కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

మన బాధలకు కారణం ఎవరు?

మన బాధలకు కారణం ఎవరు?

బాధలకు కారణం దేవుడు కానప్పుడు ఆహార కొరతలకు, కటిక పేదరికానికి, భయంకరమైన యుద్ధాలకు, ప్రాణాంతకమైన రోగాలకు, ప్రకృతి విపత్తులకు కారణం ఎవరు? దేవుని వాక్యమైన బైబిలు, మనుషుల బాధలకు మూడు ప్రధాన కారణాలను చెప్తుంది.

  1. స్వార్థం, దురాశ, ద్వేషం. “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు.” (ప్రసంగి 8:9) అపరిపూర్ణులు, స్వార్థపరులు, క్రూరులైన మనుషుల వల్ల ప్రజలు ఎక్కువగా బాధలు అనుభవిస్తున్నారు.

  2. అనుకోని సమయంలో, అనుకోకుండా జరిగే సంఘటనలు. అదృష్టవశముచేత, కాలవశము చేత జరుగుతున్న సంఘటనల వల్ల ప్రజలు ఎక్కువగా బాధలు అనుభవిస్తున్నారు. (ప్రసంగి 9:11) అంటే ప్రజలు అనుకోకుండా ఉండకూడని చోట ఉండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి, లేదా ప్రజల నిర్లక్ష్యం లేదా వాళ్ల తప్పుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.

  3. ఒక దుష్టుడు ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడు. మనుషుల సమస్యలకు ప్రధాన కారణం ఎవరో బైబిలు స్పష్టంగా చెప్తుంది. అందులో ఇలా ఉంది: “లోకమంతా దుష్టుని గుప్పిట్లో ఉంది.” (1 యోహాను 5:19) ఆ దుష్టుడు అపవాది అయిన సాతాను. మొదట్లో సాతాను దేవుని దగ్గర ఒక శక్తివంతమైన దేవదూతగా ఉన్న ఆత్మప్రాణి, కానీ “అతను సత్యంలో స్థిరంగా నిలబడలేదు.” (యోహాను 8:44) స్వార్థపూరిత కోరికలు తీర్చుకోవడానికి కొంతమంది ఆత్మప్రాణులు సాతానుతో కలిసి దేవునికి ఎదురు తిరిగారు, అలా వాళ్లు చెడ్డ దూతలు లేదా దయ్యాలు అయ్యారు. (ఆదికాండము 6:1-5) దేవునికి ఎదురు తిరిగినప్పటినుండి, సాతాను అతని చెడ్డ దూతలు ఈ లోక వ్యవహారాల మీద వాళ్ల శక్తివంతమైన, క్రూరమైన ప్రభావాన్ని చూపిస్తున్నారు. ముఖ్యంగా మన కాలంలో అది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు అపవాది చాలా కోపంతో, “లోకమంతటినీ మోసం చేస్తున్నాడు.” దానివల్ల “భూమికి . . . శ్రమ.” (ప్రకటన 12:9, 12) నిజానికి సాతాను క్రూరమైన నియంత. మనుషులు బాధలు అనుభవిస్తుంటే చూసి సాతాను పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. ప్రజలు బాధలు అనుభవించడానికి కారణం సాతాను, దేవుడు కాదు.

ఆలోచించండి: హృదయం లేని ఒక దుష్టుడే అమాయకమైన ప్రజలను బాధలుపెడతాడు. కాని దానికి వేరుగా బైబిలు ఇలా చెప్తుంది: “దేవుడు ప్రేమ.” (1 యోహాను 4:8) ఆయన ప్రేమగల వ్యక్తిత్వాన్ని బట్టి, “దేవుడు అన్యాయము చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము.”—యోబు 34:10.

అయితే ‘సర్వశక్తిగల దేవుడు సాతాను దుష్ట పరిపాలనను ఎంతకాలం ఉండనిస్తాడు?’ అనే ఆలోచన మీకు రావచ్చు. మనం చూసినట్లుగా, దేవుడు దుష్టత్వాన్ని అసహ్యించుకుంటాడు, మన బాధలు ఆయనకు ఎంతో వేదన కలిగిస్తాయి. అంతేకాదు, ఆయన వాక్యం ఇలా చెప్తుంది: “మీరంటే ఆయనకు పట్టింపు ఉంది కాబట్టి మీ ఆందోళనంతా ఆయన మీద వేయండి.” (1 పేతురు 5:7) దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఇంకా బాధలన్నిటిని, అన్యాయం అంతటిని తీసేసే శక్తి ఆయనకు ఉంది. ఆయన దానిని ఎలా చేస్తాడో తర్వాత ఆర్టికల్‌ వివరిస్తుంది. *

^ పేరా 7 దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడో వివరంగా తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకంలో 11వ అధ్యాయం చూడండి. ఈ పుస్తకాన్ని www.jw.org/te వెబ్‌సైట్‌ నుండి కూడా ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.