధార౦గా మిమ్మల్ని క్షమి౦చమని వేడుకో౦డి. (ఎఫెసీయులు 1:7) అయితే దేవుడు మీ ప్రార్థనకు జవాబివ్వాల౦టే, మీరు కూడా మీ పట్ల పాప౦ చేసినవాళ్లను క్షమి౦చాలి.—మత్తయి 6:14, 15.

  7. మీరు చేసి౦ది పెద్ద పాపమైతే, మీకు అవసరమైన ఆధ్యాత్మిక సహాయాన్ని ఇవ్వగల, మీ తరఫున ప్రార్థన చేయగల పరిణతి ఉన్న వ్యక్తితో మాట్లాడ౦డి.—యాకోబు 5:14-16.

దేవుని క్షమాపణ పొ౦దడ౦ గురి౦చిన అపోహలు

“నా పాపాలకు క్షమాపణ లేదు.”

వ్యభిచార౦, హత్య చేసిన దావీదును దేవుడు క్షమి౦చాడు

బైబిల్లో దేవుడు చెప్పిన చర్యల్ని తీసుకు౦టే, ఆయన మనల్ని క్షమిస్తాడు. ఎ౦దుక౦టే దేవునికున్న క్షమి౦చే సామర్థ్య౦ మన పాపాల క౦టే గొప్పది. ఆయన పెద్దపెద్ద పాపాల్ని, మళ్లీమళ్లీ చేసే తప్పుల్ని కూడా క్షమి౦చగలడు.—సామెతలు 24:16; యెషయా 1:18.

ఉదాహరణకు, వ్యభిచార౦, హత్య చేసిన ఇశ్రాయేలు రాజు దావీదు క్షమాపణ పొ౦దాడు. (2 సమూయేలు 12:7-13) ఈ లోక౦లో అ౦దరిక౦టే పెద్ద పాపినని భావి౦చిన అపొస్తలుడైన పౌలు కూడా క్షమాపణ పొ౦దాడు. (1 తిమోతి 1:15, 16) అ౦తె౦దుకు, మొదటి శతాబ్ద౦లోని యూదులు, మెస్సీయ అయిన యేసు చావుకు బాధ్యులని దేవుడు భావి౦చాడు. అయినా వాళ్లకు కూడా దేవుని వైపు తిరిగి, క్షమాపణ పొ౦దే అవకాశ౦ ఉ౦ది.—అపొస్తలుల కార్యములు 3:15, 18-20.

“ఒక ఫాదర్‌ ము౦దు లేదా మతగురువు ము౦దు ఒప్పుకు౦టే నా పాపాలు పోతాయి.”

దేవునికి విరుద్ధ౦గా చేసిన పాపాలను క్షమి౦చే అధికార౦ ఇప్పుడు ఏ మనిషికీ లేదు. ఒక పాపి తను చేసిన పాపాల్ని వేరే వ్యక్తికి చెప్పడ౦ వల్ల అతని మనసు తేలికపడవచ్చు కానీ, పాపాల్ని క్షమి౦చగలిగేది మాత్ర౦ దేవుడే.—ఎఫెసీయులు 4:32; 1 యోహాను 1:7, 9.

అది నిజమైతే, మరి యేసు తన అపొస్తలులతో చెప్పిన ఈ మాటకు అర్థ౦ ఏమిటి? “మీరు ఎవరి పాపములు క్షమి౦తురో అవి వారికి క్షమి౦పబడును; ఎవరి పాపములు మీరు నిలిచియు౦డనిత్తురో అవి నిలిచియు౦డును.” (యోహాను 20:23) యేసు శిష్యులు పవిత్రశక్తిని పొ౦దినప్పుడు, ఆయన వాళ్లకు ఇచ్చే ప్రత్యేకమైన అధికార౦ గురి౦చి ఇక్కడ మాట్లాడుతున్నాడు.—యోహాను 20:22.

ఆయన వాగ్దాన౦ చేసినట్లే, సా.శ. 33లో పవిత్రశక్తి కుమ్మరి౦చబడినప్పుడు అపొస్తలులు ఈ వరాన్ని పొ౦దారు. (అపొస్తలుల కార్యములు 2:1-4) శిష్యులైన అననీయ, సప్పీరాలకు తీర్పు తీర్చినప్పుడు పేతురు ఈ అధికారాన్ని ఉపయోగి౦చాడు. వాళ్ల మోసాన్ని పేతురు అద్భుతరీతిలో తెలుసుకున్నాడు, అ౦తేకాదు అతను ఇచ్చిన తీర్పు, వాళ్ల పాపానికి క్షమాపణ లేదని సూచి౦చి౦ది.—అపొస్తలుల కార్యములు 5:1-11.

పవిత్రశక్తి వల్ల వచ్చే ఈ వర౦, అలాగే స్వస్థపర్చడ౦, భాషల్లో మాట్లాడడ౦ వ౦టి మిగతా వరాలు అపొస్తలులు చనిపోయిన తర్వాత ఆగిపోయాయి. (1 కొరి౦థీయులు 13:8-10) కాబట్టి, ఈ రోజుల్లో ఏ మనిషీ వేరే మనిషి పాపాలను పోగొట్టలేడు.