కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా?

మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా?

దేని గురించిన సత్యం? మానవులు ఎప్పుడూ ఆలోచించే అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సంబంధించిన సత్యం. బహుశా మీరు కూడా ఇలాంటి ప్రశ్నల గురించి ఆలోచించే ఉంటారు:

  • దేవునికి మనపై నిజంగా శ్రద్ధ ఉందా?
  • యుద్ధాలు, బాధలు ఎప్పటికైనా లేకుండా పోతాయా?
  • చనిపోయాక మనకేమవుతుంది?
  • చనిపోయినవారు తిరిగి బ్రతుకుతారా?
  • మనమెలా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు?
  • మనమెలా సంతోషంగా ఉండవచ్చు?

ఈ ప్రశ్నలకు జవాబులు ఎక్కడ దొరుకుతాయి? వీటికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా జవాబిస్తారు. మేధావులను, మతగురువులను అడిగినా వారు పొంతనలేని జవాబులిస్తారు. జవాబు లభిస్తుందని అందరూ అనుకునే వందలాది పుస్తకాలు గ్రంథాలయాల్లో లేదా పుస్తక దుకాణాల్లో కనిపిస్తాయి. అయినా ఒక పుస్తకంలోని విషయాలకు మరో పుస్తకంలోని విషయాలకు పొంతనవుండదు. మరికొన్ని పుస్తకాల్లోని విషయాలు ఇప్పుడు బాగానే అనిపిస్తాయి కానీ కొద్దికాలానికే పనికిరాకుండా పోతాయి, లేదా ఆ విషయాల్లో మార్పులు చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు వాటికి బదులు క్రొత్తవి చేర్చబడతాయి.

అయితే, నమ్మదగిన జవాబులిచ్చే పుస్తకం ఒకటుంది. అందులో సత్యముంది, అంటే ఖచ్చితమైన సమాచారముంది. యేసుక్రీస్తు దేవునికి ప్రార్థిస్తూ “నీ వాక్యమే సత్యము” అన్నాడు. (యోహాను 17:17) ఆ వాక్యమే పరిశుద్ధ బైబిలు అని నేడు మనకు తెలుసు. తర్వాతి పేజీల్లో, పై ప్రశ్నలకు బైబిలిచ్చే స్పష్టమైన, వాస్తవమైన జవాబులను మీరు టూకీగా చూస్తారు.

దేవునికి మనపై నిజంగా శ్రద్ధ ఉందా?

ప్రజల మధ్య ఉన్న వ్యక్తి

ఆ సందేహం ఎందుకొస్తుంది: మనం క్రూరత్వం, అన్యాయం నిండివున్న లోకంలో జీవిస్తున్నాము. దేవుని ఇష్టప్రకారమే మనకు కష్టాలు కలుగుతున్నాయని చాలా మతాలు బోధిస్తున్నాయి.

బైబిలు ఇలా చెబుతోంది: దేవుడు చెడు చేయడు. “దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము” అని యోబు 34:10లో ఉంది. మానవుల విషయంలో దేవునికి ఒక ప్రేమగల ఉద్దేశం ఉంది. అందుకే యేసు, “పరలోకమందున్న మా తండ్రీ, … నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అని ప్రార్థించమని మనకు నేర్పించాడు. (మత్తయి 6:9) దేవునికి మనపై ఎంతో శ్రద్ధ ఉంది కాబట్టే, తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయనెంతో శ్రమ తీసుకున్నాడు.—యోహాను 3:16.

ఆదికాండము 1:26-28; యాకోబు 1:13; 1 పేతురు 5:6, 7 కూడా చూడండి.

యుద్ధాలు, బాధలు ఎప్పటికైనా లేకుండా పోతాయా?

సైనికులు

ఆ సందేహం ఎందుకొస్తుంది: యుద్ధాల వల్ల లెక్కలేనంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటూనే ఉన్నారు. అందరం బాధలు అనుభవించినవాళ్లమే.

బైబిలు ఇలా చెబుతోంది: దేవుడు తాను భూవ్యాప్తంగా శాంతిని తీసుకొచ్చే ఒక కాలం గురించి చెబుతున్నాడు. ఆయన రాజ్యంలో ప్రజలు “యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయు[దురు].” బదులుగా, వారు “తమ ఖడ్గములను నాగటి నక్కులుగా … సాగగొట్టుదురు.” (యెషయా 2:4) దేవుడు అన్యాయాన్ని, బాధలను పూర్తిగా తీసివేస్తాడు. బైబిలు ఇలా వాగ్దానం చేస్తోంది: “[దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, [నేడున్న అన్యాయం, బాధలతో సహా] మొదటి సంగతులు గతించిపోయెను.”—ప్రకటన 21:3, 4.

కీర్తన 37:10, 11; 46:9; మీకా 4:1-4 కూడా చూడండి.

చనిపోయాక మనకేమవుతుంది?

సమాధులు

ఆ సందేహం ఎందుకొస్తుంది: మనిషి చనిపోయాక కనబడకుండా ఇంకా ఎక్కడో జీవించే ఉంటాడని లోకంలోని చాలా మతాలు బోధిస్తున్నాయి. చనిపోయిన వారు బ్రతికున్నవారికి హాని చేస్తారనో, దేవుడు చెడ్డవారిని నరకంలో పడేస్తాడనో కొంతమంది నమ్ముతారు.

బైబిలు ఇలా చెబుతోంది: చనిపోయాక మనుష్యులు ఇక ఎక్కడా జీవించి ఉండరు. “చచ్చినవారు ఏమియు ఎరుగరు” అని ప్రసంగి 9:5లో ఉంది. చనిపోయినవారికి ఏమీ తెలియదు, వారు పగపెట్టుకోలేరు ప్రేమించలేరు కాబట్టి వారు బ్రతికున్నవారికి హానీ చేయలేరు, సహాయమూ చేయలేరు.—కీర్తన 146:3, 4.

ఆదికాండము 3:19; ప్రసంగి 9:6, 10 కూడా చూడండి.

చనిపోయినవారు తిరిగి బ్రతుకుతారా?

ప్రియమైన వ్యక్తిని కోల్పోయి దుఃఖిస్తున్న పాప

ఆ సందేహం ఎందుకొస్తుంది: మనం బ్రతికేవుండాలని, మన కుటుంబంతో కలిసి ఆనందంగా జీవించాలని కోరుకుంటాము. చనిపోయిన సన్నిహితుల్ని మళ్లీ చూడాలని మనం సహజంగానే కోరుకుంటాము.

బైబిలు ఇలా చెబుతోంది: చనిపోయిన చాలామంది పునరుత్థానం చేయబడతారు అంటే మళ్లీ బ్రతుకుతారు. “సమాధులలోనున్నవారు … బయటికి వచ్చెదరు” అని యేసు వాగ్దానం చేశాడు. (యోహాను 5:28, 29) దేవుడు మొదట ఉద్దేశించినట్లే, పునరుత్థానం చేయబడినవారు పరదైసులో, అంటే అందమైన తోటలా మారిన భూమిపై జీవించే అవకాశాన్ని పొందుతారు. (లూకా 23:43) దేవుడు వాగ్దానం చేసినట్లే, విధేయులైన మానవులు భవిష్యత్తులో మంచి ఆరోగ్యంతో ఎప్పటికీ జీవించివుంటారు. “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు” అని బైబిలు చెబుతోంది.—కీర్తన 37:29.

యోబు 14:14, 15; లూకా 7:11-17; అపొస్తలుల కార్యములు 24:15 కూడా చూడండి.

మనమెలా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు?

ప్రార్థిస్తున్న వ్యక్తి

ఆ సందేహం ఎందుకొస్తుంది: దాదాపు అన్ని మతాల వారు ప్రార్థన చేస్తారు. అయినా, చాలామంది తమ ప్రార్థనలకు జవాబు దొరకడం లేదని అనుకుంటారు.

బైబిలు ఇలా చెబుతోంది: మనం ప్రార్థన చేసేటప్పుడు, ఒకే విధమైన పదాలను పదేపదే జపించకూడదని యేసు చెప్పాడు. “మీరు ప్రార్థన చేయునప్పుడు … వ్యర్థమైన మాటలు వచింపవద్దు” అని ఆయన చెప్పాడు. (మత్తయి 6:7) దేవుడు మన ప్రార్థనలను వినాలంటే ఆయన ఒప్పుకునే విధంగా ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయాలంటే, మనం దేవుని చిత్తమేమిటో తెలుసుకుని, దాని ప్రకారం ప్రార్థన చేయాలి. “ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును” అని 1 యోహాను 5:14 వివరిస్తోంది.

కీర్తన 65:2; యోహాను 14:6, 14; 1 యోహాను 3:22 కూడా చూడండి.

మనమెలా సంతోషంగా ఉండవచ్చు?

బైబిలు చదవడం ద్వారా సంతోషం కోసం వెదుకుతున్న స్త్రీ

ఆ సందేహం ఎందుకొస్తుంది: డబ్బు, పేరుప్రతిష్ఠలు, అందం ఉంటే సంతోషంగా ఉండవచ్చని చాలామంది నమ్ముతారు. అందుకే వాటి కోసం చాలా కష్టపడతారు, అయినా వారు సంతోషంగా ఉండలేరు.

బైబిలు ఇలా చెబుతోంది: ‘తమ ఆధ్యాత్మిక అవసరాన్ని గుర్తించినవారు సంతోషంగా ఉంటారు’ అంటూ యేసు మనం సంతోషంగా ఉండడానికి ఏమి చేయాలో వివరించాడు. (మత్తయి 5:3, NW) మనకున్న ముఖ్యమైన అవసరాన్ని తీర్చుకునేందుకు తగిన చర్యలు తీసుకున్నప్పుడే మనం నిజంగా సంతోషంగా ఉంటాము. ఆ అవసరాన్ని తీర్చుకునేందుకు మనం దేవుని గురించిన, మన విషయంలో ఆయనకున్న ఉద్దేశం గురించిన సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ సత్యం బైబిల్లో ఉంది. దాన్ని తెలుసుకోవడం ద్వారా మనం ఏది నిజంగా ప్రాముఖ్యమైనదో, ఏది కాదో గ్రహించగలుగుతాము. మనం తీసుకునే నిర్ణయాల్లో, మనం చేసే ప్రతి పనిలో బైబిలు నుండి మనం నేర్చుకున్న విషయాలను పాటించినట్లయితే సంతోషంగా జీవించగలుగుతాము.—లూకా 11:28.

సామెతలు 3:5, 6, 13-18; 1 తిమోతి 6:9, 10 కూడా చూడండి.

ఈ ఆరు ప్రశ్నలకు బైబిలు ఇస్తున్న జవాబులను మనం కొంతమేరకే పరిశీలించాము. ఈ విషయాల గురించి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు ‘మీ ఆధ్యాత్మిక అవసరాన్ని గుర్తిస్తే’ తప్పకుండా తెలుసుకోవాలనుకుంటారు. ‘దేవునికి మనపై నిజంగా శ్రద్ధ ఉంటే, ఆయన ఇంత చెడుని బాధని ఇంతకాలం ఎందుకు ఉండనిచ్చాడు? కుటుంబంలో ఎక్కువ సంతోషాన్ని మనమెలా పొందవచ్చు?’ వంటి కొన్ని ప్రశ్నలు మీకు రావచ్చు. బైబిలు వీటికే గాక మరెన్నో ప్రశ్నలకు సరైన, సంతృప్తికరమైన జవాబులిస్తుంది.

ఈ కాలంలో చాలామంది బైబిలు చదవడానికి వెనకాడతారు. బైబిలు ఒక పెద్ద పుస్తకం, దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అని వాళ్లనుకుంటారు. బైబిల్లో ఉన్న విషయాలను అర్థం చేసుకోవడానికి మీకు సహాయం కావాలా? యెహోవాసాక్షులు రెండు విధాలుగా మీకు సహాయం చేస్తారు.

మొదటిగా, ప్రాముఖ్యమైన ప్రశ్నలకు బైబిలు ఇస్తున్న స్పష్టమైన జవాబులను తీరిక దొరకనివారు సహితం పరిశీలించడానికి అనువుగా బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకం తయారు చేయబడింది. రెండవది, మీరు మీ ఇంట్లోనే ఉండి వేరొకరి సహాయంతో ఉచితంగా బైబిల్లోని విషయాలు తెలుసుకోవచ్చు. బైబిలు విషయాలు తెలిసిన యెహోవాసాక్షి మీ ఇంటికైనా మీకు వీలుగా ఉండే మరో చోటుకైనా వచ్చి ఉచితంగా ప్రతివారం కొంతసేపు బైబిలు విషయాలను మీకు తెలియజేస్తారు. ఈ ఏర్పాటుతో లక్షలాదిమంది ప్రయోజనం పొందారు. వారిలో చాలామంది ఎంతో ఆనందంతో ఇలా చెప్పారు: “మేము సత్యాన్ని తెలుసుకున్నాము!”

బైబిలు సత్యాన్ని తెలుసుకోవడాన్ని మించిన ఆనందం మరొకటి ఉండదు. బైబిలు సత్యం తెలుసుకున్నప్పుడు మనం మూఢనమ్మకాల నుండి, గందరగోళం నుండి, అనవసర భయాల నుండి బయటపడతాము. అంతేగాక భవిష్యత్తు గురించిన ఆశ మనలో చిగురిస్తుంది. జీవితానికి ఒక ఉద్దేశం ఏర్పడుతుంది. జీవితం ఆనందంగా సాగిపోతుంది. “మీరు … సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును” అని యేసు చెప్పాడు.—యోహాను 8:31-32.

1. బైబిలు ఏమి బోధిస్తోందో నేర్చుకుంటున్న వ్యక్తి; 2. బైబిలు ఏమి బోధిస్తోందో నేర్చుకుంటున్న స్త్రీ