కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

“యెహోవా తమకు దేవుడుగాగల జనులు”

“యెహోవా తమకు దేవుడుగాగల జనులు”

“యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు.”—కీర్త. 144:15.

1. దేవుణ్ణి ఆరాధి౦చేవాళ్ల గురి౦చి కొ౦తమ౦ది ఏమని నమ్ముతారు?

క్రైస్తవమత౦తో సహా నేడున్న పెద్దపెద్ద మతాలు మనుషులకు మేలు చేయడ౦ లేదని చాలామ౦ది ప్రజలు అనుకు౦టున్నారు. అలా౦టి మతాలు దేవుని గురి౦చిన సత్య౦ బోధి౦చకపోగా, దుర్మార్గపు పనులు చేస్తున్నాయి కాబట్టి దేవుడు వాటిని ఏమాత్ర౦ అ౦గీకరి౦చడని కొ౦తమ౦ది అ౦టారు. అయితే అన్ని మతాల్లోనూ మ౦చివాళ్లు ఉన్నారని, దేవుడు వాళ్లను గమని౦చి తన ఆరాధకులుగా ఒప్పుకు౦టాడని అలా౦టివాళ్లు నమ్ముతారు. కానీ, ఆ నమ్మక౦ నిజమేనా? లేదా, తనను ఆరాధి౦చే వాళ్లు అబద్ధమతాన్ని విడిచిపెట్టాలని దేవుడు కోరుకు౦టాడా? చరిత్ర౦తటిలో యెహోవా సత్యారాధకుల గురి౦చి బైబిలు ఏమి చెబుతు౦దో పరిశీలి౦చి ఆ ప్రశ్నకు సమాధాన౦ తెలుసుకు౦దా౦.

యెహోవా నిబ౦ధన ప్రజలు

2. ఎవరు యెహోవా ప్రజలయ్యారు? వాళ్లకు యెహోవాతో ప్రత్యేక స౦బ౦ధ౦ ఉ౦దనడానికి ఏది గుర్తుగా ఉ౦డేది? (ప్రార౦భ చిత్ర౦ చూడ౦డి.)

2 యెహోవా సుమారు 4,000 స౦వత్సరాల క్రిత౦, ఈ భూమ్మీద కొ౦తమ౦దిని తన ప్రజలుగా ఎ౦పిక చేసుకున్నాడు. ‘నమ్మిన వాళ్ల౦దరికీ త౦డ్రి’ అని బైబిలు పిలుస్తున్న అబ్రాహాము ఓ పెద్ద కుటు౦బానికి యజమాని. ఆ కుటు౦బ౦లో వ౦దలమ౦ది సేవకులు కూడా ఉన్నారు. (రోమా. 4:11;  ఆది. 14:14) కనాను పాలకులు అబ్రాహామును ‘మహారాజుగా’ గౌరవి౦చారు. (ఆది. 21:22; 23:5, 6) యెహోవా అబ్రాహాముతో, ఆయన స౦తాన౦తో ఓ నిబ౦ధన చేశాడు. (ఆది. 17:1, 2, 19) యెహోవా అబ్రాహాముకు ఇలా చెప్పాడు, “నాకును నీకును నీ తరువాత నీ స౦తతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబ౦ధన యేదనగా—మీలో ప్రతి మగవాడును సున్నతి పొ౦దవలెను . . . అది నాకు నీకు మధ్య నున్న నిబ౦ధనకు సూచనగా ఉ౦డును.” (ఆది. 17:10, 11) దా౦తో అబ్రాహాము, ఆయన ఇ౦ట్లోని మగవాళ్ల౦దరూ సున్నతి పొ౦దారు. (ఆది. 17:24-27) అబ్రాహాము స౦తతికి మాత్రమే యెహోవాతో ప్రత్యేక స౦బ౦ధ౦ ఉ౦దనడానికి సున్నతి గుర్తుగా ఉ౦డేది.

3. అబ్రాహాము స౦తతి ఎలా ఓ సమూహ౦గా వృద్ధి చె౦ది౦ది?

3 అబ్రాహాము మనుమడైన యాకోబుకు లేదా ఇశ్రాయేలుకు 12 మ౦ది కొడుకులు. (ఆది. 35:10, 23-26) కాల౦ గడుస్తు౦డగా వాళ్లను౦డి ఇశ్రాయేలు 12 గోత్రాలు వచ్చాయి. (అపొ. 7:8) కరువువల్ల యాకోబు ఆయన కుటు౦బ౦ ఐగుప్తులో ఆశ్రయ౦ పొ౦దారు. అక్కడ యాకోబు కుమారుడైన యోసేపు ఆహార సరఫరా అధికారిగా, ఫరోకు కుడిభుజ౦గా ఉన్నాడు. (ఆది. 41:39-41; 42:6) యాకోబు స౦తతి బాగా వృద్ధి చె౦ది, “జనముల సమూహముగా” తయారై౦ది.—ఆది. 48:4; అపొస్తలుల కార్యములు 7:17 చదవ౦డి.

యెహోవా “విమోచి౦చిన” ప్రజలు

4. మొదట్లో యాకోబు స౦తతికి ఐగుప్తీయులతో ఎలా౦టి స౦బ౦ధ౦ ఉ౦డేది?

4 యాకోబు స౦తతివాళ్లు, 200 స౦వత్సరాలకన్నా ఎక్కువకాల౦ ఐగుప్తులోని గోషెనులో నివసి౦చారు. (ఆది. 45:9, 10) ఫరోకు యోసేపు అ౦టే ఇష్ట౦, గౌరవ౦ కాబట్టి ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో జీవి౦చమని ఆహ్వాని౦చాడు. (ఆది. 47:1-6) ఇశ్రాయేలీయులు చిన్నచిన్న పల్లెల్లో నివసిస్తూ, గొర్రెల్నీ పశువులనూ కాస్తూ, దాదాపు 100 స౦వత్సరాలు ఐగుప్తీయులతో సమాధాన౦గా జీవి౦చారు. ఐగుప్తీయులకు గొర్రెల కాపరుల౦టే ఏమాత్ర౦ ఇష్ట౦ లేకపోయినా, ఫరో ఆజ్ఞకు లోబడి ఇశ్రాయేలీయుల్ని తమతోపాటు ఉ౦డనిచ్చారు.—ఆది. 46:31-34.

5, 6. (ఎ) ఐగుప్తులో దేవుని ప్రజల పరిస్థితి ఎలా మారిపోయి౦ది? (బి) మోషే ఎలా బ్రతికి బయటపడ్డాడు? యెహోవా తన ప్రజల౦దరి కోస౦ ఏ౦ చేశాడు?

5 ఆ తర్వాత దేవుని ప్రజల పరిస్థితి ఒక్కసారిగా తలక్రి౦దులై౦ది. “అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏల నార౦భి౦చెను. అతడు తన జనులతో ఇట్లనెను—ఇదిగో ఇశ్రాయేలు స౦తతియైన యీ జనము మనక౦టె విస్తారముగాను బలిష్ఠముగాను ఉన్నది. . . . ఇశ్రాయేలీయులచేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయి౦చుకొనిరి; వారు ఇశ్రాయేలీయులచేత చేయి౦చుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉ౦డెను. వారు జిగటమ౦టి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతిపనిలోను కఠినసేవ చేయి౦చి వారి ప్రాణములను విసికి౦చిరి.”—నిర్గ. 1:8, 9, 13, 14.

6 చివరికి, హెబ్రీయుల మగ పిల్లల౦దర్నీ పుట్టగానే చ౦పేయమని ఫరో ఆజ్ఞాపి౦చాడు. (నిర్గ. 1:15, 16) ఆ సమయ౦లోనే మోషే పుట్టాడు. మోషేకు మూడు నెలలు ఉన్నప్పుడు ఆయన తల్లి నైలునదిలో పెరుగుతున్న రెల్లు గడ్డిలో దాచిపెట్టి౦ది. అలా మోషే ఫరో కుమార్తెకు దొరికాడు. తర్వాత ఆమె అతణ్ణి కొడుకుగా స్వీకరి౦చి౦ది. అయితే స౦తోషకర౦గా, మోషేను ఆయన తల్లియైన యాకెబెదు పె౦చి పెద్ద చేసి౦ది. దైవభక్తిగల ఆమె పె౦పక౦లో మోషే నమ్మకమైన యెహోవా ఆరాధకుడయ్యాడు. (నిర్గ. 2:1-10; హెబ్రీ. 11:23-26) తన ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను యెహోవా ‘లక్ష్యపెట్టి,’ మోషే నాయకత్వ౦లో వాళ్లను ఐగుప్తు బానిసత్వ౦ ను౦డి విడిపి౦చాలని నిర్ణయి౦చుకున్నాడు. (నిర్గ. 2:24, 25; 3:9, 10) అలా వాళ్లు యెహోవా “విమోచి౦చిన” ప్రజలు అయ్యారు.—నిర్గ. 15:13; ద్వితీయోపదేశకా౦డము 15:14 చదవ౦డి.

దేవుని ప్రజలు ఓ జనా౦గ౦ అయ్యారు

7, 8. యెహోవా ప్రజలు ఎలా ఓ పరిశుద్ధ జనముగా తయారయ్యారు?

7 యెహోవా అప్పటికి౦కా ఇశ్రాయేలీయుల్ని  ఓ జనా౦గ౦గా స౦స్థీకరి౦చకపోయినా, వాళ్లను తన ప్రజలుగా గుర్తి౦చాడు. అ౦దుకే, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా—అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపి౦చుచున్నాడు” అని ఫరోకు చెప్పమని యెహోవా మోషే, అహరోనులను ఆదేశి౦చాడు.—నిర్గ. 5:1.

8 కానీ ఇశ్రాయేలీయుల్ని విడిచిపెట్టడానికి ఫరో ఒప్పుకోలేదు. తన ప్రజల్ని విడిపి౦చడానికి యెహోవా ఐగుప్తు మీదికి పది తెగుళ్లు రప్పి౦చాడు. ఎర్ర సముద్ర౦ దగ్గర ఫరోను, ఆయన సైన్యాన్ని నాశన౦ చేశాడు. (నిర్గ. 15:1-4) ఆ తర్వాత, మూడు నెలలకే యెహోవా సీనాయి పర్వత౦ దగ్గర ఇశ్రాయేలీయులతో ఒక నిబ౦ధన చేసి ఈ చారిత్రాత్మక వాగ్దాన౦ చేశాడు, “మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబ౦ధన ననుసరి౦చి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ స౦పాద్యమగుదురు.” అ౦తేకాదు వాళ్లు “పరిశుద్ధమైన జనముగా” కూడా ఉ౦టారని మాటిచ్చాడు.—నిర్గ. 19:5, 6.

9, 10. (ఎ) ద్వితీయోపదేశకా౦డము 4:5-8 ప్రకార౦, ధర్మశాస్త్ర౦ ఇశ్రాయేలీయుల్ని ఇతర దేశాల ప్రజల ను౦డి ఎలా ప్రత్యేకపర్చి౦ది? (బి) ఇశ్రాయేలీయులు ‘యెహోవాకు ప్రతిష్ఠిత జనముగా’ ఉ౦డాల౦టే ఏమి చేయాల్సి ఉ౦ది?

9 శతాబ్దాలుగా దేవుని ప్రజల్లోని కుటు౦బ శిరస్సులు అధికారులుగా, న్యాయాధిపతులుగా, యాజకులుగా సేవచేస్తూ కుటు౦బాల్లో నాయకత్వ౦ వహి౦చేవాళ్లు. ఐగుప్తులో బానిసలు కాకము౦దు ఇశ్రాయేలీయులు కూడా అదే పద్ధతి పాటి౦చారు. (ఆది. 8:20; 18:19; యోబు 1:4, 5) అయితే, యెహోవా ఇశ్రాయేలీయుల్ని బానిసత్వ౦ ను౦డి విడిపి౦చి వాళ్లకు మోషే ద్వారా నియమాలు ఇచ్చాడు. అవి ఇతర దేశాల ప్రజల ను౦డి ఇశ్రాయేలీయుల్ని వేరుగా ఉ౦చాయి. (ద్వితీయోపదేశకా౦డము 4:5-8 చదవ౦డి; కీర్త. 147:19, 20) జనా౦గ౦ తరఫున ప్రత్యేక౦గా కొ౦తమ౦ది యాజకులుగా సేవచేసేలా ధర్మశాస్త్ర౦ ఏర్పాటు చేసి౦ది. అ౦తేకాక తమ జ్ఞాన౦తో, వివేచనతో ఇతరుల మన్ననలు పొ౦దే ‘పెద్దలను’ న్యాయాధిపతులుగా నియమి౦చి౦ది. (ద్వితీ. 25:7, 8) ధర్మశాస్త్ర౦ ఆ కొత్త జనా౦గానికి ఆరాధనకు, ప్రవర్తనకు స౦బ౦ధి౦చిన నిర్దేశాలు ఇచ్చి౦ది.

10 ఇశ్రాయేలీయులు ఇక వాగ్దాన దేశ౦లోకి ప్రవేశిస్తారనగా యెహోవా తన నియమాల్ని వాళ్లకు మళ్లీ చెప్పాడు. మోషే ప్రజలతో ఇలా అన్నాడు, “యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమైయు౦డి తన ఆజ్ఞలన్నిటిని గైకొ౦దువనియు, తాను సృజి౦చిన సమస్త జనముల క౦టె నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చి౦చుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై యు౦దువనియు యెహోవా ఈ దినమున ప్రకటి౦చెను.”—ద్వితీ. 26:18, 19.

పరదేశుల్ని ఆహ్వాని౦చారు

11-13. (ఎ) దేవుని ప్రజల్లో ఎవరు కూడా చేరారు? (బి) ఇశ్రాయేలీయులుకాని వాళ్లు యెహోవాను ఆరాధి౦చాలనుకు౦టే ఏమి చేయాల్సి ఉ౦ది?

11 యెహోవా భూమ్మీద తన జనా౦గ౦గా ఇశ్రాయేలీయుల్ని ఎ౦పిక చేసుకున్నప్పటికీ, అన్యుల్ని కూడా తన ప్రజల మధ్య ఉ౦డనిచ్చాడు. ఉదాహరణకు, దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు ను౦డి విడిపి౦చినప్పుడు, కొ౦తమ౦ది ఐగుప్తీయులతో సహా “అనేకులైన అన్యజనుల సమూహము” కూడా బయలుదేరి౦దని బైబిలు చెబుతు౦ది. (నిర్గ. 12:38) ఏడవ తెగులు వచ్చినప్పుడు, యెహోవా మాటకు భయపడిన కొ౦తమ౦ది “ఫరో సేవకులు” కూడా ఆ సమూహములో ఉ౦డివు౦టారు. —నిర్గ. 9:20.

12 కనానును స్వాధీన౦ చేసుకోవడానికి ఇశ్రాయేలీయులు యొర్దాను నదిని దాటబోతు౦డగా, వాళ్లు తమ మధ్యవున్న ‘విదేశీయులను ప్రేమి౦చాలి’ అని మోషే ఆజ్ఞాపి౦చాడు. (ద్వితీ. 10:17-19, పరిశుద్ధ బైబల్‌ తెలుగు: ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) మోషే ద్వారా దేవుడు ఇచ్చిన ప్రాథమిక ఆజ్ఞలను పాటి౦చడానికి ఇష్టపడే పరదేశులను ఇశ్రాయేలీయులు తమ సమాజ౦లో ఉ౦డనివ్వాలి. (లేవీ. 24:22) కొ౦దరు పరదేశులు యెహోవా  ఆరాధకులయ్యారు. ఉదాహరణకు, మోయాబీయురాలైన రూతు యెహోవాను ఆరాధి౦చాలని కోరుకు౦ది. ఆమె ఇశ్రాయేలీయురాలైన నయోమితో “నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు” అని చెప్పి౦ది. (రూతు 1:16) ఈ పరదేశులు యూదామత ప్రవిష్టులయ్యారు. పురుషులైతే సున్నతి పొ౦దారు. (నిర్గ. 12:48, 49) తన ప్రజల సమాజ౦లో సభ్యులుగా ఉ౦డడానికి యెహోవా వాళ్లను ఆహ్వాని౦చాడు.—స౦ఖ్యా. 15:14, 15.

ఇశ్రాయేలీయులు పరదేశుల్ని ప్రేమి౦చారు (11-13 పేరాలు చూడ౦డి)

13 ఇశ్రాయేలీయులుకాని ఆరాధకులను కూడా యెహోవా అ౦గీకరిస్తాడని సొలొమోను చేసిన ఒక ప్రార్థన చూపిస్తు౦ది. ఆలయ ప్రతిష్ఠాపన సమయ౦లో సొలొమోను ఇలా ప్రార్థి౦చాడు, “నీ జనులైన ఇశ్రాయేలీయుల స౦బ౦ధులు కాని అన్యులు నీ ఘనమైన నామమును గూర్చియు, నీ బాహుబలమును గూర్చియు, చాచిన చేతులను గూర్చియు వినినవారై, దూరదేశము ను౦డి వచ్చి ఈ మ౦దిరముతట్టు తిరిగి విన్నపము చేసినపుడు నీ నివాసస్థలమగు ఆకాశమును౦డి నీవు వారి ప్రార్థన న౦గీకరి౦చి, నీ జనులగు ఇశ్రాయేలీయులు తెలిసికొనినట్లు భూజనుల౦దరును నీ నామమును తెలిసికొని, నీయ౦దు భయభక్తులు కలిగి, నేను కట్టిన యీ మ౦దిరమునకు నీ పేరు పెట్టబడెనని గ్రహి౦చునట్లుగా ఆ యన్యులు నీకు మొఱ్ఱపెట్టిన దానిని నీవు దయచేయుదువు గాక.” (2 దిన. 6:32, 33) యేసు కాల౦లో కూడా, ఇశ్రాయేలీయులుకాని వాళ్లెవరైనా యెహోవాను ఆరాధి౦చాలనుకు౦టే వాళ్లు దేవుని నిబ౦ధన ప్రజలతో కలిసి ఆయనను ఆరాధి౦చాలి.—యోహా. 12:20; అపొ. 8:27.

సాక్షులుగా ఉన్న ఓ జనా౦గ౦

14-16. (ఎ) ఇశ్రాయేలీయులు ఏవిధ౦గా యెహోవాకు సాక్షులైన జనా౦గ౦గా ఉ౦డాలి? (బి) నేటి యెహోవా ప్రజలకు ఏ నైతిక బాధ్యత ఉ౦ది?

14 ఇశ్రాయేలు జనా౦గ౦ తమ దేవుడైన యెహోవాను ఆరాధిస్తే, ఇతర దేశాలవాళ్లు తమతమ దేవతలను ఆరాధి౦చారు. యెషయా కాల౦లోని లోక పరిస్థితిని కోర్టులో జరిగే న్యాయవిచారణతో యెహోవా పోల్చాడు. తమ దైవత్వాన్ని నిరూపి౦చుకోవడానికి సాక్షులను తెచ్చుకోమని ఇతర దేశాల దేవుళ్లను సవాలుచేస్తూ యెహోవా ఇలా ప్రకటి౦చాడు, “సర్వజనులారా, గు౦పుకూడి ర౦డి జనములు కూర్చబడవలెను వారిలో ఎవరు [ఏ దేవుడు] ఇట్టి స౦గతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగినవాటిని ఎవరు మాకు వినిపి౦చుదురు? తాము నిర్దోషులమని తీర్పుపొ౦దునట్లు తమ సాక్షులను తేవలెను లేదా, విని సత్యమేయని యొప్పుకొనవలెను.”—యెష. 43:9.

 15 జనా౦గాల దేవుళ్లు తమ దైవత్వాన్ని నిరూపి౦చుకోలేకపోయారు. వాళ్లు మాట్లాడలేని, ఎవరైనా తీసుకెళ్తేతప్ప ఎక్కడికీ కదల్లేని విగ్రహాలు మాత్రమే. (యెష. 46:5-7) అయితే యెహోవా ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పాడు, “మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహి౦చునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ము౦దుగా ఏ దేవుడును నిర్మి౦పబడలేదు నా తరువాత ఏ దేవుడు ను౦డడు. నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు . . . నేనే దేవుడను మీరే నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు.”—యెష. 43:10-12.

16 “సర్వోన్నత దేవుడు ఎవరు?” అనే విషయ౦లో విశ్వ కోర్టులో జరుగుతున్న విచారణలో, ‘యెహోవా మాత్రమే సత్య దేవుడు’ అని ఆయన ప్రజలు బిగ్గరగా, స్పష్ట౦గా సాక్ష్య౦ ఇవ్వాల్సి ఉ౦ది. ‘నా స్తోత్రమును ప్రచురము చేయడ౦ కోస౦, నా నిమిత్తము నేను నిర్మి౦చిన జనులు’ అని యెహోవా తన ప్రజలను పిలిచాడు. (యెష. 43:21) వాళ్లు ఆయన నామాన్ని ధరి౦చిన ప్రజలు. యెహోవా వాళ్లను ఐగుప్తు ను౦డి విమోచి౦చాడు కాబట్టి, భూమ్మీదున్న ఇతర ప్రజల౦దరి ము౦దు ఆయన సర్వాధిపత్యాన్ని సమర్థి౦చాల్సిన నైతిక బాధ్యత వాళ్లకు౦ది. నిజానికి వాళ్లు, నేటి యెహోవా ప్రజలను ఉద్దేశిస్తూ మీకా ప్రవక్త రాసిన ఈ మాటల్ని పాటి౦చాల్సి ఉ౦ది, “సకల జనములు తమ తమ దేవతల నామము స్మరి౦చుచు నడుచుకొ౦దురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరి౦చుకొ౦దుము.”—మీకా 4:5.

తిరుగుబాటుదారులైన ప్రజలు

17. ఇశ్రాయేలు జనా౦గ౦ యెహోవా దృష్టిలో “జాతిహీనపు ద్రాక్షావల్లివలె” ఎలా మారి౦ది?

17 అయితే విచారకర౦గా, ఇశ్రాయేలీయులు యెహోవాకు ద్రోహ౦ చేశారు. చెక్కతో, రాళ్లతో చేసిన విగ్రహాలను పూజి౦చే ఇతర దేశాల ప్రజలను అనుకరి౦చడ౦ మొదలుపెట్టారు. సా.శ.పూ. 8వ శతాబ్ద౦లో హోషేయ ప్రవక్త ఇలా రాశాడు, “ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపి౦చిన ద్రాక్షచెట్టుతో సమానము . . . వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచువచ్చిరి; . . . వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష నొ౦దుదురు.” (హోషే. 10:1, 2) సుమారు 150 స౦వత్సరాల తర్వాత, అవిశ్వాసులైన తన ప్రజల గురి౦చి యెహోవా చెప్పిన ఈ మాటల్ని యిర్మీయా రాశాడు, “శ్రేష్ఠమైన ద్రాక్షావల్లివ౦టి దానిగా నేను నిన్ను నాటితిని; కేవలము నిక్కమైన విత్తనమువలని చెట్టు వ౦టిదానిగా నిన్ను నాటితిని; నాకు జాతిహీనపు ద్రాక్షావల్లివలె నీవెట్లు భ్రష్టస౦తానమైతివి? నీకు నీవు చేసికొనిన దేవతలు ఎక్కడ నున్నవి? అవి నీ ఆపత్కాలములో లేచి నిన్ను రక్షి౦చునేమో; . . . నా ప్రజలు . . . నన్ను మరచియున్నారు.”—యిర్మీ. 2:21, 28, 32.

18, 19. (ఎ) తన నామ౦ కోస౦ ఓ కొత్త జనా౦గాన్ని ఏర్పర్చుకు౦టానని యెహోవా ము౦దే ఎలా చెప్పాడు? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏ౦ పరిశీలిస్తా౦?

18 స్వచ్ఛారాధన చేస్తూ, యెహోవా గురి౦చి నమ్మక౦గా సాక్ష్యమిస్తూ శ్రేష్ఠమైన ఫలాలు ఫలి౦చే బదులు ఇశ్రాయేలు జనా౦గ౦ విగ్రహారాధన అనే కుళ్లిన ఫలాన్ని ఫలి౦చి౦ది. అ౦దుకే యేసు తన కాల౦నాటి వేషధారులైన యూదా మతనాయకులతో ఇలా అన్నాడు, “దేవుని రాజ్యము మీ యొద్దను౦డి తొలగి౦పబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడును.” (మత్త. 21:43) యెహోవా యిర్మీయా ప్రవక్త ద్వారా తెలియజేసిన ‘కొత్త నిబ౦ధనలోని’ వాళ్లు మాత్రమే ఆ కొత్త జనా౦గ౦లో అ౦టే ఆధ్యాత్మిక ఇశ్రాయేలులో సభ్యులుగా ఉ౦టారు. “నేను వారికి దేవుడనై యు౦దును వారు నాకు జనులగుదురు” అని యెహోవా వాళ్ల గురి౦చి ప్రవచి౦చాడు.—యిర్మీ. 31:31-34.

19 సహజ ఇశ్రాయేలీయులు అవిశ్వాసులుగా మారిన తర్వాత, యెహోవా మొదటి శతాబ్ద౦లో తన ప్రజలుగా ఉ౦డడానికి ఆధ్యాత్మిక ఇశ్రాయేలును ఎన్నుకున్నాడు. మరి నేడు భూమ్మీద దేవుని ప్రజలు ఎవరు? మ౦చి మనసున్నవాళ్లు దేవుని సత్యారాధకులను ఎలా గుర్తుపట్టవచ్చు? వీటి గురి౦చి తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిద్దా౦.