కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

 అధ్యయన ఆర్టికల్‌ 5

మీటింగ్స్‌కు హాజరవడం వల్ల ఏ లక్షణాలు చూపిస్తాం?

మీటింగ్స్‌కు హాజరవడం వల్ల ఏ లక్షణాలు చూపిస్తాం?

‘ప్రభువు మరణం గురించి ప్రకటిస్తూ ఉండండి; ఆయన వచ్చేవరకు అలా చేయండి.’—1 కొరిం. 11:26.

పాట 18 విమోచన క్రయధనంపట్ల కృతజ్ఞత

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. (ఎ) ప్రభువు రాత్రి భోజనానికి లక్షలమంది హాజరైనప్పుడు యెహోవా ఏం చూస్తాడు? (ముఖచిత్రం చూడండి.) (బి) ఈ ఆర్టికల్‌లో మనం ఏం చర్చిస్తాం?

ప్రభువు రాత్రి భోజనానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది హాజరైనప్పుడు యెహోవా ఏం చూస్తాడో ఊహించగలరా? ఈ ఆచరణకు హాజరైన ఒక పెద్ద గుంపును మాత్రమే కాదుగానీ, వాళ్లలో ఒక్కో వ్యక్తిని ఆయన చూస్తాడు. ఉదాహరణకు, ప్రతీ సంవత్సరం ఈ ఆచరణకు నమ్మకంగా వస్తున్నవాళ్లను ఆయన చూస్తాడు. వాళ్లలో కొందరు, తీవ్రమైన హింస ఎదుర్కొంటుండవచ్చు. ఇంకొందరు మిగతా మీటింగ్స్‌కు క్రమంగా రాకపోయినా, జ్ఞాపకార్థ ఆచరణ ప్రాముఖ్యతను గుర్తించి దానికి హాజరై ఉండవచ్చు. బహుశా కుతూహలం కొద్దీ, మొదటిసారి ఈ ఆచరణకు హాజరైనవాళ్లను కూడా యెహోవా గమనిస్తాడు.

2 జ్ఞాపకార్థ ఆచరణకు చాలామంది హాజరవడం చూసి యెహోవా ఖచ్చితంగా సంతోషిస్తాడు. (లూకా 22:19) అయితే, ఎంతమంది హాజరయ్యారు అనే దానికన్నా ఏ కారణంతో వాళ్లు హాజరయ్యారు అనే దానిగురించే ఆయన ఎక్కువ ఆలోచిస్తాడు. అవును, వాళ్లు రావడం వెనుకున్న ఉద్దేశమే యెహోవాకు ముఖ్యం. ఈ ఆర్టికల్‌లో ప్రాముఖ్యమైన ఈ ప్రశ్న గురించి చర్చించుకుంటాం: ప్రతీ సంవత్సరం జరిగే జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవడంతోపాటు, తనను ప్రేమించేవాళ్లకోసం యెహోవా ఏర్పాటు చేస్తున్న మిగతా మీటింగ్స్‌కు కూడా మనమెందుకు హాజరౌతాం?

ప్రభువు రాత్రి భోజనానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది ఆహ్వానించబడుతున్నారు (1-2 పేరాలు చూడండి)

వినయం

3-4. (ఎ) మనం మీటింగ్స్‌కు ఎందుకు హాజరౌతాం? (బి) మీటింగ్స్‌కు హాజరైనప్పుడు మనకు ఏ లక్షణం ఉందని చూపిస్తాం? (సి) 1 కొరింథీయులు 11:23-26 ప్రకారం మనం జ్ఞాపకార్థ ఆచరణకు ఎందుకు తప్పకుండా హాజరవ్వాలి?

3 మనం మీటింగ్స్‌కు హాజరవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, అవి మన ఆరాధనలో భాగం. అంతేకాదు యెహోవా బోధించే విషయాలను నేర్చుకోవడానికి కూడా మనం మీటింగ్స్‌కు హాజరౌతాం. గర్విష్ఠులు  తమకెవ్వరూ బోధించాల్సిన అవసరం లేదని నమ్ముతారు. (3 యోహా. 9) దానికి భిన్నంగా, మనం మాత్రం యెహోవా, ఆయన సంస్థ బోధించే విషయాలను నేర్చుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తాం.—యెష. 48:17, 18; యోహా. 6:45.

4 మీటింగ్స్‌కు హాజరవడం ద్వారా మనకు వినయం ఉందని, నేర్చుకోవడానికి ఇష్టంగా, సిద్ధంగా ఉన్నామని చూపిస్తాం. అయితే, జ్ఞాపకార్థ ఆచరణ చాలా ప్రాముఖ్యమని మనకు తెలుసు కాబట్టి మనం దానికి హాజరౌతాం. అంతేకాదు “నన్ను గుర్తుచేసుకోవడానికి దీన్ని చేస్తూ ఉండండి” అని యేసు ఇచ్చిన ఆజ్ఞను వినయంగా పాటిస్తాం కాబట్టి హాజరౌతాం. (1 కొరింథీయులు 11:23-26 చదవండి.) ఆ ఆచరణ, భవిష్యత్తు పట్ల మనకున్న నిరీక్షణను బలపరుస్తుంది. అంతేకాదు యెహోవా మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో గుర్తుచేస్తుంది. మనకు సంవత్సరానికి ఒక్కసారే కాదుగానీ చాలాసార్లు ప్రోత్సాహం, బలం అవసరమని యెహోవాకు తెలుసు. అందుకే, ప్రతీవారం మీటింగ్స్‌ ఏర్పాటు చేసి వాటికి హాజరవమని చెప్తున్నాడు. మనకు వినయం ఉంటే ఆయన చెప్పింది చేస్తాం. ప్రతీవారం మీటింగ్స్‌కు సిద్ధపడడానికి, హాజరవడానికి చాలా గంటలు వెచ్చిస్తాం.

5. యెహోవా ఇస్తున్న ఆహ్వానానికి వినయస్థులు ఎలా స్పందిస్తారు?

5 తన దగ్గర నేర్చుకోమని యెహోవా ఇస్తున్న ఆహ్వానానికి ప్రతీ సంవత్సరం చాలామంది వినయస్థులు స్పందిస్తున్నారు. (యెష. 50:4) జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనవాళ్లు మిగతా మీటింగ్స్‌కు కూడా హాజరవడం మొదలుపెడుతున్నారు. (జెక. 8:20-23) మన సహాయకుడు, రక్షకుడు అయిన యెహోవా బోధల్ని, నిర్దేశాల్ని వినడానికి కొత్తవాళ్లతో పాటు మనం కూడా ఎంతో సంతోషిస్తాం. (కీర్త. 40:17) యెహోవా, యేసు బోధిస్తున్న విషయాల్ని వినేందుకు మీటింగ్స్‌కు హాజరవడం కన్నా ప్రాముఖ్యమైన, సంతోషకరమైన పని ఏదైనా ఉందంటారా?—మత్త. 17:5; 18:20; 28:20.

6. ఒకవ్యక్తి జ్ఞాపకార్థ ఆచరణకు వచ్చేలా వినయం ఎలా సహాయం చేసింది?

6 ప్రతీ సంవత్సరం, యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు వీలైనంత ఎక్కువమందిని ఆహ్వానించడానికి మనం కృషిచేస్తాం. మన ఆహ్వానాన్ని మన్నించి ఆ ఆచరణకు హాజరైన చాలామంది వినయస్థులు ప్రయోజనం పొందారు. ఒక ఉదాహరణ పరిశీలించండి. కొన్ని సంవత్సరాల క్రితం మన సహోదరుడు, ఒకతనికి జ్ఞాపకార్థ ఆహ్వానపత్రం ఇచ్చాడు. అయితే, ఆ మీటింగ్‌కి రావడం కుదరదని అతను చెప్పాడు. కానీ ఆచరణ రోజు అతను రాజ్యమందిరానికి రావడం చూసి మన సహోదరుడు ఆశ్చర్యపోయాడు. రాజ్యమందిరంలో సహోదరులు పలకరించిన విధానం అతనికి బాగా నచ్చింది. ఆ తర్వాత ప్రతీవారం జరిగే మీటింగ్స్‌కు కూడా హాజరవడం మొదలుపెట్టాడు. నిజానికి, సంవత్సరం మొత్తంలో కేవలం మూడుసార్లే మీటింగ్స్‌కు వెళ్లలేకపోయాడు. ఇంతకీ మీటింగ్స్‌కు క్రమంగా హాజరవ్వాలని అతనెందుకు నిర్ణయించుకున్నాడు? తన ఆలోచనను మార్చుకునేంత వినయం అతనికి ఉంది. అతనికి ఆహ్వానపత్రం ఇచ్చిన సహోదరుడు, “అతను చాలా వినయస్థుడు” అని చెప్పాడు. ఖచ్చితంగా యెహోవాయే అతన్ని ఆకర్షించాడు. ఇప్పుడు అతను బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షి అయ్యాడు.—1 పేతు. 5:5; యోహా. 6:44.

7. మీటింగ్స్‌లో నేర్చుకున్న విషయాలు, బైబిల్లో చదివిన విషయాలు మనం వినయంగా ఉండడానికి ఎలా సహాయం చేస్తాయి?

7 మీటింగ్స్‌లో నేర్చుకునే విషయాలు, బైబిల్లో చదివే విషయాలు మనం వినయంగా ఉండడానికి సహాయం చేస్తాయి. ముఖ్యంగా జ్ఞాపకార్థ ఆచరణకు ముందు వారాల్లో జరిగే మీటింగ్స్‌లో యేసు ఆదర్శం గురించి, విమోచన క్రయధనం చెల్లించడానికి ఆయన చూపించిన వినయం గురించి ఎక్కువగా వింటాం. ఆ ఆచరణకు కొన్ని రోజుల ముందు, యేసు మరణానికి, పునరుత్థానానికి సంబంధించిన బైబిలు వృత్తాంతాలను చదవడం మంచిది. ఆ సమయంలో మీటింగ్స్‌లో నేర్చుకున్న విషయాల వల్ల, బైబిల్లో చదివిన వృత్తాంతాల వల్ల యేసు బలిపట్ల మనకున్న కృతజ్ఞత పెరుగుతుంది. అప్పుడు యేసులా వినయంగా ఉండగలుగుతాం, కష్ట పరిస్థితుల్లో కూడా యెహోవా ఇష్టాన్ని చేయగలుగుతాం.—లూకా 22:41, 42.

 ధైర్యం

8. యేసు ఎలా ధైర్యం చూపించాడు?

8 ధైర్యం చూపించే విషయంలో కూడా మనం యేసును అనుకరించడానికి కృషి చేస్తాం. ఆయన చనిపోవడానికి కొన్నిరోజుల ముందు చూపించిన ధైర్యం గురించి ఒకసారి ఆలోచించండి. శత్రువులు తనను అవమానిస్తారని, కొడతారని, చంపుతారని యేసుకు బాగా తెలుసు. (మత్త. 20:17-19) అయినప్పటికీ, ఆయన చనిపోవడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయం వచ్చినప్పుడు, గెత్సేమనే తోటలో తనతోపాటు ఉన్న నమ్మకమైన అపొస్తలులతో ఇలా అన్నాడు, “లేవండి, వెళ్దాం. ఇదిగో! నన్ను అప్పగించేవాడు దగ్గరికి వచ్చేశాడు.” (మత్త. 26:36, 46) ఒక గుంపు తనను బంధించడానికి ఆయుధాలతో వచ్చినప్పుడు, యేసు ధైర్యంగా ముందుకొచ్చి, తానే యేసునని చెప్పి, అపొస్తలులను వెళ్లనివ్వమని సైనికుల్ని ఆజ్ఞాపించాడు. (యోహా. 18:3-8) యేసు ఎంతటి అసాధారణ ధైర్యం చూపించాడో కదా! నేడు అభిషిక్త క్రైస్తవులు, వేరే గొర్రెలు ఆయనలా ధైర్యం చూపించడానికి కృషి చేస్తున్నారు. ఎలా?

మీరు ధైర్యంగా మీటింగ్స్‌కు హాజరవడం చూసి ఇతరులు ప్రోత్సాహం పొందుతారు (9వ పేరా చూడండి) *

9. (ఎ) మనం మీటింగ్స్‌కు క్రమంగా హాజరవ్వాలంటే ఏ లక్షణం చూపించాలి? (బి) విశ్వాసం కారణంగా జైల్లో ఉన్న సహోదరులపై మన ఆదర్శం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?

9 మనం మీటింగ్స్‌కు క్రమంగా హాజరవ్వాలంటే కష్టపరిస్థితుల్లో ధైర్యం చూపించాల్సి ఉంటుంది. కొంతమంది సహోదరసహోదరీలు బాధ, నిరుత్సాహం లేదా అనారోగ్య సమస్యల వల్ల కృంగిపోయినప్పటికీ మీటింగ్స్‌కు హాజరౌతున్నారు. ఇంకొంతమంది, కుటుంబ సభ్యుల నుండి ప్రభుత్వ అధికారుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నప్పటికీ ధైర్యంగా మీటింగ్స్‌కు హాజరౌతున్నారు. విశ్వాసం కారణంగా జైల్లో వేయబడ్డ సహోదరులపై మన ఆదర్శం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఆలోచించండి. (హెబ్రీ. 13:3) కష్టాలు ఉన్నా మనం యెహోవా సేవలో కొనసాగుతున్నామని వాళ్లు విన్నప్పుడు, ఇంకా ఎక్కువ విశ్వాసాన్ని, ధైర్యాన్ని, యథార్థతను చూపించగలుగుతారు. అపొస్తలుడైన పౌలుకు కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. ఆయన రోములో జైల్లో ఉన్నప్పుడు, సహోదరులు దేవునికి నమ్మకంగా సేవ చేస్తున్నారని తెలిసిన ప్రతీసారి సంతోషించేవాడు. (ఫిలి. 1:3-5, 12-14) ఆయన విడుదలవ్వడానికి కొంచెం ముందు లేదా విడుదలైన కొన్ని రోజులకు హెబ్రీ సంఘానికి ఉత్తరం రాశాడు. ఆ సంఘంలో ఉన్న నమ్మకమైన క్రైస్తవులను “సోదర ప్రేమ చూపిస్తూ” ఉండమని, మీటింగ్స్‌కు మానకుండా హాజరవమని చెప్పాడు.—హెబ్రీ. 10:24, 25; 13:1.

10-11. (ఎ) జ్ఞాపకార్థ ఆచరణకు మనం ఎవర్ని ఆహ్వానిస్తాం? (బి) అలా చేయడానికి ఎఫెసీయులు 1:7⁠లో ఏ కారణం ఉంది?

10 జ్ఞాపకార్థ ఆచరణకు బంధువుల్ని, తోటి ఉద్యోగుల్ని, ఇరుగుపొరుగువాళ్లను ఆహ్వానించడం ద్వారా ధైర్యం చూపిస్తాం. వాళ్లను ఎందుకు ఆహ్వానిస్తాం? యెహోవా, యేసు మనకోసం చేసినవాటన్నిటి పట్ల కృతజ్ఞతతో ఇతరుల్ని ఆహ్వానిస్తాం. అంతేకాదు, విమోచన క్రయధనం ద్వారా యెహోవా చూపించిన “అపారదయ” నుండి వాళ్లు కూడా ఎలా ప్రయోజనం పొందవచ్చో తెలుసుకోవాలని కోరుకుంటాం కాబట్టి ఆహ్వానిస్తాం.—ఎఫెసీయులు 1:7 చదవండి; ప్రకటన 22:17.

11 మీటింగ్స్‌కు హాజరవడం ద్వారా ధైర్యాన్ని చూపించినప్పుడు, మనం ఇంకో విలువైన లక్షణాన్ని కూడా చూపిస్తాం. ఆ లక్షణాన్ని యెహోవా, యేసు సాటిలేని విధానాల్లో చూపించారు.

 ప్రేమ

12. (ఎ) మీటింగ్స్‌కు హాజరవడం వల్ల మనకు యెహోవామీద, యేసు మీదున్న ప్రేమ ఎలా పెరుగుతుంది? (బి) యేసును అనుకరిస్తూ మనం ఏం చేయాలని 2 కొరింథీయులు 5:14, 15 ప్రోత్సహిస్తుంది?

12 యెహోవా మీద, యేసు మీద ప్రేమతోనే మనం మీటింగ్స్‌కు హాజరౌతాం. అక్కడ నేర్చుకునే విషయాల వల్ల మనకు వాళ్ల మీదున్న ప్రేమ పెరుగుతుంది. ఎలా? వాళ్లు మనకోసం చేసిన వాటిగురించి మీటింగ్స్‌లో తరచూ వింటుంటాం. (రోమా. 5:8) యెహోవాకు యేసుకు మనమీద, చివరికి విమోచన క్రయధనం విలువ తెలియని వాళ్లమీద కూడా ఎంత ప్రగాఢమైన ప్రేమ ఉందో జ్ఞాపకార్థ ఆచరణ తెలియజేస్తుంది. విమోచన క్రయధన ఏర్పాటుపట్ల కృతజ్ఞతతో నిండిన మనం మన జీవన విధానంలో యేసును అనుకరించడానికి ప్రయత్నిస్తాం. (2 కొరింథీయులు 5:14, 15, చదవండి.) అంతేకాదు, ఆ ఏర్పాటు చేసినందుకు యెహోవాను స్తుతించేలా పురికొల్పబడతాం. ఆయన్ని స్తుతించడానికి ఒక మార్గమేమిటంటే, మీటింగ్స్‌లో హృదయపూర్వకంగా కామెంట్స్‌ చెప్పడం.

13. మనకు యెహోవా మీద, యేసు మీద ఎంత ప్రేమ ఉందో ఎలా చూపించవచ్చు? వివరించండి.

13 యెహోవా కోసం, యేసు కోసం ఇష్టంగా త్యాగాలు చేయడం ద్వారా వాళ్లమీద మనకెంత ప్రేమ ఉందో చూపిస్తాం. మీటింగ్స్‌కు హాజరవడానికి మనం తరచూ ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. చాలా సంఘాలు ఒక మీటింగ్‌ను వారం మధ్యలో సాయంత్రాలు జరుపుకుంటాయి. నిజానికి ఆ సమయంలో మనం చాలావరకు అలసిపోయి ఉండవచ్చు. ఇంకో మీటింగ్‌ను వారాంతంలో జరుపుకుంటాయి. ఆ సమయంలో మిగతావాళ్లందరూ విశ్రాంతి తీసుకుంటారు. మనం అలసటతో ఉన్నా మీటింగ్స్‌కు హాజరైనప్పుడు యెహోవా గమనిస్తాడా? తప్పకుండా గమనిస్తాడు. నిజానికి, మనమెంత ఎక్కువ కృషిచేస్తే, తనపట్ల మనం చూపిస్తున్న ప్రేమను యెహోవా అంతెక్కువ విలువైనదిగా చూస్తాడు.—మార్కు 12:41-44.

14. స్వయంత్యాగపూరిత ప్రేమ చూపించడంలో యేసు ఎలా అత్యుత్తమ ఆదర్శం ఉంచాడు?

14 స్వయంత్యాగపూరిత ప్రేమ చూపించే విషయంలో యేసు మనకు అత్యుత్తమ ఆదర్శం ఉంచాడు. ఆయన తన శిష్యుల కోసం చనిపోవడానికి సిద్ధమయ్యాడు. అంతేకాదు ప్రతీరోజు తన అవసరాల కన్నా శిష్యుల అవసరాల్నే ఎక్కువ పట్టించుకున్నాడు. ఉదాహరణకు, ఆయన శారీరకంగా అలసిపోయినప్పుడు లేదా మానసికంగా కృంగిపోయినప్పుడు కూడా తన శిష్యులతో సమయం గడిపాడు. (లూకా 22:39-46) ఆయన ఎంతసేపూ ఇతరులకు ఏం ఇవ్వగలను అనే దానిగురించే ఆలోచించాడు  తప్పా ఇతరులనుండి ఏం పొందగలను అనే దానిగురించి ఎన్నడూ ఆలోచించలేదు. (మత్త. 20:28) మనకు కూడా యెహోవా మీద, మన సహోదరుల మీద అలాంటి ప్రేమ ఉంటే, జ్ఞాపకార్థ ఆచరణకు అలాగే మిగతా మీటింగ్స్‌ అన్నిటికీ హాజరవడానికి శాయశక్తులా కృషిచేస్తాం.

15. ముఖ్యంగా ఎవరికి సహాయం చేయడానికి మనం ఆసక్తి చూపిస్తాం?

15 మనం నిజ క్రైస్తవుల సహోదర బృందంలో సభ్యులం. కొత్తవాళ్లను ఈ బృందంలోకి ఆహ్వానించడానికి మనం వీలైనంత ఎక్కువ సమయం వెచ్చిస్తాం. అయితే, నిష్క్రియులుగా మారిన ‘తోటి విశ్వాసులకు’ సహాయం చేయడానికి మరిముఖ్యంగా ఆసక్తి చూపిస్తాం. (గల. 6:10) వాళ్లను మీటింగ్స్‌కు, ముఖ్యంగా జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవమని ప్రోత్సహించడం ద్వారా ప్రేమ చూపిస్తాం. మన ప్రేమగల తండ్రి, కాపరి అయిన యెహోవా దగ్గరకు నిష్క్రియులు తిరిగివచ్చినప్పుడు మనం కూడా యెహోవాలా, యేసులా చాలా సంతోషిస్తాం.—మత్త. 18:14.

16. (ఎ) మనం ఒకరినొకరం ఎలా ప్రోత్సహించుకోవచ్చు? మీటింగ్స్‌ మనకెలా సహాయం చేస్తాయి? (బి) యోహాను 3:16⁠లో యేసు చెప్పిన మాటల్ని గుర్తుచేసుకోవడానికి ఇది మంచి సమయమని ఎందుకు చెప్పవచ్చు?

16 రానున్న వారాల్లో 2019, ఏప్రిల్‌ 19 శుక్రవారం సాయంత్రం జరిగే జ్ఞాపకార్థ ఆచరణకు వీలైనంత ఎక్కువమందిని ఆహ్వానించండి. ( “మీరు వాళ్లను ఆహ్వానిస్తారా?” అనే బాక్సు చూడండి.) వచ్చే సంవత్సరంలో యెహోవా మనకోసం ఏర్పాటు చేసే అన్ని మీటింగ్స్‌కి క్రమంగా హాజరవడం ద్వారా ఒకరినొకరం ప్రోత్సహించుకుందాం! ఈ వ్యవస్థ అంతానికి దగ్గరౌతుండగా మనం వినయం, ధైర్యం, ప్రేమ చూపిస్తూ ఉండడానికి మీటింగ్స్‌ సహాయం చేస్తాయి. (1 థెస్స. 5:8-11) కాబట్టి, మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న యెహోవా, యేసు గురించి మనం ఎలా భావిస్తున్నామో మనస్ఫూర్తిగా చూపిద్దాం!—యోహాను 3:16 చదవండి.

పాట 126 మెలకువగా, విశ్వాసంలో స్థిరంగా ఉండండి

^ పేరా 5 2019, ఏప్రిల్‌ 19 శుక్రవారం సాయంత్రం జరిగే యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణ, సంవత్సరమంతటిలో చాలా ప్రాముఖ్యమైన మీటింగ్‌. దానికి మనమెందుకు హాజరౌతాం? ఎందుకంటే, మనం యెహోవాను సంతోషపెట్టాలనుకుంటాం. అయితే, జ్ఞాపకార్థ ఆచరణకు అలాగే వారంలో జరిగే మీటింగ్స్‌కు హాజరవడం వల్ల మనం ఎలాంటి లక్షణాలు చూపిస్తున్నామో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

^ పేరా 52 చిత్రాల వివరణ : విశ్వాసం కారణంగా జైల్లో ఉన్న ఒక సహోదరుడు ఇంటి నుండి వచ్చిన ఉత్తరాన్ని చదివి ప్రోత్సాహం పొందుతున్నాడు. కుటుంబ సభ్యులు తనను మర్చిపోలేదని, తమ ప్రాంతంలో అంతర్గత పోరాటాలు జరుగుతున్నా తన కుటుంబం యెహోవాకు నమ్మకంగా ఉందని తెలుసుకొని ఆయన చాలా సంతోషిస్తున్నాడు.